(సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం)
ఓజోన్ పొర రంధ్రాన్ని మూసెద్దామా ??
ముప్ఫైవ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని 2024లో మనం జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం భూమిపై జీవించడానికి ఓజోన్ పొర చాలా అవసరమని మనకు గుర్తుచేస్తుంది.భవిష్యత్ తరాల కోసం దానిని రక్షించడానికి కొనసాగుతున్న వాతావరణ చర్య యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తుంది. పర్యావరణ మార్పులపై ఓజోన్ పొర క్షీణతపై ప్రజలకు అవగాహన కల్పించడం, అన్ని దేశాల ప్రభుత్వాలు మాంట్రియల్ ప్రొటోకాల్‌ను మరింత సమర్థంగా అమలుచేసి 2050 సంవత్సరానికి ఓజోన్ పొరను 1980కు ముందున్నస్థాయికి తేవడానికి చేయవలసిన చర్యలగురించి శాస్త్రవేత్తలు, పరిశ్రమల యజమానులు, సంబంధిత అధికారులు
సమావేశాలు నిర్వహిస్తారు.
ఓజోన్ పొర అంటే ?
ఓజోన్ మన వాతావరణంలో చాలా చిన్న భాగాన్ని కలిగి ఉంది.అయితే దాని ఉనికి మానవ శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనది. చాలా వరకు ఓజోన్ భూఉపరితలం మీద 10 నుండి 40 కి.మీల మధ్య వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని స్ట్రాటో ఆవరణ అని పిలుస్తారు.ఇది వాతావరణంలోని మొత్తం ఓజోన్‌లో 90% కలిగి ఉంటుంది.స్ట్రాటో ఆవరణలోని ఓజోన్
సూర్య కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతినీలలోహితకిరణాలును ఓజోన్ పొర సంగ్రహించి ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది.ఈ ప్రయోజనకరమైన పాత్ర కారణంగా స్ట్రాటో ఆవరణ ఓజోన్ “మంచి” ఓజోన్‌గా పరిగణించబడుతుంది.దీనికి విరుద్ధంగా కాలుష్య కారకాల నుండి ఏర్పడిన భూమి యొక్క ఉపరితలం వద్ద అదనపు ఓజోన్‌ను “చెడు” ఓజోన్‌గా పరిగణిస్తారు ఎందుకంటే ఇది మానవులకు, మొక్కలు, జంతువులకు హానికరం.
ఓజోన్ పొర క్షీణత అంటే ?
ఓజోన్ పొర క్షీణత అంటే ఎగువ వాతావరణంలో ఉన్న ఓజోన్ పొర సన్నబడటమే. వాతావరణంలోని క్లోరిన్, బ్రోమిన్ పరమాణువులు ఓజోన్‌తో చర్య పొంది ఓజోన్ అణువులను నాశనం చేసినప్పుడు ఇది జరుగుతుంది. ఒక క్లోరిన్ ఒక లక్ష ఓజోన్ అణువులను నాశనం చేయగలదు.ఇది సృష్టించబడిన దానికంటే త్వరగా నాశనం అవుతుంది. కొన్ని సమ్మేళనాలు అధిక అతినీలలోహిత కాంతికి బహిర్గతం అయినప్పుడు క్లోరిన్ బ్రోమిన్‌లను విడుదల చేస్తాయి. ఇది ఓజోన్ పొర క్షీణతకు దోహదం చేస్తుంది.ఇటువంటి సమ్మేళనాలను ఓజోన్ క్షీణత పదార్థాలు అంటారు.మే 1985లో బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వే కథనం యొక్క ఫలితాలను ప్రచురించిన తరువాత అంటార్కిటికాపై ఓజోన్ క్షీణత యొక్క దృగ్విషయాన్ని “ఓజోన్ రంధ్రం”గా సూచిస్తారు,ఈ పదబంధాన్ని నోబెల్ బహుమతి గ్రహీత షేర్‌వుడ్ రోలాండ్ మొదట ఆపాదించారు.ఓజోన్ రంధ్రం యొక్క ఉపగ్రహ చిత్రం పర్యావరణ ముప్పుకు ప్రపంచ చిహ్నంగా మారింది.ఇది మాంట్రియల్ ప్రోటోకాల్‌కు ప్రజల మద్దతును సమీకరించడంలో సహాయపడింది.మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లో ఓజోన్ పొర క్షీణతపై జరిపిన పరిశోధన సంస్థ (మాంట్రియల్ ప్రొటోకాల్) తెలిపింది. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్ ప్రొటోకాల్‌పై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 16 సెప్టెంబర్ 1987న సంతకాలు చేశాయి.ఆ తరువాత 16 సెప్టెంబర్ 1994న మరో సమావేశం జరిపి ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించారు.మాంట్రియల్ ప్రోటోకాల్ సార్వత్రిక ఆమోదాన్ని సాధించడం ద్వారా ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన పర్యావరణ ఒప్పందాలలో ఒకటిగా విస్తృతంగా పరిగణించబడుతుంది. ఇది ఓజోన్ క్షీణించే పదార్ధాలను దశలవారీగా తొలగించడానికి ప్రపంచాన్ని ఏకం చేసింది.దీని అమలు ఓజోన్ పొర యొక్క పునరుద్ధరణకు దారితీసింది. వాతావరణ మార్పులను తగ్గించడంలో గణనీయంగా దోహదపడింది. అంతర్జాతీయ దేశీయ ప్రయత్నాల కారణంగా 2065 నాటికి ఓజోన్ పొర పూర్తిగా కోలుకుంటుందని అంచనా.
ఓజోన్ క్షీణతకు దారితీసేవి ?
రిఫ్రిజిరేటర్లు,ఎయిర్ కండిషనర్లు,ద్రావకాలు,డ్రై క్లీనింగ్ ఏజెంట్లు లలో ఉండే క్లోరోఫ్లోరో కార్బన్‌లు.అగ్నిమాపక యంత్రాలు,వాటి ద్రావకాలలో ఉన్న హాలోన్స్ ,కార్బన్ టెట్రాక్లోరైడ్లు,హైడ్రోఫ్లోరోకార్బన్లు.సంసంజనాలు,ఏరోసోల్లులలో ఉండే మిథైల్ క్లోరోఫామ్ ఓజోన్ పొర క్షీణతకు దారితీసే రసాయనాలు. క్లోరోఫ్లోరో కార్బన్‌లు అత్యంత సమృద్ధిగా ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థం. రాకెట్‌లను నియంత్రించకుండా ప్రయోగించడం వల్ల ఓజోన్ పొర సిఎఫ్సిల కంటే చాలా ఎక్కువ క్షీణతకు దారి తీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకా ఔషదాలు,వ్యవసాయ పురుగుమందులతో పాటు వివిధ రసాయనిక పరిశ్రమల నుండి వచ్చే వాయువులు ఓజోన్ పొర మీద ప్రభావం చూపుతున్నాయి.ఓజోన్ పొర క్షీణతకు అగ్నిపర్వత విస్ఫోటనాలు కూడా కారణం. వీటిని నియంత్రించకపోతే 2050 నాటికి ఓజోన్ పొర భారీ నష్టానికి దారితీయవచ్చు.
మన దేశం తీసుకుంటున్న చర్యలు:
మాంట్రియల్ ప్రోటోకాల్ అమలులో మన దేశం అగ్రగామిగా ఉంది. ప్రోటోకాల్ కింద షెడ్యూల్ కంటే ముందే సాధించబడిన నియంత్రిత పదార్థాల తగ్గింపు లక్ష్యాలను చేరుకుంది.ఇది ఓజోన్ పొరను రక్షించడమే కాకుండా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాలకు గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. మాంట్రియల్ ప్రోటోకాల్ ఫేజ్ అవుట్ షెడ్యూల్‌కు అనుగుణంగా 1 జనవరి 2010 నాటికి నియంత్రిత ఉపయోగాల కోసం భారతదేశం క్లోరోఫ్లోరోకార్బన్స్,కార్బన్ టెట్రాక్లోరైడ్, హాలోన్స్,మిథైల్ బ్రోమైడ్,మిథైల్ క్లోరోఫామ్‌లను దశలవారీగా తొలగించింది. ప్రస్తుతం మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క వేగవంతమైన షెడ్యూల్ ప్రకారం హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్‌లు దశలవారీగా తొలగించబడుతున్నాయి.
పరిష్కారాలు:
ప్రతీ వ్యక్తి ఓజోన్ క్షీణతకు గురిచేసే కారకాలను నియంత్రణకు పాటుపడాలి. ప్రభుత్వాలు కూడా చట్ట వ్యతిరేకంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై ఉక్కుపాదం మోపాలి.
జనక మోహన రావు దుంగ
ఫోన్ 8247045230