Monday, November 25, 2024
spot_img

అంత‌రంగాన్ని ఆవిష్క‌రించిన‌ స‌బితా ఇంద్రారెడ్డి

Must Read
  • ఈ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు.. రక్షణ లేదు..
  • అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ మహిళలను అవమానించారు..
  • రాజశేఖర రెడ్డి హయాంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత
  • అనునిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల ప‌రిష్కారం
  • నేను పార్టీ మారుతున్నాను అనే వార్తల్లో నిజం లేదు..
  • బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు తెలుస్తోంది..
  • రేవంత్ రెడ్డి సారధ్యంలో గాడి తప్పిన పరిపాలన
  • ప్రతిష్టాత్మకమైన రైతుబంధు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ది..
  • కేటీఆర్ సారధ్యంలో రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు
  • ప్రజలకు వాస్తవాలు వెల్లడించి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం..
  • వాస్తవాలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తోంది
  • ఆదాబ్ హైద‌రాబాద్ ప‌త్రిక‌తో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఆమె మాటల్లో అమ్మతనం జాలువారుతుంది.. ఆమె కళ్ళల్లో వాత్సల్యం కురుస్తుంది.. నిజాయితీగా, ధైర్యంగా మాట్లాడటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.. కేవలం ప్రజాసేవ కోసమే.. తన భర్త ఆశయాలకోసమే.. తనకు రాజకీయ పీఠం అందించిన ప్రియతమ నేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మాటలనే మననం చేసుకుంటూ.. తనపై నమ్మకంతో గురుతర బాధ్యతలు చేపట్టిన బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంత్రిగా త్రికరణ శుద్ధితో బాధ్యతలు నెరవేర్చిన గొప్ప నాయకురాలు.. తెలంగాణాలో గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవాలో సైతం ఆమె సేవా నిరతిని గుర్తించి, జ్ఞాపకం పెట్టుకున్న ప్రజలు ఆమెను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించారు.. పార్టీ ఓటమి పాలైనా ఏరోజూ ఆమె తన సేవా కార్యక్రమాలను నిలపలేదు.. ప్రతినిత్యం వందలాదిమంది తనను కలిసే ప్రజలతో ఎంతో అభిమానంగా మాట్లాడుతూ తన పరిధిలో, తనకు చేతనైన సహాయం చేస్తూనే ఉన్నారు.. తన నియోజక వర్గాన్ని, నియోజక వర్గ ప్రజలను, తన వెన్నంటి ఉండే కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో అవమానాలను చిరునవ్వుతో స్వీకరిస్తూనే ఉన్నారు.. ఆమె ఎవరో కాదు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి.. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి ఇంటికి వెళ్ళినప్పుడు.. వివిధ సమస్యలతో, పరిష్కారం కోసం ఆమెను నమ్ముకుని వచ్చినవారు వందల సంఖ్యలో ఉన్నారంటే సబితమ్మ సేవా నిరతి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.. ఒక్క బీ ఆర్ ఎస్ పార్టీ వాళ్ళే కాకుండా తన నియోజక వర్గం నుంచి ఎంతో మంది ఆమె కోసం అక్కడ వేచి ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.. ఒక ప్రజా నాయకురాలిగా అలుపెరుగని రీతిలో ముందుకు సాగుతున్న ఆమె అకుంఠిత దీక్షకు హేట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.. ఆమె మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..

చల్లటి మంచినీళ్లు, వెచ్చటి తేనీరుతో సబితమ్మతో ఆదాబ్ చిట్ చాట్ మొదలైంది..
చిరునవ్వుతో ఆమె చెప్పిన విశేషాలు ఎంతైనా ముదావహం..

ఆదాబ్ : ఏమిటి ప్రస్తుత మీ పరిస్థితి.. మున్ముందు కార్యాచరణ ఎలా ఉండబోతోంది..?

సబితా : పరిస్థితి ఏముంది చాలా బావుంది.. కార్యాచరణలో కొత్తగా చెప్పడానికి ఏముంది.. ప్రజా సేవే నా దినచర్య.. మీరు అంటున్నది మేము అంటే మా పార్టీ ఓడిపోయిందనేగా.. చూడండి గెలుపు ఓటమిలు అన్నవి రాజకీయాల్లో సహజం.. ఒక్క రాజకీయం ఏముంది జీవితంలోనే గెలుపు ఓటమిలు అన్నవి సహజమేగా..? పార్టీ ఓడిపోయిందన్న విషయాన్ని పట్టించుకోము.. అధికారం ఎప్పటికీ ఒకరి సొంతం కాదన్నది అక్షర సత్యం.. ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలన్నదే మా ముందున్న కర్తవ్యం.. ప్రజలు మమ్మల్ని పూర్తిగా మరచిపోలేదు.. మేము చేసిన అభివృద్ధి వారికి తెలుసు అందుకే మాకు కూడా విలువైన సీట్లు ఇచ్చారు.. అందులో ఎమ్మెల్యేగా నేను కూడా గెలిచాను.. గెలిపించిన ప్రజల బాగోగులు చూడటమే నా విధి..

ఆదాబ్ :

మీరు మంత్రి గా అటు కాంగ్రెస్ పార్టీలోనూ, ఇటు బీ ఆర్ ఎస్ లోనూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలందించారు.. కానీ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోవడం ఎలా అనిపిస్తోంది..
సబితా ( నవ్వుతూ ) : అదే చెప్పానుగా ఒక ప్రజా ప్రతినిధిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను.. అందులో ఎంతో తృప్తి ఉంది.. కేవలం పదవులకోసం మాత్రమే నేను రాజకీయాల్లోకి రాలేదు.. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.. అప్పట్లో నా ప్రాణానికి ప్రాణమైన నా భర్త స్వర్గీయ ఇంద్రా రెడ్డి గారు అర్ధాంతంగా మమ్మల్ని విడిచి వెళ్లిపోయిన తరువాత.. అప్పటి అధికార పార్టీ వాళ్ళు కూడా నాకు పదవులు, సీట్లు ఆఫర్ చేశారు.. కానీ నేను ఆశపడలేదు..

ఆదాబ్ : మరి కాంగ్రెస్ పార్టీలో.. ?

సబితా : అక్కడికే వస్తున్నాను.. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు.. ఎంతో ప్రేమగా, గౌరవంగా నన్ను కన్విన్స్ చేశారు.. సబితమ్మా నీ సేవలు నీ నియోజకవర్గ ప్రజలకు ఎంతో అవసరం.. నువ్వు పార్టీలోకి రా తల్లీ అని ఆహ్వానించారు.. ఆయన చూపించిన ఆప్యాయత, అనురాగం, ఆడవారిపట్ల ఆయకున్న గౌరవం నన్ను కదిలించాయి.. ఆయన చెప్పినట్లు స్వర్గీయ ఇంద్రారెడ్డి తదనంతరం ప్రజలు దిక్కుతోచని వారయ్యారని.. వారిని అండా దండా ఇవ్వాల్సిన బాధ్యత ఆయన సతీమణిగా నాకు ఖచ్చితంగా ఉందని భావించి.. ఒక సమర్ధవంతుడైన, నిజాయితీపరుడైన నాయకుడి నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావించి వై.ఎస్.ఆర్. తో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను.. ..

ఆదాబ్ : మరి కాంగ్రెస్ ను వీడడానికి కారణం..?

సబితా : మీకు తెలియంది కాదు.. వై.ఎస్.ఆర్. మరణానంతరం జరిగిన పరిణామాలు ఏమిటన్నవి.. రెండు దఫాలు నన్ను పక్కన బెట్టారు.. అలాగే నా కుమారుడిని సైతం అవమాన పరిచారు.. నా ప్రాణంకంటే ఎక్కువుగా ప్రేమించిన పార్టీని వీడి వెళ్లిపోయానంటే ఎంత మానసిక క్షోభకు గురై ఉంటానో ఆలోచించండి.. ప్రజలకు నేను చేసిన బాసలు నిలబెట్టుకోవాలంటే నేను కొంత త్యాగం చేయక తప్పదు అనిపించింది.. అందుకే బీ ఆర్ ఎస్ లోకి రావడం జరిగింది..

ఆదాబ్ : అప్పుడు మీమీద చాలా విమర్శలు వచ్చాయి..?

సబితా : ఒకటి సాధించాలంటే ఒకటి కోల్పోక తప్పదు కదా..? ప్రజా క్షేత్రంలో వున్నవారికి విమర్శలు అన్నవి కామన్.. వాటిని ఎదుర్కోకపోతే రాజకీయ జీవితమే వృధాకదా..? అయితే శ్రీ కేసీఆర్ గారు నన్ను పిలిపించి సబితమ్మా నువ్వు పార్టీలో జాయిన్ అవ్వు.. నీకు తగిన ప్రాధాన్యత ఇస్తాం.. నీ అవసరం ప్రజలకు ఎంతో ఉంది అన్నారు.. నిజానికి అప్పుడు వై ఎస్ ఆర్ మాటలే నాకు కేసీఆర్ లో గుర్తుకు వచ్చాయి.. అందుకే పార్టీ మారడం జరిగింది.. ప్రజలకు సేవచేసే అవకాశాన్ని పదిలం చేసుకున్నాను.. అంతే తప్ప పదవుల కోసం కాదు..

ఆదాబ్ : బీ ఆర్ ఎస్ ఓటమిపై మీ అభిప్రాయం..?

సబితా : గెలుపోటములు సహజమే అని చెప్పానుగా.. అయితే తెలిసీ, తెలియకుండా కొన్ని తప్పిదాలు.. అంటే తప్పిదాలు కాదు గానీ పొరబాట్లు జరిగివుండొచ్చు.. అది కూడా కొంత ప్రభావం చూపించి ఉండవచ్చు.. అయితే ఒక్కవిషయం అయితే స్పష్టంగా చెప్పగలను.. తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది.. బీ ఆర్ ఎస్ పాలనలో ఎలా వుండేవాళ్ళో.. ఇప్పుడు ఎలా ఉంటున్నారు అన్నది.. మా ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఎన్నెన్నో చేసాం.. కానీ వాటిని ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పలేకపోవడంలో ఫెయిల్ అయ్యామని నా అభిప్రాయం.. దీనితో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు నిజాలుగా భ్రమింపజేస్తూ.. గ్లోబల్స్ ప్రచారం చేయడంలో కృతకృత్యులు అయ్యారని చెప్పాలి.. అందుకే అధికారం కట్టబెట్టారు.. ఇప్పుడిప్పుడే ప్రజలు నిజాలు గ్రహిస్తున్నారు.. తప్పకుండా తిరిగి అధికారం చేపడతాం అనే నమ్మకం నాకుంది..

ఆదాబ్ : మొన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన గురించి..?

సబితా : మీరు చూశారు.. యావత్ ప్రజానీకం చూసింది.. మహిళా నాయకురాళ్లపట్ల సాక్షాత్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు.. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి.. అందుకే నేను అంత బరస్ట్ కావాల్సి వచ్చింది.. నిజానికి ఈ ఇష్యూ ఎందుకొచ్చింది అంటే.. మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.. మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి కూలంకుషంగా వివరిస్తున్న సందర్భంలో నిజా నిజాలు ప్రజానీకానికి ఎక్కడ తెలిసిపోతాయో..? తాము చెప్పిన అబద్దాలు ఎక్కడ బయటపడి పోతాయో..? అన్న భయంతో టాపిక్ ని డైవర్ట్ చేయడానికి రేవంత్ బృందం చేసిన నాటకమే.. తప్ప మరేదీ కాదు.. ఈ నిజాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. సరైన సమయంలో, తగిన బుద్ధి చెబుతారు..

ఆదాబ్ : మీ భవిష్యత్ కార్యాచరణ ..?

సబితా : ఒక్కటే.. చట్టసభలో ప్రజల తరఫున గొంతెత్తడం.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యడం.. అధికార ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను అడ్డుకోవడం.. ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి కొరకు పని చెయ్యడం.. అధికార ప్రభుత్వం పనిచేయకపోతే వారి మెడలు వంచి పని చేయించడం.. కార్యకర్తలకు అనుక్షణం అండగా ఉండటం.. నిత్యం ప్రజా సేవకే అంకితమవ్వడం.. ఇదే నా జీవితాశయం.. మీకు చాలా తాంక్స్ ప్రతిపక్షంలో ఉన్నా గుర్తుపెట్టుకుని మరీ నాతో మాట్లాడటానికి వచ్చారు.. ఇది మాజీ మంత్రి మహిళా నాయకురాలు.. సబితమ్మతో ఆదాబ్ హైదరాబాద్ చిట్ చాట్ ..

Latest News

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS