Friday, November 22, 2024
spot_img

గ్రాడ్యుయేట్ ఎటువైపు

Must Read
  • తెలంగాణలో హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు!
  • ప్ర‌తిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక‌లు
  • రాష్ట్రంలో స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్న పార్టీలు
  • 8 గంట‌ల నుంచి 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్‌
  • మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు
  • 2.5 ల‌క్ష‌ల మందికిపైగా నిరుద్యోగ, విద్యార్థి ఓట్లు
  • మ‌రో 50 వేల మందికి పైగా ప్ర‌భుత్వ ఉద్యోగులు

నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడే. మొన్నటి వరకు రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల హడావుడి తగ్గుక మునుపే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రానే వచ్చింది. ఈ నెల 13న 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగగా ఆ తర్వాత వెంటనే ఈ ఎమ్మెల్సీ ఓట్ల జోరు షురూ అయింది. ఒకేసారి రెండు ఎలక్షన్స్ వచ్చిన రాజకీయ నాయకులు ఎవరూ అలసిపోలేదు. 2021లో జరిగిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. అయితే గతేడాది డిసెంబర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉమ్మడి నల్లగొండ – ఖమ్మం – వరంగల్ జిల్లా అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేసి రెండో స్థానంలో నిల్చిన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. అధికార పార్టీ తరపున ఆయన బరిలో ఉండగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలో నిల్చున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో నిలిచారు. ఇండిపెండెంట్ గా పోటీచేస్తున్న బక్క జడ్సన్, అశోక్ సార్ సైతం ప్రధానంగా కనబడుతున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీచేసేందుకు 63 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 11 మంది క్యాండెట్స్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక జరుగనుంది. మొత్తం 4లక్షల 61వేల 806మంది పట్టభద్రులు ఓటర్లు ఉన్నారు. వీరిలో 2లక్షల 87వేల 007 మంది పురుషులు కాగా, 1లక్ష 74వేల 794మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. మొత్తం 4లక్షల 63వేల 839 మంది ఓటర్లు ఉండగా అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23వేల 985, ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షా 66వేల 448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. నల్గొండ , ఖమ్మం, వరంగల్ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఇందు కోసం 605 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో 4,671 మంది ఓటర్లుండగా, ఐదు సెంటర్లు, జనగామలో 23,320 మంది ఓటర్లకు 27 కేంద్రాలు, హనుమకొండలో 43,483 ఓటర్లు ఉండగా 67, వరంగల్ లో 43,594 మంది ఓటర్లకు 59 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో 34,759 మంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ఉండగా 36, ములుగులో 10,237 మంది ఓటర్లకు 17, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12,460 మంది ఓటర్లకు 16 సెంటర్లు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 39,898 మంది ఓటర్లకు 55, ఖమ్మంలో 83,606 ఓటర్లకు 118, యాదాద్రి భువనగిరి లో 33,926 ఓటర్లకు 37, సూర్యాపేటలో 51,293 మందికి 71, ఇక నల్గొండలో 80,559 మంది ఓటర్లకు 97 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్రంలో సంపూర్ణ బలంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా పట్ట భద్రుల స్థానాన్ని కూడా తమ ఖాతాలోనే వేసుకోవాలని చూస్తోంది. ఈ మేరకు మూడు ఉమ్మడి జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులకు బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడికక్కడ మీటింగ్ లు కూడా నిర్వహించి, పట్టభద్రులకు చేరువయ్యే ప్రయత్నాలన్నీ పూర్తి చేశారు. ఇక సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ కూడా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ మేరకు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ఎన్నికను ఛాలెంజింగ్ గా తీసుకుని పూర్తి బాధ్యతలు పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఆ తరువాత నేరుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు క్షేత్రస్థాయి ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతలను ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు ఇన్ ఛార్జ్ లుగా నియమించి, కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.

27వ తేదీ (నేడు) ఉదయం 8గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. నాలుగు గంటల వరకు క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువగా 52మంది బరిలో ఉండడంతో ఎన్నికల అధికారులు జంబో బ్యాలెట్ పేపర్‌తో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి సిబ్బందికి పంపిణీ చేశారు. పోలింగ్ రోజు నేడు (సోమవారం) ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. మరోవైపు ఆ మూడు జిల్లాల పరిధిలో 48 గంటలపాటు వైన్‌ షాపులు బంద్ చేశారు.

ఇదీలా ఉండగా బ్యాలెట్ పేపరుపై అభ్యర్థుల పేర్లు తెలుగు, ఇంగ్లీష్ లో ఉంటాయి. క్యాండెట్ పేరుకు ఎదురుగా ఉండే బాక్స్ లో అభ్యర్థికి ఇవ్వదలుచుకున్న ప్రాధాన్యత 1, 2 లేదా 3 అంకెను వేయాలి. పోలింగ్ కేంద్రంలో ఎలక్షన్ అధికారులు ఇచ్చే స్కెచ్ తో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓటును కచ్చితంగా వేయాలి. ఆ తర్వాత వారికి నచ్చిన మిగతా అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో అంకెలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థికి ఒకే ప్రాధాన్యత ఓటు వేయాలి. ఓటర్లు అభ్యర్థులకు అంకె ద్వారా వారి ప్రాధాన్యత తెలపాల్సి ఉంటుంది. ఓటు వేసే క్రమంలో ఇంటూ గుర్తు, ఇతర సింబల్స్ రాయకూడదు. పోలింగ్ డే రోజు ఈ మూడు జిల్లాల్లో ప్రత్యేక సెలవు ప్రకటించింది ప్రభుత్వం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జూన్‌ 5న కౌంటింగ్‌ చేసి అదే రోజు ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంపై గురి పెట్టిన మూడు ప్రధాన పార్టీలు గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారోననే ఉత్కంఠ నెలకొంది.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS