- సీఎం రేవంత్ రెడ్డి
యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.హైదరాబాద్ గచ్చిబౌలిలోని “బ్రహ్మ కుమారీస్ – శాంతి సరోవరం” 20వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,తుమ్మల నాగేశ్వరరావు,ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,యాంత్రికంగా మారిన ఆధునిక మానవ జీవితంలో శాంతి,సమాధానాలు తప్పనిసరిగా అవసరమని తెలిపారు.సమాజాన్ని శాంతియుత మార్గంలో నడిపించడంలో బ్రహ్మ కుమారీస్ సంస్థ ఆశయాలకు దగ్గరగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమం,డ్రగ్స్ వంటి మహమ్మారుల నుండి యువతను కాపాడి,వారికి సాధికారత నేర్పడంలోనూ బ్రహ్మ కుమారీస్ మార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోందని వెల్లడించారు.
మౌంట్ అబూ (రాజస్థాన్) తర్వాత హైదరాబాద్ లో బ్రహ్మ కుమారీల శాంతి సరోవర్ ఉండటం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు.రైతుల ఆత్మహత్యల్ని నివారించి,చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతుల రుణమాఫీకి రూ.31వేల కోట్లు వెచ్చిస్తోందని అన్నారు.యువత పెడదారులు పట్టకుండా,డ్రగ్స్ పేరు వింటేనే భయపడేలా నార్కోటిక్స్ టీమ్స్ ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని,ప్రముఖ పారిశ్రామికవేత్తల సారధ్యంలో ఈ యూనివర్సిటీ నడుస్తుందని వెల్లడించారు.శాంతి సరోవరం లీజ్ పొడిగింపుతో సహా అన్ని విషయాల్లో బ్రహ్మ కుమారీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.