Thursday, November 21, 2024
spot_img

తరగతి గదిలోనే దాగుంది-దేశ భవిష్యత్

Must Read
  • సెప్టెంబర్ 05న ఉపాధ్యాయ దినోత్సవ సంధర్భంగా

ఉపాధ్యాయులే దేశ నిర్మాతలు

“ఏ దేశమైనా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఆర్థికరంగ నిపుణులు,శాస్త్రవేత్తలు,పారిశ్రామికవేత్తలు,వ్యవసాయరంగ నిపుణులు,నీటిపారుదల రంగం,రక్షణశాఖ,డాక్టర్లు, ఇంజనీర్లు,రాజకీయ నాయకులు,ఇలా ప్రతి రంగంలోని వ్యక్తులందరూ విద్యావంతులు కావల్సిందే.!వీరందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దేది కేవలం ఉపాధ్యాయుడే.అంటే దేశ అభివృద్ధికి బాటలు వేసేది గరువు మాత్రమే”

“అత్యంత ఉన్నత చదువులు చదివినందునే భారత రాజ్యాంగం రచించడానికి డా॥ అంబేద్కర్ గారు నియమించబడ్డారు.అంబేద్కర్ ఆ స్థాయికి తెచ్చిన ఘనత ఆయనకు చదువు నేర్పించిన గురువులదే.అలాగే దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి అయిన మౌలాన అబుల్ కలామ్ అజాద్,మరియు జ్యోతిబాపూలే,సావిత్రిబాయి పూలే,దేశ ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్,ప్రథమ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ,గాంధీ,సుభాష్ చంద్రబోస్,సరోజిని నాయుడు,రవీంద్రనాథ్ ఠాగూర్,వివేకనందుడు,కబీర్ దాస్,తలసీదాస్,డా॥ అబ్దుల్ కలామ్ ఇలా చెప్పుకోబోతే వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారెందరో..! వారందరికీ పాఠాలు చెప్పింది ఉపాధ్యాయులు,అధ్యాపకులే అని గుర్తుంచుకోవాలి,”

గురువులకే గురువు :

గురువులకే గురువు డా॥సర్వేపల్లి రాధాకృస్ణన్ గారి పుట్టినరోజు సంధర్బంగా నేడు జరుపుకొనే ఉపాధ్యాయ దినోత్సవం ఒక ఉపాధ్యాయుని జ్ఞానానికి,త్యాగానికి ప్రతిఫలంగా డా॥సర్వేపల్లి గారు తన జన్మదినాన్ని అంకితం చేసిన రోజు,డా॥రాధాకృష్ణన్ గారు దాదాపు 40 ఏళ్ళ పాటు ఉపాధ్యయ వృత్తి చేపట్టారు,ఎన్నో సన్మానాలు,ఎన్నో అవార్డులు పొందారు,27 సార్లు నోబెల్ పురస్కారానికి నామినేట్ అయ్యారు, దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న పొందారు, దేశ ప్రథమ ఉపరాష్ట్రప్రతిగా, బాబు రాజేంద్రప్రసాద్ తర్వాత రెండవ రాష్ట్రప్రతిగా ఎన్నొకోవడానికి ప్రధాన కారణం, ఆయన సాధించిన అవార్డులు పేరు ప్రఖ్యాతులకు అన్నిటికీ ప్రధాన కారణం డా॥సర్వేపల్లి గారు విద్య మరియు విద్యా రంగానికి చేసిన సేవలే, ఆయన చేపట్టిన ఉపాధ్యాయ వృత్తి వలనే ఆయనకు దేశ అత్యున్నత పదవులు వరించాయి, ఒక టీచర్ నవ సమాజ నిర్మాతగా విద్యార్థులందరినీ కల, మత భేదం లేకుండా ముందుకు నడిపించే గురువుగా ఉండాలని బోధించారు, అందుకే భగవద్గీతను చదివినంత శ్రద్ధాసక్తులతో బైబిల్‌ చదివారు సర్వేపల్లి గారు, ఖురాన్‌ ను అలవోకగా నేర్చుకున్నారు, సూఫీ తత్వాన్నీ మధించారు, విశ్వ గురువుగా పేరొందిన సర్వేపల్లి గారికి కొందరు విద్యార్థులు ఆయనకు పుట్టినరోజు సంధర్బంగా శుభాకాంక్షలు తెలిపితే, జన్మదినం కాకుండా ఉపాధ్యాయ దినంగా మలిచిన గొప్ప వ్యక్తి, చరిత్ర మరువని గొప్ప పండితున్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కేవలం ఉపాధ్యాయులదే కాదు, జ్ఞానాన్ని పొందిన ప్రతి పౌరునిది, ఇది దేశ ప్రజలందరిదీ.!గొప్ప స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు, అన్ని రంగాలలో స్థిరపడ్డ జ్ఞానవంతులు, విద్యావంతులు, చదువుకున్న మరియు చదువుతున్న ప్రతి పౌరుడు తన గురువులను స్మరించుకొనే రోజు.!

గురువు దైవంతో సమానం

గురు బ్రహ్మ, గురువిష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమహః అని దైవంతో సమానంగా కొలుస్తారు, పాఠశాల అనే దేవాలయంలో అతనే దైవం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని సమాజంలో తల్లి తండ్రుల తర్వాత స్థానం గురువులకే ఇస్తారు, ప్రఖ్యాత కవి కబీర్ దాస్ తన కవితల్లో గురువుపై ఉన్న తన భక్తి ఏకంగా భగవంతుని కన్న ఎక్కువ ప్రాధాన్యత గురువుకే ఇస్తారు, గురువూ గోవిందుడూ ఎదురైతే మొదట గురువుకే మొక్కాలంటారు. కేవలం విద్య నేర్పించడమే కాకుండా మంచి చెడుల జ్ఞానోదయం కలిగించేది, వినయ విధేయతలు నేర్పించేది, తల్లి తండ్రులు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు చూపే విధంగా మంచిని బోధించేది, కష్ట కాలంలో నిలదొక్కుకునే విధంగా ధైర్యాన్ని నింపేది, సమాజ నిర్మాణంలో ప్రజా సేవ చేసే విధంగా రాజకీయాలను అవగాహన పర్చేది, ఉన్నత రంగాల్లో రానించేలాగా చేయడంలో, బాధ్యతలను, కర్తవ్యాలను, తెలివితేటలను, శక్తిని, యుక్తిని, శాంతిని, ధర్మాన్ని, తన దగ్గరున్న అపార అనుభవాన్ని నర నరాన నింపి శిలి శిల్పాన్ని చెక్కినట్లు విద్యార్థులలోని జ్ఞానాన్ని చెక్కుతూ రూపకల్పన చేసేదే కేవలం ఉపాధ్యాయుడే.!

నేటి సాంకేతకత 4జీ, 5జీలు గురూజీ కు సమానం కాలేవు..!

సాంకేతికత ఎంత పెరిగినా, అర చేతిలో ప్రపంచం మొత్తం కనపడేలా ఫోన్లు, నెట్ వర్క్ లు ఉన్నా కూడా, నేటి 5జీ స్పీడ్ వెతకలేని కొన్ని విషయాలను తన విద్య ద్వారా తన ఇంద్రియ జ్ఞానం ద్వారా మేల్కొలిపే శక్తి టీచర్ వద్దనే ఉంది, ఈరోజుల్లో యువత విషయ శోధన కోసం, ఏదైనా తెలుసుకోవాలన్నా గూగుల్ లో కొట్టు, యూట్యూబ్ తల్లిని అడుగు అంటున్నారు, అంతర్జాలంలో అన్ని తెలుస్తాయనే భావనలో ఉన్నారు, ఆ గూగుల్ కే గురువైనా ఉపాధ్యాయుని మాత్రం గుర్తించడం లేదు, సాఫ్ట్ వేర్లు మొత్తం ప్రపంచం చేతిలో ఉన్నప్పటికీ దాని పాస్ వర్డ్ లు మాత్రం గురువు తన దగ్గరే ఉంచుకున్నాడు, జీవిత లక్ష్యాన్ని జీవితమంతా గుర్తుండెలా బోధించేది గురువు, ఒక విద్యార్థి తల్లి తండ్రుల కన్నా ఎక్కువ సమయం గడిపేది ఉపాద్యాయులతోనే, చీకటి నుండి వెళుతురు వైపు నడిపించి అజ్ఞాన తిమిరంలో విజ్ఞాన కాంతులు ప్రసరించేది టీచర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి, సమాజంలో మంచి పౌరులు తయారవ్వాలన్నా, నిరక్షరాస్యులు లేకుండా చేయాలన్నా, దేశంలో నిరుద్యోగిత తగ్గాలన్నా, యువత స్వావలంబన వైపు నడవాలన్నా, సమాజంలో ప్రగతి సాదించాలన్నా, దేశం అభివృద్ది పథంలో నడవాలన్నా, ధనిక పేద, కుల మత తేడా లేకుండా, శాంతియుతంగా, ఐకమత్యంగా ఉండాలన్నా, దేశభక్తి పెంపొందాలన్నా, మానవత్వం అనేది అలవర్చుకోవాలన్నా గురువే ముఖ్యం, తన మాటల ద్వారా, తన ప్రజ్ఞకు సృజనాత్మకతను జోడించి మానసిక ఆందోళనలను దూరం చేయగల విద్య, ఓపిక సహనంతో ఎదగ గలిగే విద్యను అందించి విద్యార్థి మెదడు, మనస్సు పై తన మేధో సామర్ద్యంతో నియంత్రించే శక్తి, విద్యార్థి శారీరక మనసిక ఎదుగుదలకు తోడ్పడే వ్యక్తి, విద్య అనే ఆయుధం గలవాడు కేవలం ఉపాధ్యాయుడే, ఎన్ని తరాలైనా కూడా ఈ విద్యలన్నీ గూగుల్, యూట్యూబ్ లు నేర్పలేవు,

గురువులకేది ఆదరణ.?

అత్యంత విలువైన వృత్తిని నిర్వహిస్తూ సమాజాన్ని చక్కదిద్దే భావి భారత పౌరులను, మానవ వనరులను తయారు చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు మన ప్రభుత్వాలు ఇచ్చే స్థానం ఎంత.? కొన్ని ప్రభుత్వాలు కొంత మంది అధికారులు గురువులను తక్కువ చేసి చూపడం వలన ఈరోజు సమాజంలో టీచర్ అంటే చిరుద్యోగి అన్న భావన కొందరిలో నెలకొన్నది, పాఠశాలల కోసం, విద్యార్థుల కోసం, జీతాల కోసం, బదిలీల కోసం, ఇలా అనేక రకాల సమస్యల సాధన కోసం, డిమాండ్లు నెరవేరాలంటే రోడ్డునెక్కి ధర్నాలు నిరసనలు చేయాల్సిన పరిస్థితులు, అడుక్కుంటేనో లేదా కొట్లాడితే గాని అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకోవనే భావన నెలకొంది, గురువులను అధ్యాపక వృత్తికే కాకుండ ఎన్నికల విధులు, ప్రభుత్వ సర్వేలు, తదితర పనులకు వాడుకోవడం తప్పా గౌరవప్రధమైన హోదా ఎక్కుడుంది.? బోధనకు ఫలితాలకు ముడి పెట్టి మానసిక ఒత్తిడికి గురిచేయడం, శాఖపర చర్యలు తీసుకోవడం ఏ దేశంలో లేదు, ఇతర దేశాలలో గురువులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో ఒకసారి పరిశీలిస్తే… ఫిన్ లాండ్, దేశం జపాన్, సింగాపూర్, కెనడా, దక్షిణకొరియ, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ లాంటి కొన్ని దేశాలలో గురువుల స్థానం ఆ దేశంలోని వి.ఐ.పి లతో సమానంగా ఉంది, అత్యంత విలువగల వారిగా గౌరవప్రధమైన వారిగా గుర్తిస్తూ అక్కడి ప్రభుత్వాలకు సలహాదారులుగా, దేశ విజయానికి కీలక సహకారులుగా పరిగణించబడుతున్నారు, డాక్టర్లు న్యాయవాదుల కన్న అధిక ప్రాధాన్యత ఉంది, స్వంత నిర్ణయాలు తీసుకునే అధికారం, బలమైన స్వయంప్రతిపత్తి కలిగి ఉంటారు, కొన్ని దేశాల్లో అందరికంటే ఎక్కువ జీతాలు పొందుతున్నారు, దేశాధినేతకు ముఖ్య సలహాదారులుగా, ప్రతి దేశంలో ఇలా వేరు వేరుగా ప్రాధాన్యతలు కలిగివున్నారు, భారత దేశంలో కూడా ఇలాంటి సమాన అవకాశాలు, గౌరవ హోదాలు కల్పించినప్పుడే వారు మరింత కష్టడి మట్టిలో మానిక్యాలు తీసినట్లు సమాజంలో విద్యార్థులను ఉన్నత శిఖరాల వైపు నడిపించగలుగుతారు, నైతక విలువలు, కులమత బేదం లేని సమాజం, దేశం అభివృద్ధిపథంలో నడుస్తుందనడంలో అతిశయోక్తి కాదేమో.!

వ్యాస కర్త
సయ్యద్ జబీ (అధ్యాపకులు)
9949303079

ప్రభుత్వఅధ్యాపక సంఘ
మైనారిటి విభాగ రాష్ట్ర అధ్యక్షులు (తెలంగాణ)

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS