పరోపకారం చేయని జీవితం.. వ్యర్థమైనవి అంటారు భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద. మనిషి అనేవాడు రూపంలో, జ్ఞానంలో, సంపదలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ గుణం, వినయం, ఉపకార భావన, మానవతా విలువలు లేకపోతే ఆ మనిషి అధముడే. నేర్చుకున్న జ్ఞానం మనిషికి ఉపాధిని ఇవ్వడమే కాదు.. తన వ్యక్తిత్వం ఉన్నతంగా రూపుదిద్దుకోవడానికి, సమాజం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడడానికి దోహదపడేదిగా ఉండాలి. సంపాదించిన డబ్బుతో విలాసవంతమైన జీవనం గడపడమే పరమావధికాకుండా.. ఆకలితో అలమటిస్తున్న పేదల క్షుద్భాధ తీర్చేదిగా, అవసరమైన వారికి ఆపన్నహస్తం అందించేందుకు సిద్ధం చేసేదిగా ఉండాలి.
మనిషి సంఘజీవి. పుట్టుక నుండి మొదలుపెట్టి.. కుటుంబం, స్నేహితులు, పాఠశాల, సమాజం, ప్రకృతి, పరిసరాలు తదితరుల నుండి నిరంతరం ఎంతో కొంత నేర్చుకుంటూ తన ప్రయాణం సాగిస్తాడు. ఈ నేర్చుకునే క్రమంలో విద్యార్థి అభ్యసన సరైన దృక్పథంతో సాగితే ఉత్తమ పౌరులు, సమాజ శ్రేయస్సు కోరే మనుషులు ఆవిష్కృతమౌతారు. అభ్యసన సరైన దిశగా సాగకపోతే స్వార్థ పరులు, మూఢులు, వినాశకారులు తయారవుతారు. అందుకే విద్యను అందించే కేంద్రాలు విద్యార్థిని సంపూర్ణవంతమైన పౌరుడిగా రూపొందించే కార్మాగారాలుగా పరిణామం చెందాలి. చదువుతోపాటు సామాజిక విలువలను అలవర్చే ఉత్పత్తి కేంద్రాలుగా రూపాంతరం చెందాలి. ఈ మార్పు కుటుంబం నుండి మొదలై సమాజం వరకు వ్యాపించాలి.
పుట్టిన బిడ్డకు మొదటి గురువులు అమ్మానాన్నలే. మాటలు, నడక, నడవడిక నేర్పించాల్సిన ఆదిగురువులు తమ సంతతిని ప్రతీ అంశాన్ని , అనుభవాన్ని వాస్తవిక దృష్టితో చూసే విధంగా తయారు చేయాలి. భౌతికవాద దృక్పధాన్ని అలవర్చుకునేలా ప్రేరేపించాలి. అబద్ధాలు, అర్ధసత్యాలు, ఊహాగానాలతో కూడిన కాకమ్మ కథలు, మాయలు- మంత్రాలు, దైవిక – అదైవిక అభూత కల్పనల వంటి అంశాలు చెప్పి, పిల్లల మనస్సులో అవాస్తవపు భీజాలు నాటే పురాతన సంస్కృతినుండి బయటపడాలి. అనంతమైన సృష్టి రహస్యాలు, చరాచర పదార్థాల గమనం, జీవుల పరిణామ క్రమం, మానవ ఆవిర్భావం, చారిత్రక ఆధారాలు, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలను పిల్లల స్థాయికి అనుగుణంగా కథనాలుగా చెప్పాలి, వివరించాలి. అంటరానితనం, అస్పష్టత అంటే ఏంటో పిల్లలకు తెలియకుండా, వారి దరిదాపుల్లోకి రాకుండా ఉండేవిధంగా తమ నడవడిక ఉండాలి. ఇంట్లో పెద్దలపట్ల తల్లిదండ్రుల ప్రవర్తన, పిన్నల పైన వారు చూపే ఆప్యాయత ఆదర్శప్రాయంగా ఉండాలి. ఇరుగుపొరుగు వారితో చూపే సఖ్యత, కుల- మతాల అంతరాలు లేకుండా సోదరభావంతో మెలిగే తీరు పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి. ఇక.. పాఠశాలకు వచ్చే విద్యార్థికి చదువుతో పాటు క్రమశిక్షణ అలవడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. కుటుంబ వ్యవస్థ, సమాజం పట్ల సానుకూలమైన ఆలోచనలు రేకెత్తించాలి. ప్రకృతి నియమాలు, చలన సూత్రాలపై సునిశితమైన వైఖరిని నేర్పించాలి. మన సంస్కృతి సాంప్రదాయాలలో అంతర్లీనంగా దాగి ఉన్న శాస్త్రీయ ఆలోచనలు, ప్రజలు పాటిస్తున్న మూఢాచారాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పిల్లలు శారీరకంగానూ, మానసికంగానూ దృఢత్వం పొందేలా తర్ఫీదునిచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి ఉపాధ్యాయులు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యులకు ఆసరాగా నిలవడం పిల్లలకు అలవడాలి. ఆరోగ్యానికి హానికరమైన, సమాజానికి చీడగా దాపురించిన దురలవాట్ల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకొని ఆచరించాలి, మార్పుదిశగా ఆలోచించాలి. వీటన్నింటి కోసం పాఠశాల, ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలి.
విద్యార్థుల భావి జీవితానికి భరోసానిచ్చేలా, ఉపాధి కల్పనకు అవకాశం కల్పించేలా సిలబస్ రూపొందించబడాలి. అంధ విశ్వాసాలు, అభూత కల్పనలను ప్రోత్సాహించే పాఠ్యాంశాలను తొలగించి వాస్తవిక దృక్పథం, శాస్త్రీయ ఆలోచనలు, రాజ్యాంగ లక్ష్యాలను పెంపొందించే అంశాలను పాఠ్యాంశాలుగా పెట్టాలి. చదువే చదువు పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించడమే కాదు, స్వయం ఉపాధిని పొందేలా ప్రభుత్వాలు సిలబస్ లో తగు మార్పులు చేయాలి. విద్యారంగానికి బడ్జెట్లో పుష్కలమైన నిధులు కెటాయించి పురోగామి లక్షణాలు కలిగిన భావిభారత నిర్మాతల అంకురార్పణకు పునాది వేయాలి. స్నేహితులు, యువకులు, పెద్దలు, సమాజం కూడా పిల్లలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. తమకన్నా వయసులో పెద్దవారైన గ్రామంలోని యువకుల నడవడిక, అలవాట్లు, తమ కుటుంబం లేదా ఇరుగుపొరుగు ఇళ్ళలోని పెద్దల నిత్యకృత్యాలు పిల్లల మనస్తత్వం, ప్రవర్తనలో మార్కును చూపిస్తాయి. పెద్దలు, యువకులు దురలవాట్లకు బానిసై తమ ఆరోగ్యం, కుటుంబ జీవనాన్ని నాశనం చేసుకుంటుంటే.. అది చూసి, వారి అడుగుజాడల్లో నడిచే పిల్లలు కూడా సమాజానికి చీడ పురుగులుగా ఉద్భవిస్తారు. అలా కాకుండా సన్మార్గంలో పయనిస్తూ, సమాజ శ్రేయోభిలాషులుగా వ్యవహరిస్తుంటే, బాధ్యతను ప్రదర్శిస్తుంటే.. ముందు తరాలకు సలక్షణాలు, సామాజిక బాధ్యత కలిగిన వారసత్వాన్ని అందించినవారు అవుతారు.
“విద్య.. విద్యార్థులను వారి సంస్కృతి మరియు సామాజిక వాస్తవికత నుండి దూరం చేయకూడదు. బంధాన్ని బలోపేతం చేయాలి. పౌర బాధ్యతలను అందించాలి. సామాజిక సామరస్యాన్ని పెంపొందించాలి” అని అంటారు మన జాతిపిత గాంధీజీ. తల్లిదండ్రులు మొదలుకొని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, సమాజం వరకు అన్నిచోట్ల కూడా సామాజిక బాధ్యతను పెంపొందించే అంశాలను పిల్లలకు నేర్పాలి. తమ వారితోపాటు, ఇరుగుపొరుగు కష్టసుఖాల్లో కూడా పాలుపంచుకునే సహాయక గుణం పిల్లలకు అలవడాలి. పేద, ధనికా తేఢా లేకుండా అందరూ సమానులే అనే సమానత్వ భావన పెంపొందించబడాలి. అంటరానితనపు ఛాయలు కనబడకుండా.. కుల, మత, వర్గ రహిత వాతావరణం ఇంటా, బయటా నెలకొల్పబడాలి. అంధ విశ్వాసాలకు ఆస్కారం లేకుండా, వాస్తవిక దృక్పథం అలవర్చే కరికులంతో కూడిన విద్యా విధానం రావాలి. పాఠ్యాంశాలతో పాటు సామాజిక విలువలు, శాస్త్రీయ ఆలోచనలు, హేతువాద దృక్పథం పెంపొందించేలా బోధన కొనసాగాలి. అప్పుడే కుటుంబం, పాఠశాల, సమాజం అనే కార్మాగారాల్లో ఉత్పత్తి చేయబడే విద్యార్థులు అనబడే నాణ్యమైన సరుకులు ఈ సమాజానికి, ఈ దేశానికి ఉపయోగపడే ఉన్నతమైన పౌరులుగా రూపొందించబడతారు, మనుగడ సాగించగలుగుతారు.
వరగంటి అశోక్
సెల్: 9493001171