- సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన కేంద్రమంత్రి బండిసంజయ్
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీతో పాటు జరుగుతున్న అవినీతి,అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు.లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో పాటు కల్తీ అయిన నెయ్యి,చేపల నూనెను వినియోగించారని వస్తున్న కథనాలు ప్రపంచంలోని హిందువులు మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తుందని తెలిపారు.గత పాలకులు శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు.అన్యమత ప్రచారం జరుగుతోందని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.శేషాచలం కొండల్లో ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని విమర్శలు వెల్లువెత్తినా స్పందించలేదని మండిపడ్డారు.లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచమని అన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే హిందూ ధర్మం పై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే అనుమానిస్తున్నామని పేర్కొన్నారు.లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి,టీటీడీ పై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేసినట్లుగా భావిస్తున్నమని పేర్కొన్నారు.ఉన్నతస్థాయి వ్యక్తుల పాత్ర లేనిదే ఇంతటి నీచమైన పనిని నిరాటంకంగా ఏళ్ల తరబడి కొనసాగించే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేశారు.ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయాన్ని నిర్దారించడంతోపాటు,ఇతర రాష్ట్రాల్లోనూ విచారణను కొనసాగించాల్సిన అవసరమున్న నేపథ్యంలో సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందని తెలిపారు.రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రపంచంలోని యావత్ హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని,దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా,ఏ పార్టీ వారైనా సరే చట్ట ప్రకారం శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.