- టిపిఎస్ కు చైన్ మెనే దిక్కా.!?
- సెలవుపై వెళ్లిన ఏసీపీ,టీపీఎస్..!
- జెడ్సి మందలింపే కారణమంటూ
ప్రచారం..! - ఉన్న ఒక్క టీపీఎస్ సెలవుతో..
- తీవ్ర అవస్థలు పడుతున్న పబ్లిక్
- పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తమ
పనులు జరిగేదేట్లంటూ మండిపాటు! - జిహెచ్‌ఎంసి కమిషనర్,
సర్కార్..చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి
మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైంది శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం పరిస్థితి. అసలే టిపిఎస్ విభాగమనేది అందుబాటులో ఉన్న అరకొర ఉద్యోగులతో కొనసాగుతుండగా..ఇప్పుడు ఆ ఒక్క టీపీఎస్..సర్కిల్ ఏసిపి కూడా సెలవుపై వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. సర్కిల్-20 లిమిట్స్ లో శేర్లింగంపల్లి,గచ్చిబౌలి,కొండాపూర్ డివిజన్లున్నాయి. ఒక్కో డివిజన్లో 60 నుంచి 70 వేల వరకు జనాభా ఉంటుంది. నిబంధనల ప్రకారం సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం మొత్తానికి ఏసిపి ఇన్చార్జిగా ఉండగా.. ప్రతీ డివిజన్ కు ఒక టిపిఎస్ అధికారి,చైన్ మెన్ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ లెక్కన శేర్లింగంపల్లి సర్కిల్ పట్టణ ప్రణాళిక విభాగంలో ముగ్గురు టీపిఎస్లు,చైన్ మెన్లు పని చేయాలి.
అయితే ఉద్యోగుల కొరత కారణంగా చాన్నాళ్లుగా సర్కిల్-20లో టీపీఎస్ గా రమేష్ ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు.ఇతనే మూడు డివిజన్లను పర్యవేక్షిస్తున్నారు.అయితే ఒకే ఒక్క టీపీఎస్ తో అరకొర పనులు జరుగుతున్న సర్కిల్-20లో పది రోజుల క్రితం ఏసిపి మెహరా,టీపీఎస్ రమేష్ సెలవుపై వెళ్లారు. ఇటీవల జరిగిన జోనల్ మీటింగ్ లో శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఆర్.ఉపేందర్ రెడ్డి ఏసిపి మెహరా,టీపీఎస్ రమేష్ లను మండలించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ గత పది రోజుల క్రితమే సెలవుపై వెళ్లినట్లు సమాచారం.అయితే సర్కిల్-20 టౌన్ ప్లానింగ్ విభాగానికి ఆయువు పట్టు లాంటి ఈ రెండు పోస్టులు ఖాళీ కావడం,వారిద్దరూ సెలవుపై వెళ్లడం పట్టణ ప్రణాళిక విభాగానికి గుది బండగా మారింది.
సర్కిల్-20 లిమిట్స్ లో మూడు డివిజన్లు ఉండడంతో..ఆయా డివిజన్లలో భారీగానే కొత్త బిల్డింగ్స్, అదనపు అంతస్తుల కోసం దరఖాస్తులు వస్తుంటాయి.అలాగే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదులు చేస్తుంటారు.వీటన్నింటిని చూడాల్సిన బాధ్యత టీపీఎస్ దే. అయితే చాన్నాళ్లుగా శేరిలింగంపల్లి సర్కిల్ లో రమేష్ ఒక్కరే టీపీఎస్ గా విధులు నిర్వర్తించడంతో అరకొరగా మాత్రమే పనులు జరుగుతుండేవి.ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏసిపి మెహరాతో పాటు వున్న టీపీఎస్ రమేష్ కూడా జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా లీవ్ పెట్టీ వెళ్లిపోవడం ప్రజలకు శాపంగా మారింది.దీంతో సర్కిల్-20లో పట్టణ ప్రణాళిక విభానికి సంబంధించిన ఒక్క పని కూడా జరగకపోతుండడంతో…ప్రజలు తీవ్ర అసంతృప్తి గురవుతున్నారు.అందువల్ల ప్రభుత్వం,ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.