Friday, November 22, 2024
spot_img

సనాతన వైదిక ధర్మ పరిరక్షకులు మాణిక్య సోమయాజులు

Must Read

శాస్త్రార్థాన్ని చెపుతూ దుటివాణ్ణి ఆచారమునందు ప్రవేశపెడుతూ తాను కూడా ఆచరించేవాడు ఆచార్యుడు.ఇది నూరుపాళ్ళు గురువులకే గురువు మాణిక్య సోమయాజులుకు అన్వయిస్తుంది.వేద విద్యావ్యాప్తి కోసం కృషిచేసినవారిలో భారతదేశంలోనే మాణిక్య సోమయాజులు అగ్రగణ్యులు. చతుర్వేదాలకు భాష్యం చెప్పగల పాండిత్యం ఆయన సొంతం.తెలంగాణలోనే ఏకైక సోమయాజిగా వేల మంది శిష్య పరంపర కలిగిన గురువు విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ పట్లూరు మాడుగుల మాణిక్య సోమయాజులు గుర్తింపు పొందారు.నిగూఢమైన వేదరహస్యాలను కథలుగా, సరళ పదాలలో వివరించగల చెప్పగల పాండిత్యం ఆయనది.వేలాది శిష్యులను వేదవిదులుగా తీర్చి దిద్దిన గురువరేణ్యుడాయన.వైదిక యజ్ఞాలకు పునఃప్రాణప్రతిష్ఠ చేసిన యాజ్ఞికుడాయన.పీఠాధిపతుల సత్కారాలు,బిరుదాలు పొందిన మహోపాధ్యాయుడాయన.అంతెత్తు ఎదిగినా వినయంగా ఒదిగిన వినయభూషణుడాయన.వేదవిద్వన్మూర్తి మాణిక్య యాజులు వేదవిద్యానిధి, విద్వదాహితాగ్ని,జ్యోతిరప్తోర్యామయాజిగా ప్రసిద్ధులాయన.వేద,శాస్త్ర,జ్యోతిష,అలంకార,వేదాంత,శ్రౌత మొదలైన ఎన్నో శాస్త్రాల్లో అఖండ పాండిత్యమున్నా తొణికిసలాడని నిండుకుండ ఆయన.నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణలో వైదిక సంప్రదాయ విద్యలు అడుగంటి పోయిన సమయంలో కన్నతల్లి పట్టుదల,ప్రేరణ, కృషితో వేదవిద్యను అభ్యసించి,వైదిక విజ్ఞాన ఖనిగ రూపు దాల్చారు.పట్లూరు సోమయాజీ అనే పేరుతో ప్రసిద్ధులైన ఆయన జీవితం ఈనాటి వేద విద్యార్థులకు,శాస్త్ర విద్యార్థులకు ఆదర్శప్రాయం. ఆయన పూర్వికులందరూ వేద విద్యా పారంగతులే.ముత్తాత గంగాధర దీక్షితులు, తాత రామకృష్ణ సోమయాజి,తండ్రి పురుషోత్తమ సోమయాజి సంప్రదాయ వేదవిద్యను అధ్యయనం చేసినవారే.1941లో మాడుగుల పురుషోత్తం సోమయాజి,జానాబాయి దంపతులకు 13వ సంతానంగా పట్లూరు గ్రామంలో జన్మించారు.నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణలో వైదిక సంప్రదాయ విద్యలు అడుగంటిపోయిన కష్ట కాలంలో కన్నతల్లి పట్టుదలతో, ప్రేరణతో, కృషితో వేదవిద్యను అభ్యసించి, నేటిదాకా తెలంగాణలో విశిష్టస్థానాన్ని అలంకరించిన వేదవిద్యానిధి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు. ‘పట్లూరు సోమయాజి’ అనే పేరుతో ప్రసిద్ధులైన ఈ మహనీయుని జీవితం ఈనాటి వేదవిద్యార్థులకు, శాస్త్ర విద్యార్థులకు ఆదర్శపాత్రం. పట్లూరి సోమయాజి కుటుంబంలోని పూర్వ పురుషులందరూ వేదవిద్యా పారంగతులే. ముత్తాల గంగాధర దీక్షితులు, తాత రామకృష్ణ సోమయాజి, తండ్రి పురుషోత్తమ సోమయాజి అందరూ సంప్రదాయిక వేదవిద్యను అధ్యయనం చేసినవారే. తండ్రి కేవలం వేదంలోనే కాక,మీమాంసా వాస్త్రంలోను, వ్యాకరణ శాస్త్రంలోనూ దిట్ట. ఇలా ఉన్నత విద్వత్కుటుంబంలో 13వ సంతానంగా జన్మించిన మాణిక్య సోమయాజికి శిశుప్రాయంలోనే తండ్రి మరణించారు. తండ్రి మరణంతో కలిగిన లోటును తీర్చడానికి తల్లి జనాబాయి కంకణం కట్టుకున్నది. అప్పటికి తెలంగాణలో వేదాధ్యాపనం చేయించే గురువులు స్వల్పంగా ఉండడం, సామాజిక వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని గమనించి,ఎంతో శ్రమకోర్చి మాణిక్య సోమయాజిని, ఆయన అన్న నరసింహశాస్త్రిని గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా చవటపాపయ్య పాలెం అగ్రహారంలోని వేద గురుకులానికి చేర్చింది.అక్కడ ఆమెకు ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి.నిజాం ప్రాంతం వారికి ప్రవేశం లేదనే నిషేధోక్తులు గుచ్చినా వెరువక పట్టుదలతో వేదనిధులను ఒప్పించి,తన తనయులకు వేదవిద్యాభ్యాసానికి సిద్ధం చేసింది.ఆమెకు వేదవిద్యపట్ల గల ఆసక్తిని, శ్రద్ధను గమనించి గురువులు ఇద్దరు వేద పిల్లలకు వేదపాఠశాలలో ప్రవేశం కల్పించారు.అక్కడే సంహిత వరకు అధ్యయనం కొనసాగింది. అవాంతరాలకు నిరాశ చెందక పిల్లలను బాపట్లలోని గొల్లపూడి మధుసూదన అవధాని దగ్గర మిగిలిన వేద భాగాన్ని పూర్తి చేయించింది. తరువాత రేపల్లెలోని తూములూరి సుబ్బావధాని దగ్గర పదం,క్రమం,బ్రాహ్మణ,ఆరణ్య భాగాలు, ఉపనిషత్తులు పూర్తి చేయించి వేదవిద్యలో తీర్చిదిద్దింది.

17 ఏళ్ల వయస్సులోనే వేదశాస్త్ర సభల్లో విజయం సాధించే విధంగా తనయుణ్ణి తీర్చిదిద్దింది తల్లి.ఆ తరువాత స్వగ్రామానికి చేరుకుని వేదవిద్యా ప్రచారం కోసం కంకణం కట్టుకున్నారు.అప్పుడే కర్ణాటక రాష్ట్రం హుమ్నాబాద్ సమీపంలోని ఖనేరంజోల్ గ్రామానికి చెందిన రామచంద్ర భట్ గారి కుమార్తె లలితతో వివాహం జరిగింది.తరువాత గృహస్థాశ్రమంలో విద్యుక్త ధర్మాలను కొనసాగిస్తూ ప్లవంగ నామ సంవత్సరంలో సోమయాగాన్ని నిర్వహించి ‘సోమయాజి’గా సార్థక కీర్తిని అందుకున్నారు.ఇస్మా యిల్ఖాన్ పేటలో శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి ప్రేరణతో ప్రారంభమైన వేదవిద్యా పాఠనోద్యమంలో చేరి శివంపేట లోని వేదపాఠ శాలలో ఆచార్యులై వందలాది మంది శిష్యులకు వేదవిద్యలోను, శాస్త్ర విద్యలోనూ, యజ్ఞయాగాది ధార్మిక సంస్కారాల లోను తీర్చిదిద్దిన మహాతపస్వి మాణిక్య సోమయాజి.సోమయాజి దేశంలోనే వేదానికి భాష్యం చెప్పగల అతికొద్దిమంది విద్వన్మూర్తులలో అగ్రగణ్యులు.ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలో శ్రౌతసంవర్థినీ సభ ఆధ్వర్యంలో ధర్మపురి క్షేత్రంలో జరిగిన జ్యోతిరప్తోర్యామం ఉత్కష్ట సోమయాగం వీరి యాజమాన్యంలో వైభవంగా జరిగింది. కృష్ణా పుష్కరాల సమయంలో బీచుపల్లిలో బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి యాజమాన్యంలో జరిగిన అగ్నిష్టోమ సోమయాగం పట్లూరి గురువుగారి పర్యవేక్షణలోనే జరిగింది.ఐదేళ్ల క్రితం తొగుట శ్రీ గురుమదనానంద సరస్వతీ పీఠంలో శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి ఆశీస్సులతో జరిగిన చాతుర్మాస్యేష్ఠి శ్రౌతయాగం మాణిక్య సోమయాజులు – లలితా సోమిదేవమ్మ యాజమాన్యంలోనే జరిగింది. బ్రహ్మశ్రీ మాణిక్య సోమయాజులు గారి వైదిక నిర్వహణలో తెలుగునాట సహస్రాధిక యాగాలు ఆలయాల ప్రతిష్ఠలు జరిగాయి. 2012లో హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం అలియాబాద్లోని పురాతన శ్రీ రామచంద్రస్వామి దేవస్థానంలో లక్ష రుద్ర మహాయాగాన్ని అద్వితీయంగా నిర్వహించారు.సికింద్రాబాద్ కానాజీగూడ లోని మరకత శ్రీ లక్ష్మీగణపతి దేవాలయంలో లక్ష మోదక గణపతి హోమాన్ని నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాటి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వీరికి విశిష్ట సేవా పురస్కార ప్రదానం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగంలో స్వర్ణ కంకణంతో సత్కారం జరిగింది. విఎస్ఆర్ ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవంలో ‘వేదవిద్యానిధి’ పురస్కారంతో ఘనంగా సత్కరించారు.వారణాసి (కాశీ) విశ్వనాథుని సన్నిధిలో ఉంటూ అక్కడే అనేక ధార్మిక ప్రవచనాలను, వేదవేదాంత బోధనలను అందిస్తూ ధార్మిక జీవనాన్ని గడిపారు.ఆ సమయంలో తెలంగాణ నుంచి కాశీక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం దాతల విరాళాలతో కేదార్‌ఘాట్‌లో 400 గజాల స్థలాన్ని సేకరించారు. గంగాతీరంలో భూదానం కార్యక్రమం నిర్వహించి, కొన్నాళ్ల క్రితం తిరిగొచ్చారు.

సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు తాను నిష్క్రమించే సమయం ఆసన్నమైనదని శిష్యులతో చెప్పడం ఆయన దివ్యదృష్టికి నిదర్శనం. సోమయాజులు 2021 ఆగస్టు 9 సోమవారం తెల్లవారు జామునే సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి శ్రీ బ్రహ్మానంద తీర్థ మహాస్వామిగా దీక్షానామం పొందారు. విధివశాత్తు సాయంత్రమే పరమ పదించారు.

రామ కిష్టయ్య సంగన భట్ల

  • 9440595494
Latest News

జగన్ ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా మాజీ సీఎం, వైసీపీ అధినేత ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS