Saturday, November 23, 2024
spot_img

చదువుల్లో జ్ఞానం-మానసికంగా అజ్ఞానం

Must Read

మనిషి దిగజారి పోతున్నాడు.అధః పాతాళానికి అడుగంటి పోతున్నాడు.కాలం నేర్పిన పాఠాల నుండి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.ఇతరుల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే స్వీయ అనుభవాలతో భంగపడక తప్పదు. చదువు అణకువకు నెలవు కావాలి. జ్ఞానం విలువలకు కొలువులు కావాలి.కాని ప్రస్తుత సమాజం పోకడ తద్విరుద్ధంగా సాగుతున్నది.దిగజారిన మనసుల్లో దిగులుకు చోటుండదు. పతనంలో కూరుకుపోయిన మనుషులకు శతృత్వానికే తప్ప పశ్చాత్తాపానికి తావుండదు. స్వార్ధమే పరమావధిగా ఎంచుకున్న వ్యక్తులకు వ్యక్తిత్వం పనికిరాదు. నేటి వ్యవస్థకు గుణాలతో పనిలేదు. ధనమే ఇంధనం. స్వార్ధమే ఆయుధం.మనసు నశించిన మనుషుల లోకంలో కాకుల్లా బ్రతికే కాలం దాపురించింది.మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా,విజ్ఞానం వికసించినా ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా కానరావడం లేదు. మానవుల ఆశకు అంతం అనేది లేకుండా పోయింది. అత్యాశకు ఆకాశమే హద్దుగా మారింది. స్వార్ధం పడగవిప్పి బుసలు కొడుతున్నది. కాసుల వేటలో పడి మానవత్వాన్నే అమ్మేసే ప్రబుద్ధులు కొందరైతే, అత్యాశతో అలవికాని కోర్కెలతో అరాచకవాదం వైపు పయనిస్తున్న వారు మరికొందరు. పంచభూతాలను పరమాన్నంలా భోంచేస్తున్న వారు కొందరైతే,వీలైతే ఇతర గ్రహాలను సైతం తమ ఆధిపత్యం లోకి తెచ్చుకుని, తిష్ఠవేయాలనే దురాశ కొందరిది. దురాశతో దూరాలోచన మరచి, విజ్ఞత క్షీణించి,వివేకాన్ని కాటికి సాగనంపి,విచక్షణ కోల్పోయి,అహంకార మదంతో చెలరేగి పోయే మానవ మస్తిష్కాలకు రాబోయే విపత్కర పరిణామాల గురించి యోచన చేసే తీరికెక్కడిది? శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానంతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించే మానవజాతి ఇంకా ఏదో సాధించాలనే తపనతో తనను తానే వంచించుకుని,హింసించుకునే హీన స్థితికి దిగజారింది. ఆకాశహర్మ్యాలలో విహరిస్తూ,చంచల స్వభావచిత్తులై నేలవిడిచి సాము చేస్తున్న స్వార్ధ మానవలోకం మానవ పరిణామ క్రమాన్ని, మొదటికి తెచ్చి,మునిగి పోవడానికి సిద్ధంగా ఉంది. మనిషి మనిషికీ సంబంధాలు లేవు. ఒక రాష్ట్రానికి,మరొక రాష్ట్రానికి సఖ్యత లేదు..ఒక దేశానికి మరొక దేశానికి మధ్య అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేటంత వైరం నెలకొంది. ప్రపంచమంతా కుగ్రామంలా మారినా, రవాణా సౌకర్యాలు పెరిగి, ఇతర దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలు పెరిగినా, మనిషి హృదయంలో ఇంకా అసంతృప్తి జ్వాలలు కార్చిచ్చులా దహిస్తున్నాయి.

ఇతర గ్రహరాశుల గమనం గురించి అధ్యయనం చేస్తూ, గ్రహదోషాలను సవరించడానికి ప్రయత్నిస్తున్న మానవుడు తనకు పట్టిన అనైతిక దోషాన్ని నిలువరించలేకపోవడం విడ్డూరం.
ఏదో సాధించాలనే తపనతో తనను తానే వేధించుకుతినే స్థితికి మానవుడు దిగజారి పోయాడు.”స్వార్ధంలో పరమార్ధం- సూక్ష్మంలో మోక్షం” అన్వేషణలో మనిషి తన అస్థిత్వాన్ని కోల్పోతున్నాడు. కోట్లకోసం కుమ్ములాటలు…ఆస్తుల కోసం ఆరాటాలు…అలవికాని కోరికల కోసం పోరాటాలు…ఇదే మానవనైజం.”తన స్వార్ధమే తనకు రక్ష “అనే రీతిలో సమాజహితాన్ని గాలికొదిలి,స్వప్రయోజనాలకోసం విలువలకు తిలోదకాలిచ్చి, హీనంగా జీవిస్తూ,హీనత్వం లోనే శిఖరాగ్రమంత ఉన్నతిని గాంచి ఊహల్లో ఊరేగుతున్న ‘మనిషి’ మానసిక పతనం సమాజానికి శాపం.స్వార్ధం,ద్వేషం,అసూయ,అహంకారం,అవినీతి వంటి మనో జాఢ్యాలు వైద్యపరిభాషకు అందనంత ఎత్తులో తిష్ఠవేశాయి.

మనిషి పెరిగాడు – మనసు తరిగింది.మానవతత్వం మారింది- మానవత్వం నశించింది. విజ్ఞానం పెరిగింది.వికాసం క్షీణించింది. మనిషి విజ్ఞాని,మానసికంగా అజ్ఞాని.సంస్కారం లోపించింది- సహనం నశించింది. తాను సంపాదించిన ధనంతో తృప్తిపడక, ధనమదంతో ఇతరులను వేధించుకుతినే పైశాచికత్వం మనిషిని అధః పాతాళానికి దిగజార్చింది.ఆధునిక మనిషిలో అసలు మనిషి అదృశ్యమై,మనసులేని రాతిమనిషి, ప్రాణమున్న మరమనిషి ఉద్భవించాడు.స్వచ్ఛమైన మనసు స్థానంలో కృత్రిమమైన మనసు మొలకెత్తింది.కడుపులో కత్తులు పెట్టుకుని, మనసులో కాఠిన్యం నింపుకుని, వదనంలో అరువు తెచ్చిన చిరుదరహాసాన్ని ధరించి కృత్రిమ కౌగిలింతలతో నటనా కౌశలం ప్రదర్శిస్తూ, మహానటులను తలపించే రీతిలో ఆత్మవంచనతో బ్రతికేస్తున్నాడు నేటి మనిషి.కోట్లకు పడగలెత్తినా గుప్పెడు మెతుకులకు నోచుకోడు.అనారోగ్యంతో ఆసుపత్రుల వెంట పరుగులు…వైద్యల చికిత్సకు లొంగని రోగాలు…ఆకలి దహిస్తున్నా తినలేని దుస్థితి.
లెక్కలేని ధనం అక్కరకు రాని చుట్టంలా వెక్కిరిస్తుంటే భోషాణాల్లో మూలుగుతున్న నల్లధనానికి రెక్కలొచ్చి ఎగిరిపోకుండా అహర్నిశలు కాపలా కాస్తూ అందులోనే పరమానందం పొందే లోభగుణం సకల దుర్గుణాల్లో మహాచెడ్డగుణం.ధనార్జనకే జీవితమన్నట్టు బ్రతికేస్తే ఆ జీవితానికి అర్ధం నిఘంటువుల్లో భూతద్దంతో వెదకినా దొరకదు.శక్తియుక్తులన్నీ స్వార్ధానికి ఖర్చయిపోయే ఇంధనంలా మారిపోతే, వ్యాపారవ్యూహాల్లో,స్వార్ధ చింతనలో తలమనకలై నిజమైన ఆనందాన్ని వదిలేస్తే,చివరికి మనశ్శాంతి కరువై, తన మనసుకు తానే బరువై తనువు చాలించే కోటీశ్వరుల కథలన్నీ కన్నీటి కావ్యాలే- మానసిక వేదనలే.భూగోళమంతా భగ్గుమంటున్నది. కాలుష్య భారంతో జనవాహిని అల్లాడిపోతున్నది. కల్తీ సరుకులతో మానవారోగ్యం మంచంపై పడింది.

పీల్చేగాలి,త్రాగే నీరు,తినే తిండి విషతుల్యమైపోయింది.భూ ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పర్యావరణం ప్రమాదంలో పడింది. ప్రకృతి ప్రకోపానికి మానవాళి కకావికలమైపోతున్నది. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బంగారు బాతు గుడ్డు లాంటి భూగర్భసంపద స్వార్ధపూరితమైన ఆలోచనలతో కొల్లగొట్టబడుతున్నది. ఇంధన వనరులు తరిగిపోతున్నాయి. పాడి పంటలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి.మనిషికి నిలువ నీడకూడా దొరకని పరిస్థితులు దాపురిస్తున్నాయి. భూగోళం నిర్జీవమైపోతే మానవగతి ఏమౌతుంది? ఇతర గ్రహాలు నివాసయోగ్యమా? ఇది సాధ్యమా?భవిష్య పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో తెలిసి కూడా చెట్టు కొమ్మపై సుఖనిద్ర పోయే మనిషి నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణి విభ్రాంతి కలిగిస్తున్నది. రాబోయే కాలంలో మానవ మనుగడ దుర్లభమని తెలిసినా, మనిషిలో స్వార్ధ చింతన పోలేదు. కాసుల కక్కుర్తి కోసం విలువలను చంపేసి,సాటి మనుషుల బ్రతుకులను దుర్భరం చేసి, పైశాచికానందం పొందుతూ జీవించడం ఆత్మహత్యాసదృశమే.

యుద్ధాలతో నశించిపోతుందనుకున్న మానవాళి స్వార్ధంతో, అసూయాద్వేషాలతో, పైశాచికమైన మానసిక ప్రకోపాలతో, విలువల విధ్వంసంతో అంతరించి పోయే ప్రమాదం పొంచి ఉంది.ఈ భయంకరమైన పరిస్థితులనుండి మానవుడు బయటకు రావాలి. స్వార్ధం విడనాడాలి…ప్రకృతిని సంరక్షించాలి. ఆశలను అదుపులో పెట్టుకుని,మానవజాతి మనుగడ పది కాలాలు వర్ధిల్లే విధంగా నైతిక ప్రవర్తనను తీర్చిదిద్దుకోవాలి. నేటి ప్రపంచంలో చోటు చేసుకుంటున్న అనర్ధాలకు మూలకారణాలను అన్వేషించాలి. నేలవిడిచి సాము చేసే సాహసానికి ఒడిగడితే అన్నవస్త్రాల కోసం పోరాడితే ఉన్న వస్త్రాలు ఊడిన చందంగా మానవ పతనం తథ్యం.

  • సుంకవల్లి సత్తిరాజు.
    (సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్ )
    మొబైల్:9704903463.
Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS