(విద్యార్థుల జీవితాలతో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెలగాటం)
- ఫీజురియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయని ప్రభుత్వం
- స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలు
- బీటెక్ పూర్తైన విద్యార్థి ఒరిజనల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని వైనం
- ఎంటెక్ చదివేందుకు కౌన్సిలింగ్ కు ఒరిజనల్ సర్టిఫికేట్స్ తప్పనిసరి
- పై చదువుల కోసం కావాలని అడిగిన ససేమీరా అంటున్న యాజమాన్యం
- సూర్యాపేటలోని భవిత జూనియర్ కాలేజ్ నిర్వాహకం
- ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ చదివే వారికి ఒరిజినల్ ఇవ్వని కళాశాల
- ఫీజురియాంబర్స్ మెంట్ కడితేనే సర్టిఫికేట్ జారీ చేస్తామంటూ హుకూం
- టీసీ, మెమోకు అధనంగా డబ్బులు డిమాండ్
తెలంగాణలో ప్రైవేటు కాలేజీల దురాగతం రోజు రోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. ఇంటర్, ఇంజినీరింగ్, డిప్లొమా, డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు డబ్బులకు కక్కుర్తి పడి స్టూడెంట్స్ జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. తమ కాలేజీలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తద్వారా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా ఇంకా విద్యార్థులు పై చదువులు కోసం మరో కాలేజీలో జాయిన్ కాకుండా ఉన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లకుండా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అడ్డుపడుతున్నాయని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. మీ ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలంటే అట్టి డబ్బులు చెల్లిస్తే తప్ప సర్టిఫికేట్లను ఇచ్చేది లేదంటూ హుకూం జారీ చేస్తున్నారు. వేలాది రూపాయలు ఇప్పుడు తాము ఎక్కడ్నుంచి తేవాలంటూ లబోదిబోమంటున్నారు. తమ బిడ్డలు పెద్ద చదువులు చదువ కూడదనే పాలకులు కక్ష సాధిస్తున్నారని మండిపడుతున్నారు.
పాలకుల నిర్లక్ష్య వైఖరి :
గత తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయలేదు. దేశ, రాష్ట్ర భవిష్యత్ దృశ్యా యువతకు మంచి స్టడీస్ అందించాల్సిన పాలకులు నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారిన పేదోడి పిల్లల బతుకులు మాత్రం మారడం లేదు. ఎన్నో కార్యక్రమాల కోసం కోట్లు ఖర్చు చేసే నాయకులు విద్యార్థుల చదువుల కోసం బడ్జెట్ కేటాయించకపోవడం విడ్డూరం. తెలంగాణ సాధించిన తర్వాత కూడా స్టూడెంట్స్ కు సంబంధించిన ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు పెండింగ్ లో ఉండడం సిగ్గుచేటు. మాజీ సీఎం కేసీఆర్ గత మూడేళ్లకు సంబంధించి బకాయిలు పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, ఇంటర్ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజురియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు ఇవ్వక పోవడం మూలంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్లు పై చదువులు చదివేందుకు తమ ఒరిజనల్ సర్టిఫికేట్స్ కావాలంటూ కాలేజ్ కు వెళ్తే మీ ఫీజురియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ రాలేదు అని చెబుతున్నారు.
ఈ ప్రభుత్వం వచ్చి 9నెలలు :
తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారమిస్తే విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, రైతుల, పేదల బతుకులు మారుస్తామని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్. “నది దాటేదాక ఓడ మల్లన్న.. నది దాటినంక బోడమల్లన్న” అన్న చందంగా వ్యవహరిస్తుంది. రెండు, మూడేళ్లుగా విద్యార్థుల ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు చెల్లించకుండా ఉన్నా ఈ కొత్త ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఇంత వరకు డబ్బులు విడుదల చేయకపోవడం గమనార్హం. పేద పిల్లలు పై చదువులకు వెళ్లకుండా ఆగిపోతున్న పాలకులకు పట్టడం లేదు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మాత్రం కరాకండిగా బకాయిలు కడితేనే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తామంటూ బీష్మించుకు కూర్చొన్నా పట్టించుకునే నాధుడే లేడు.
గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్ బరితెగింపు :
హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (2019-2023) పూర్తి చేసిన కె.శంకర్ తండ్రి ఉద్ధవ్.. ఆదిలాబాద్ జిల్లా, గుడిహట్నూర్ మండలానికి చెందిన నిరుపేద కుటుంబం. ఆయన ఆ కళాశాలలో ఈఈఈ (రూల్ నెం. 19డబ్ల్యూజె1ఏ0251) 2023లో పూర్తి చేశాడు. అనంతరం ఎంటెక్ చేసేందుకు ప్రయత్నించగా జగిత్యాలలోని జెఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ జగిత్యాల నాచుపల్లి (కొండగట్టు) కొడిమ్యాల్ లో సీటు వచ్చింది. అయితే కాలేజీలో జాయిన్ అయ్యేందుకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంది. కాగా గురునానక్ కాలేజీకి వెళ్లి తన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడగ్గా నీ ఫీజురియాంబర్స్ మెంట్ రాలేదు.. ఆ ఫీజు అంతా చెల్లిస్తే తప్ప మెమోలు ఇవ్వడం కుదరదని అల్టిమేటం జారీ చేసింది.
నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను ఇంత మొత్తం చెల్లించుకోలేనని, మీరు సర్టిఫికేట్స్ జారీ చేయని నేపథ్యంలో ఉన్నత చదువులు చదవాలనుకున్నా తన కోరిక కలగానే మిగిలిపోనుందని ఆదాబ్ తో తన ఆవేదన పంచుకున్నారు.
భవిత (ఎంకే రెడ్డి) కాలేజీ అదనపు డబ్బులు వసూల్ :
సూర్యాపేటలోని భవిత (ఎంకే రెడ్డి) జూనియర్ కాలేజీ యాజమాన్యం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. ఓ విద్యార్థినీ 2022-2024 లో ఇంటర్ పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్ షిప్ లు రాలేదని అవి చెల్లిస్తే తప్ప మీ ధృవ పత్రాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతోంది. అంతేకాకుండా మెమో, టీసీ ఇవ్వడానికి అదనపు డబ్బులు వసూలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద కుటుంబంలో పుట్టిన విద్యార్థులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివేందుకు రూ.లక్ష వసూలు చేశారు. మరోవైపు పరీక్ష ఫీజులు, ప్రాక్టికల్ సహా ఇతరత్రా అంటూ వేలాది రూపాయలు దండుకోవడం జరిగింది. పైగా ఇప్పుడు స్కాలర్ షిప్ రాలేదు ఆ డబ్బులు చెల్లించి సర్టిఫికేట్స్ తీసుకోవాలంటూ హుకూం జారీ చేస్తున్నారు. అలాగే మెమో, టీసీ కోసం అదనంగా 3వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ఓ విద్యార్థినీ ఇప్పటికే మూడు, నాలుగు సార్లు తిరిగిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటూ తన ఘోడు వెళ్లబోసుకుంది. డిగ్రీ చదివేందు కోసం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడిగితే ఎంకే రెడ్డి కాలేజీ యాజమాన్యం దుర్బాషలాడుతూ మాట్లాడిందంటూ పేర్కొంది.
ఇకనైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు విడుదల చేసి పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు తోడ్పాటునివ్వాలని, ఇలా కఠినంగా వ్యవహరించే ప్రైవేటు ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు చేయడమే కాకుండా, ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది మేధావులు డిమాండ్ చేస్తున్నారు.