Wednesday, December 4, 2024
spot_img

ఉప్పల్‌ నడిబొడ్డున రూ.400 కోట్ల భూ స్కాం

Must Read
  • సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి
  • 7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్‌ రెడ్డి సహా కుటుంబసభ్యులు
  • కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం
  • కొందరు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్‌ సపోర్ట్‌
  • ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు
  • లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్‌,డీఐ సత్తెమ్మ
    ఎమ్మార్వో గౌతమ్‌ కుమార్‌ సర్వేయర్‌ వెంకటేష్‌
  • రిపోర్ట్‌ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్‌ ఆగ్రహం
  • గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోని కలెక్టర్‌ జిహెచ్‌ఎంసి కమిషనర్‌
  • ఎవరికైనా తప్పుడు రిపోర్టులు కావాలంటే ఈ అధికారులను
    సంప్రదించవచ్చు..?

ప్రభుత్వ భూములను కబ్జాచేసి దర్జాగా బహుళ అంతస్తులు కడుతున్న ఆఫీసర్లు ఎవరికీ కానరాకపోవడం విడ్డూరం. ఏళ్లుగా భూమిని కబ్జాచేసి లీజ్‌ ఇచ్చుకొని కోట్లకు పడగలెత్తుతున్న పట్టించుకోని వైనం.మండల తహసిల్దార్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, జోనల్‌ ఆఫీస్‌ నుంచి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు తెలిసి కూడా ప్రభుత్వ భూములను కొందరు కొల్లగొట్టడం, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కనీసం పట్టింపు లేకుండా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజకీయ, డబ్బు పలుకుబడి ఉన్నోళ్ల వద్ద నుంచి మాముళ్లు తీసుకొని ఇట్టే పనిచేసి పెట్టడం సర్వ సాధారణం. నాది కాదు నాకేం పట్టింది అన్నట్టుగా జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, అధికారులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రాజధాని నగరంలోని ఉప్పల్‌ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఉప్పల్‌ కల్సా గ్రామంలో 7ఎకరాల భూమిని రోహిత్‌ రెడ్డి కబ్జా చేస్తే ఆఫీసర్లందరూ ఫుల్‌ సపోర్ట్‌ చేయడం వెనుక ఆంతర్యామేంటో అర్థం కావడం లేదు. సుమారు 400కోట్ల రూపాయల విలువైన సర్కారు భూమిని కాపాడలేని దుస్థితిలో ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉందంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.

వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా ఉప్పల్‌ కల్సా గ్రామంలోని సర్వే నెం. 581/1లో 217 ఎకరాల 34గుంటలు ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఇందులో 7ఎకరాల భూమిని రోహిత్‌ రెడ్డి, 22మంది కుటుంబ సభ్యుల పేరు మీద కబ్జా చేసిన రోహిత్‌ సదరు భూమిని ప్రైవేటు వ్యక్తులకు లీజ్‌ ఇచ్చుకొని కోట్లు వెనకేసుకుంటున్నాడు.

ఎం.వెంకటేష్ ( మండల సర్వేయర్ )

ఉప్పల్‌ కల్సలో సర్వేనెంబర్‌ 584లో ని ప్రభుత్వ భూమిలో నిర్మాణానికి అనుమతులు తీసుకొని సర్వే నెం. 581లోని 0.28గుంటల ప్రభుత్వ భూమిలో రోహిత్‌ రెడ్డి అనే వ్యక్తి 7అంతస్తుల బిల్డింగ్‌ నిర్మించాడని ఈనెల 21వ తేదీన ఆదాబ్‌ లో కథనం ప్రచురించడం జరిగింది. ఉప్పల్‌ కల్సలో భూమిలో లో నిర్మాణానికి అనుమతులు తీసుకొని ప్రభుత్వ జాగలో 7అంతస్తుల బిల్డింగ్‌ కడుతుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు. ఇందుకు కొందరు అధికారులు పరోక్షంగా సహకరించారు. మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి ఏడీ శ్రీనివాస్‌, కీసర డీఐ సత్తెమ్మ, ఉప్పల్‌ ఎమ్మార్వో గౌతం కుమార్‌, సర్వేయర్‌ వెంకటేష్‌ లంచాలు తీసుకోని సహకరించినట్టు తెలుస్తోంది. కబ్జా చేసిన రోహిత్‌ రెడ్డికి మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా అధికారులు వంత పాడారు. అందులో భాగంగా సర్వే రిపోర్ట్‌ లో రకరకాలుగా సమాధానాలు చెబుతుండడం ఆశ్చర్యం. వాస్తవానికి సర్వే నెం. 584 లోని భూమి రోహిత్‌ రెడ్డిది. పక్కన ఉన్న సర్వే నెం.581/1 ప్రభుత్వ భూమిలో ఉన్న 7ఎకరాలభూమిని 22మంది ఎంక్రోజ్‌ మెంట్‌ చేయడం గమనార్హం. ఈ విషయంపై కొందరు స్థానికులు జీ.హెచ్‌.ఎం.సీ కమీషనర్‌కు రోహిత్‌రెడ్డి అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న నిర్మాణంపై ఫిర్యాదు చేయగా, జీ.హెచ్‌.ఎం.సీ కమీషనర్‌ అట్టి ఫిర్యాదుపై స్పందించి మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ను సమగ్రంగా విచారించి వాస్తవాలతో కూడిన నివేధికను కోరడం జరిగింది.

గౌతం కుమార్ ( తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ జనరల్ సెక్రెటరీ )

అప్పటి కలెక్టర్‌ మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రామచందర్‌ ఇట్టి విషయం పై సమగ్రంగా సర్వే చేసి నివేదికను సమర్పించాల్సిదగా కోరడం జరిగింది.కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం ఏడి రామ్‌ చందర్‌ క్షేత్రస్థాయిలో సర్వే చేసి రోహిత్‌ రెడ్డి నిర్మిస్తున్న నిర్మాణం సర్వే నెం.581/1లో రావడం జరుగుతుందని స్పస్టమైన నివేదికను జిల్లా కలెక్టర్‌ కు మరియు సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ నవిన్‌ మిట్టల్‌ కు సమర్పించారు.ఏడి రామచందర్‌ ఇచ్చిన నివేదికను జిల్లా కలెక్టర్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కు పంపడం జరిగింది.కానీ జీహెచ్‌ఎంసీ అధికారులు అట్టి నిర్మాణ అనుమతులను రద్దు చేయకపోవడం శోచనీయం.

శ్రీనివాస్ (అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్) – మేడ్చల్ జిల్లా,రంగారెడ్డి జిల్లా

అప్పటి మండల సర్వేయర్‌ అయిన ప్రశాంత్‌ కుమార్‌ సదరు భూమి 581/1లో వస్తుందని సర్వే చేసి స్పస్టమైన రిపోర్ట్‌ ఇచ్చారు.శాఖపరమైన బదిలీలు జరగడంతో ప్రశాంత కుమార్‌ ఉప్పల్‌ మండల కార్యాలయం నుండి బదిలీ కావడం జరిగింది.తరువాత మండల సర్వేయర్‌ గా వచ్చిన వెంకటేష్‌ ను ప్రభుత్వ భూమిను కబ్జా చేసిన రోహిత్‌ రెడ్డి మండల సర్వేయర్‌ కు భారీ ఎత్తున ముడుపులు ఇచ్చి అక్రమ నిర్మాణం సర్వే నంబర్‌ 584 లో వస్తునట్టు రిపోర్ట్‌ పొందడం జరిగింది.స్థానిక ప్రజలు తప్పు నివేదిక ఇచ్చిన మండల సర్వేయర్‌ నిర్వాకం పై కలెక్టర్‌ కు,సర్వే మరియు ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ కు ఫిర్యాదు చేశారు.ఇట్టి ఫిర్యాదు పై స్పందించిన కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సమగ్రంగా విచారించి నివేదిక సమర్పించాల్సిందగా జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కే.శ్రీనివాసులును ఆదేశించడం జరిగింది.కమిషనర్‌ ఆదేశాల ప్రకారం ఏడి శ్రీనివాసులు,డిప్యూటీ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ అయిన గంగాధర్‌ తో సమగ్రంగా విచారించి నివేదికను పొందారు.అట్టి నివేదికలో సర్వే నంబర్‌ 581/1 లో అక్రమ నిర్మాణం వస్తుందని స్పస్టత ఇవ్వడం జరిగింది. గంగాధర్‌ ఇచ్చిన నివేదికను కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ కు ఏడి శ్రీనివాసులు సమర్పించారు.కమిషనర్‌ నివేదిక ఆధారంగా మండల సర్వేయర్‌ వెంకటేష్‌ పై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు.అంతేకాకుండా అతనికి ఒక ఇంక్రిమెంట్‌ కట్‌ చేయడం జరిగింది.
రోహిత్‌ రెడ్డి డిఐ సర్వే కోరుతూ ఆర్డీఓకు రిక్వెస్ట్‌ పెట్టుకోగా,ఆర్డీఓ సర్వే చేయుటకు డిఐ సత్తెమ్మ ను ఆదేశించారు.సత్తెమ్మ టీ పాన్స్‌ లేని కారణంగా ఇట్టి సర్వేను నేను నిర్వహించలేను అని స్పస్టంగా మేమో ఇవ్వడం జరిగింది.తరువాత ప్రజావాణిలో రోహిత్‌ రెడ్డి ఏడి సర్వే కోరుతూ అర్జీ పెట్టుకోగా గతంలో ఇచ్చిన నివేదికలకు విరుద్ధంగా రోహిత్‌ రెడ్డితో లోపాయకారి ఒప్పందం చేసుకొని అక్రమ నిర్మాణం సర్వే నంబర్‌ 584లో వస్తునట్లు డిఐ సత్తమ్మ మరియు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కే.శ్రీనివాసులు నివేదిక ఇవ్వడం గమనార్హం.మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..రోహిత్‌రెడ్డి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం ప్రభుత్వ భూమిగా ధరణీలో చూపిస్తుంది.
ఇదే అధికారులు గతంలో అది ప్రభుత్వ భూమి అని చెప్పి,మళ్లీ ఇప్పుడు కాదు,కాదు అది..రోహిత్‌ రెడ్డి మరియు కుటుంబసభ్యులదాని తేల్చడం వెనుక ఈ అధికారులకు ఎంత వరకు ఆమ్యాన్యాలు ముట్టినావో ఇట్టే అర్థమవుతుంది.మళ్లీ సర్వే నెం.584 లోకి వస్తుందంటూ మండల సర్వేయర్‌ వెంకటేశ్‌ తప్పుడు నివేదిక ఇచ్చినందుకు ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.అంతేకాకుండా ఆయనకు ఒక ఇంక్రిమెంట్‌ కూడా తొలగించడం జరిగింది.ఏడీ శ్రీనివాస్‌,డీఐ సత్తెమ్మలు అక్రమదారుడు రోహిత్‌ రెడ్డి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నట్టు ఇట్టే అర్థమవుతుంది.

సత్తమ్మ ( సర్వే డిప్యూటీ ఇన్స్ పెక్టర్ )

ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సదరు 7ఎకరాల భూమి సర్వే నెం. 581/1లో ఉన్నది అని గతంలో రిపోర్ట్‌ ఇవ్వడం జరిగింది.దీనిపై సర్వే చేసి 581/1లో ఉందని తేల్చి సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌,జిల్లా కలెక్టర్‌ కు ఏడీ నివేదిక ఇవ్వడం,అది ప్రస్తుతం కాదనడం చూస్తుంటే ప్రభుత్వ అధికారుల ద్వందవైఖరి ప్రదర్శిస్తున్నట్టు కనపడుతుంది.ప్రభుత్వ భూమిని చెరపట్టిన రోహిత్‌ రెడ్డి సహా 22 మంది కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలి.ఉప్పల్‌ కల్సా గ్రామంలో సర్కారు భూమి స్వాహా చేసిన సదరు రోహిత్‌ రెడ్డి నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలి.సర్వేనెం.581/1లో కబ్జాచేసిన 7ఎకరాల భూమిని ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోని అతనికి సహకరించిన అధికారులను సస్పెండ్‌ చేసి చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కబ్జాదారుల భరతం పడతది అనుకుంటే ఆ సీన్‌ కానరావడం లేదు.సీఎం రేవంత్‌ రెడ్డి మీరైనా చొరవ తీసుకొని ఈ కోట్లాది రూపాయల విలువైన భూమిని కాపాడి ఇన్నాళ్లపాటు కబ్జాలో ఉండి లీజ్‌ కు ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించిన రోహిత్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని,అట్టి భూమిపై ఉంటూ ఎంత సొమ్ము అయితే సంపాదించాడో అదంతా వడ్డీతో సహా కక్కించాల్సిన బాధ్యత మీపై ఉంది.ఏడీ శ్రీనివాసులు,డీఐ సత్తెమ్మ,అప్పటి ఉప్పల్‌ ఎమ్మార్వో గౌతమ్‌ కుమార్‌,సర్వేయర్‌ వెంకటేష్‌ వీరందరి పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు ఉన్నతాధికారులు దృష్టిసారించి అక్రమ ఆస్తులు,కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న దానిపై విజిలెన్స్‌, ఎన్ఫోర్స్మెంట్‌,ఏసీబీ,ఇన్కమ్‌ టాక్స్‌ సంస్థలు పూర్తి విచారణ జరిపి వీరి ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Latest News

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS