Friday, November 22, 2024
spot_img

రాజకీయ చదరంగం

Must Read
  • పొలిటికల్ పార్టీల్లో రచ్చ రచ్చ
  • పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్న ఎమ్మెల్యేలు
  • దీని వెనుక అసలు వాస్తవాలేంటి..!!
  • కౌశిక్ రెడ్డి హంగామా ఏంటి,అరికేపుడిని సపోర్ట్ చేస్తున్న వారెవరూ..?
  • ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నది ఎందుకు..?
  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ల వ్యూహామేనా
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్కా స్కేచే గొడవకు కారణమా.!
  • గణేష్ నిమజ్జనం,విమోచన దినోత్సవాలు ప్రశాంతంగా జరిగేనా.?
  • 17న విమోచన దినోత్సవానికి అమిత్ షా రాక.?
  • పోలీసులు భద్రత కట్టుదిట్టం చేయడంలో సఫలమయ్యేనా..?

తెలంగాణలో రాజకీయ రసవత్తరంగా సాగుతుంది.రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనప్పటికి అధికార,విపక్ష పార్టీలు మాత్రం జనాల్ని పరేషాన్‌ చేస్తున్నాయి. ‘అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం’ అన్నట్టు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాల విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తెలంగాణలో కొత్త గొడవ సృష్టించడం మన నాయకులకు వెన్నెతో పెట్టిన విద్య. అదీ ఇయాల కొత్తేమి కాదు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి సామాన్యులను పిచ్చొళ్లను చేసుడులే వీళ్లకు వీళ్లే సాటి.. వీళ్లకు లేరేవరూ పోటీ. అందుకు నిదర్శనమే తాజాగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కొట్లాటే. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లు ఈ పాలకులు.. దారిన పోయే వీధి కుక్కను పిలిచి మరీ గెలుకుతున్నట్టు అనిపిస్తుంది. వాస్తవానికి గతంలో తెలంగాణలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చింది. 2014లో టీడీపీ, ఆ తర్వాత 2019లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న కేసీఆర్‌.. వారికి మంత్రి పదవులను సైతం ఇచ్చిన ఘనత ఆయనది. అంతేకాకుండా సీఎల్పీని బీఆర్‌ఎస్‌ లో కలుపుకున్న మేధావి. అంతకుముందు తెలుగుదేశంను, మొన్న కాంగ్రెస్‌ ఆ రెండు పార్టీలను కనుమరుగు చేసిన పెద్ద మనిషి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావే కదా. ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే కేసీఆర్‌ ఫామ్‌ లో పడుకుండు, జైలుకు పోయి వచ్చిన కవిత ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటుంది. కాగా, కేటీఆర్‌ ఏమో విదేశాల్లో చక్కర్లు కొడుతుంటే… తెలంగాణలో ఉద్యమంలో గట్టిగా కొట్టాడిన హరీశ్‌ రావు మాత్రం రోడ్ల మీద తిరగబట్టే. ఇదంతా చూస్తుంటే హరీశ్‌ ను అస్త్రంగా చేసుకొని ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్‌ రెచ్చగొట్టి మళ్లేం రాజకీయం చేస్తుండ్రో అంతుచిక్కడం లేదు. అదేవిధంగా భాగ్యనగరంలో ఈ నెల 17న వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ (కౌశిక్‌, అరికెపూడి) కొట్లాట తలనొప్పిగా మారనుందా. ఓ పక్క 16న మిలాదున్‌ నబీ, 17న నిమజ్జనం కావడంతో పోలీసులకు పెద్ద టాస్క్‌ కాగా, మరోవైపు రాజకీయ నాయకుల పంచాదీతో సెక్యూరిటీ కష్టతరంగా మారనుంది. ఇదే సమయంలో 17న విమోచన దినోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రానున్నట్లు తెలుస్తోంది. అదే రోజు అధికార పార్టీ ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తుండగా, బీజేపీ మాత్రం తెలంగాణ విమోచన వేడుకల్ని జరుపనుంది. దీనికోసం షా స్పెషల్‌ గెస్ట్‌ గా హాజరుకానున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఏం జరుగబోతుందో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ కలగలిపిచూస్తే తెలంగాణ పోలీసులకు భద్రత కష్టమనే అనిపిస్తుంది.

కౌశిక్‌, అరికెపూడి గొడవ వెనుక:
హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు చేస్తున్న రాజకీయం వెనుక మతలబ్‌ ఏంటో అర్థం కావడం లేదు. నిజంగా ఎమ్మెల్యేలు కౌశిక్‌ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య తగాదాలకు కారణం వేరే వినిపిస్తుంది. కావాలనే ఇద్దరూ నేతలను మరికొందరూ ఉసిగొల్పినట్లు అర్థమవుతోంది. కౌశిక్‌ ను ఎవరో ముందుండి నడిపిస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. అదేవిధంగా అరికెపూడి కూడా కాంగ్రెస్‌ లో చేరి పీఏసీ ఛైర్మన్‌ పదవీని కొట్టేశాడు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ పై బురదజల్లుతున్నట్లు తెలుస్తుంది. కానీ ఇందులో ఏదో మర్మం దాగి ఉందనే సందేహాలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి. ఇద్దరూ గులాబీ పార్టీకి చెందిన వారే కావడం, గతంలో వీళ్లిద్దరూ కలిసి పనిచేయడం, గత నవంబర్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే కారు గుర్తుపై పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. కౌశిక్‌ రెడ్డి మొదట్లో కాంగ్రెస్‌ వ్యక్తి కాగా కొంత కాలం క్రితం బీఆర్‌ఎస్‌ గూటికి చేరాడు. గాంధీ సైతం టీడీపీ నుంచి గులాబీ జెండా కప్పుకున్న వాడే. వీళ్ల మధ్య గొడవ ఎందుకు వచ్చిందనేది ప్రశ్న. అదే విధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్‌ఎస్‌ కు ఎక్కువ సీట్లు వచ్చాయి. అదీ కూడా సెటిలర్ల ద్వారా గెలుపొందిన వారేనని చెప్పాలి. అందులోనూ నేతలూ సైతం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం.

ఎన్నికల సమయంలో ఆంధ్ర వాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల కేసీఆర్‌ భారీ డైలాగ్‌ లు వేశాడు. హైదరాబాద్‌ మన అందరిదీ ఇక్కడ నివసించే ప్రజలు మన వాళ్లు.. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు అయినప్పటికీ కుటుంబంలోని సొంత మనుషులేననే మాటలు మాట్లాడారు. అయితే ఇప్పుడు కౌశిక్‌ రెడ్డి మాత్రం అరికెపూడిది ఆంధ్ర.. అక్కడ్నుంచి వలస వచ్చిన నువ్వు హైదరాబాద్‌ లో పెత్తనం చేస్తావా అంటూ ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడ్తున్నాడు. దీనిపై మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు స్పందించపోవడం వెనుక ఆంతర్యామేంటి. ఈ ఘర్షణకు ఆద్యం పోసిందే ఈ ముగ్గురేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవను పెద్దగా చేసి చూపిస్తున్న మీడియా సైతం పాపంలో పాలుపంచుకుంటున్నాయని చెప్పవచ్చు. పదేళ్ల క్రితం విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్ల లెక్క పోటీపడి అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి.. నువ్వెంత.. అంటే నువ్వెంత..అంటూ నీది ఆంధ్ర, నాది తెలంగాణ అనే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ.. హైదరాబాద్‌ ఇమేజ్‌ ను దెబ్బతీయడం చాలా సిగ్గుచేటు. అటు అధికార కాంగ్రెస్‌ పార్టీ లీడర్లు సైతం ఈ తగాదాలో కారకులుగానే చూడవచ్చు. బీఆర్‌ఎస్‌ లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను హస్తం పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్లలో ఒకరికి పీఏసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చి పంచాదీ లేవనెత్తిన కాంగ్రెస్‌ ఆ పది మందిపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్‌ ను మేనెజ్‌ చేస్తుందా. 6గ్యారెంటీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వదలిలేసి పక్క పార్టీని దెబ్బ తీసి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తుంది. ఏదోక ఘర్షణలు లేపి జనాల్ని పిచ్చొళ్లను చేసేలా ప్రయత్నాలు చేస్తుంది. ఇదంతా చూస్తున్న రాష్ట్ర ప్రజలేమి అమాయకులు కాదని అటు అధికార, ఇటు విపక్ష పార్టీలు గుర్తెరగాలని మేధావులు హెచ్చరిస్తున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS