- లక్షల్లో ముడుపులు అందుకుంటున్న మున్సిపల్ కమీషనర్ రామలింగం
- బఫర్ జోన్‌లో నిర్మాణం ఆపాలని కమీషనర్ కు ఇరిగేషన్ లేఖ.
- అక్రమ నిర్మాణం నిలిపివేయనందుకు బిల్డర్ పై పోలీస్ కేస్ పెట్టిన ఇరిగేషన్ శాఖ
- అక్రమ నిర్మాణంను కంటికి రెప్పలా కాపాడుతున్న మున్సిపల్ అధికారులు.
- డబ్బు, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అంటున్న మాజీ మేయర్ మేనల్లుడు
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్ల పోచమ్మ కుంట బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ కమీషనర్ రామలింగం ప్రోత్సహిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెంగిచర్ల పోచమ్మ కుంట దాదాపు 8 ఎకరాలలో అక్రమ నిర్మాణాలతో కబ్జాకు గురైంది. అప్పటి ఇరిగేషన్ అధికారులు కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బఫర్ జోన్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలంటూ.. రెండు నెలల క్రితమే మున్సిపల్ కమీషనర్ కు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసిన.. ఆ ఫిర్యాదును పట్టించుకోకుండా అక్రమ నిర్మాణదారునికి మున్సిపల్ అధికారులు సహకరించడంతో, ఇరిగేషన్ అధికారులు అక్రమదారునిపై పోలీస్ లను ఆశ్రయించారు. ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన మున్సిపల్ కమీషనర్ పచ్చనోట్లకు కక్కుర్తిపడి పచ్చని పరదాల చాటున నిర్మించే అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహిస్తూ, కార్పొరేషన్ కు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. మున్సిపల్ ఆఫీస్ నుండి చెంగిచర్ల వెళ్లే రహదారిలో మాస్టర్ ప్లాన్ లో రెండు వందల ఫీట్లు ఉండగా, ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ బిల్డింగ్స్ సెట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.
బఫర్ జోన్లో నిర్మాణాలకు సహరిస్తున్న కమీషనర్ పై చర్యలుండేనా…
హైదరాబాద్‌లో ఆక్రమణకు గురైన చెరువులను పలు ప్రాంతాలలో 15 ఎకరాలను స్వాధీనం చేసుకున్న హైడ్రా కమీషనర్ రంగనాథ్. శనివారం రోజున బఫర్ జోన్లో నిర్మించిన ఐదు అంతస్తులు గల రెండు భవనాలను కూల్చివేశారు. బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహయిస్తే ప్రభుత్వ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమీషనర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
బఫర్ జోన్‌లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న బోడుప్పల్ మున్సిపల్ కమీషనర్ పై హైడ్రా కమీషనర్ రంగనాధ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని మున్సిపల్ ప్రజలు ఎదురుచూస్తున్నారు.