Friday, November 22, 2024
spot_img

ముడుపులిచ్చుకో,కాల్వ‌లు పూడ్చుకో

Must Read

(కాల్వ‌లను,ఎఫ్‌టీఎల్,బ‌ఫ‌ర్ జోన్ల‌ను ఆక్ర‌మించిన ఎన్ఓసీ జారీ చేసిన అధికారులు)

  • సుచరిండియా సంస్థ ఆగ‌ని ఆగడాలు
  • కబ్జాకు గురైన దేవర యంజాల్ చెరువు కాల్వలు
  • ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారుల అండదండలతో నిర్మాణాలు
  • రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
  • హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులకు సదరు సంస్థ ముడుపులు
  • కాల్వలను పూడ్చి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం
  • ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేష‌న్ శాఖ అపర మేధావులు
  • అన్నదాతల ఆధీనంలో ఉన్న భూముల‌కు అనుమతులు ఎలా..?
  • ఎఫ్.టీ.ఎల్, బఫర్ జోన్ లను కబ్జాచేసి లే అవుట్ ఏర్పాటు
  • దేవ‌ర‌యంజాల్‌ లోని 3 కాల్వలు, పోతాయ‌ప‌ల్లి 1 కాలువ‌ సహా.. మందాయిప‌ల్లిలోని కుంట ఎఫ్‌టీఎల్,బ‌ఫ‌ర్‌జోన్ క‌బ్జా చేసి లే అవుట్

తెలంగాణలో భూముల ధరలకు రెక్కలొచ్చిన కానుంచి..సెంటు భూమి కూడా వదలడం లేదు అక్రమార్కులు. రోజు వాళ్లు తినేది అన్నమా…లేక భూములను తింటున్నారా అంటే అతిశయోక్తి లేదు. ‘అంబలి తాగేవాడికి మీసాలు ఎక్కు పెట్టేవాడు ఒకడు’ అన్నట్టు రియల్ దందా చేసే కబ్జాకోరులకు సర్కారు ఆఫీసర్ల నిండ ఆశీర్వాదాలు ఉండడం మరో ఆశ్చర్యం. రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతాన్ని తీసుకున్నా ఎకరం పది లక్షలకు పైనే ఉంది. అలాంటప్పుడు ఎవరు ఊకుంటారు. ఎక్కడా ప్రభుత్వ భూమి, అసైన్డ్ ల్యాండ్స్, చెరువులు, కుంటలు, కాల్వలు, గుట్టలు, పుట్టలు ఖాళీగా కనిపించినా వదలడం లేదు. ‘గుడి పూజారిని నమ్ముకుంటే గుడిలో లింగం మాయమైనట్లు’ కబ్జాలు, ఆక్రమణలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతోనే ఇవన్నీ సాగుతున్నాయంటే నమ్మశక్యం కాదు. ‘ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వచ్చాడు’ అన్నట్టుగా భూములను కొల్లగొడ్తున్న వారి వద్ద లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని అండగా నిలుస్తున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దేవ‌ర‌ యంజాల్‌ కు చెందిన మూడు కాల్వలు, పోతాయ‌ప‌ల్లిలోని ఓ కాలువ‌ సహా.. మందాయిప‌ల్లికి చెందిన కుంట ఎఫ్‌టీఎల్, బ‌ఫ‌ర్‌జోన్ క‌బ్జా చేసి లే అవుట్ నిర్మిస్తున్న ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి.

కాల్వలు పూడ్చి పైప్ లైన్ వేసిన దృశ్యం

వివరాల్లోకి వెళితే… మేడ్చ‌ల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్‌పేట మండ‌లం, తూముకుంట మున్సిపాలిటీలోని దేవ‌ర‌ యంజాల్‌కు చెందిన చెరువు యొక్క కాలువ‌ల‌ను సుచరిండియా సంస్థ చేప‌డుతున్న లే అవుట్‌లో నాలాలు పూర్తిగా క‌బ్జాకు గురికావ‌డం జ‌రుగుతుంది. మందాయిప‌ల్లికి చెందిన కుంట యొక్క ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్‌ను ఆక్ర‌మించి లే అవుట్ చేయ‌డం జ‌రిగింది. అంతేకాకుండా పోతాయప‌ల్లికి చెందిన చెరువు కాలువ‌ను కూడా క‌బ్జాకు చేసి లే అవుట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లేవుట్‌లో నిర్మాణ‌దారుల అక్ర‌మాల‌పై ప‌లువురు రైతులు ఇరిగేష‌న్ అధికారులకు కంప్లైంట్ చేసిన పట్టించుకోలేదు. స్థానిక రైతులు అప్పటి చీఫ్ ఇంజ‌నీర్ ధ‌ర్మా, ఎస్ఈ హైద‌ర్‌ఖాన్‌, డీఈఈ ల‌కు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం లెక్కచేయకుండా.. పైగా నిర్మాణ‌దారుల‌తో కుమ్మ‌కై ఎన్ఓసీ ఇవ్వ‌డం గమనార్హం. హెచ్ఎండీఏ అధికారులు.. డైరెక్ట‌ర్ ప్లానింగ్ 1, జూనీయ‌ర్ ప్లానింగ్ ఆఫీస‌ర్‌, ప్లానింగ్ ఆఫీస‌ర్ లు హెచ్ఎండీఏకు సంబంధించిన ప‌నులు పూర్తికాకున్న‌, 40 శాతం భూములు రైతుల ఆధీనంలో ఉన్న‌ప్ప‌టికి అవేమి పట్టించుకోకుండా హెచ్ఎండీఏ అధికారులు పూర్తి అనుమ‌తులు ఇవ్వ‌డం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మరోవైపు చెరువు యొక్క ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌ జోన్, నాలాలు క‌బ్జాలు చేస్తున్నార‌ని స్ప‌ష్ట‌మైన ఆధారాల‌తో ఫిర్యాదు చేసిన‌ పట్టించుకున్న పాపాన పోలేదు. సంయుక్త ప‌రిశీల‌న‌లో నిర్మాణాదారులు దేవ‌ర‌యంజాల్‌కు సంబంధించిన మూడు కాలువ‌ల‌ను, పోతాయ‌ప‌ల్లికి చెందిన ఒక కాలువ‌, మందాయిప‌ల్లికి చెందిన కుంట ఎఫ్‌టీఎల్, బ‌ఫ‌ర్‌జోన్ క‌బ్జా చేసి లే అవుట్ చేస్తున్నార‌ని కంప్లైంట్ చేసిన ప‌ట్టించుకోకుండా ప్రాథ‌మికంగా అనుమ‌తులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అట్టి నిర్మాణ సంస్థలకు పూర్తి అనుమ‌తులు మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా దేవ‌ర‌ యంజాల్‌కు సంబంధించిన కాలువ స‌ర్వే నెంబ‌ర్ 268, 276, 277, 278, 282, 286 లతోపాటు దేవ‌ర‌ యంజాల్‌లోని చిన్న‌బంధం కుంట స‌ర్వే నెంబ‌ర్ 294, 303, 304, 361, 364 ల భూములకు అనుమతులు ఇచ్చారు. క్షేత్ర‌స్థాయిలో మండ‌ల స‌ర్వేయ‌ర్ నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం నాలా యొక్క స‌హ‌జ ప్రవాహం స‌ర్వే నెంబ‌ర్ 294,303,304,361,364 ల గుండా ప్ర‌వ‌హిస్తుంది.

కానీ, ఇట్టి నాలాను దారి మ‌ళ్లించి స‌ర్వే నెంబ‌ర్ 288,289,290,291,292, 305,306,308,309,311,312,313,322,323,326,327,328,329,331, 332,362 ల మీదుగా నాలాను పూడ్చివేసి, అండ‌ర్‌గ్రౌండ్ పైప్‌లైన్‌ను రోడ్డు మ‌ధ్య‌న ఏర్పాటు చేయ‌డం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది.ఈ పైప్‌లైన్‌కు కూడా ఇరిగేష‌న్ శాఖ నుండి ఎలాంటి అనుమ‌తులు లేకపోవడం శోచనీయం. ఇదీలా ఉంటే గ్రామ న‌క్ష ప్ర‌కారం ఉన్న నాలాను పూడ్చి వేసి అడ్డంగా గోడ‌ను నిర్మాణం చేయడం విడ్డూరంగా ఉంది.ఇరిగేష‌న్ అధికారులు నిర్మాణ సంస్థ‌తో భారీ ఎత్తున్న ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తోంది.అందుచేతనే అనుమ‌తులు లేకుండా నిర్మించిన పైప్‌లైన్‌కు ఎన్ఓసీ జారీ చేశార‌ని బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.ఈ అక్ర‌మ లే అవుట్‌లో ఎటువంటి అనుమ‌తులు లేకుండా క్ల‌బ్ హౌస్ నిర్మాణం ఎఫ్‌టీఎల్‌,బ‌ఫ‌ర్ జోన్‌లో ఉంది.ప్ర‌స్తుతం ఇది సీజింగ్‌లో ఉన్న‌ప్ప‌టికి హెచ్ఎండీఏ అధికారులు నిర్మాణాదారుల‌తో కుమ్మక్కై అనుమ‌తులు ఇచ్చినట్లు సమాచారం.

కాల్వలు కబ్జా చేయడంతో జలమయమైన ప్రాంతం

వ్యవసాయ అవసరాలకు సంబంధించిన కాల్వలను కబ్జా చేసి అవి సహజంగా పారే కాల్వలను పూడ్చి వాటిని పైప్ లైన్ల ద్వారా మళ్లించడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్,రెవెన్యూ, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారులంతా ఒక్కటై అక్రమ లే అవుట్ లు నిర్మిస్తున్న సంస్థల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుని ఈ దుశ్చర్య పాల్పడ్డట్లు ఆరోపిస్తున్నారు. అవినీతికి పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు చెరువు కాల్వలు కబ్జాచేసి నిర్మాణం చేపడుతున్న సుచరిండియా సంస్థపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి, సంస్థకు హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమ‌తుల‌ను పూర్తి ర‌ద్దు చేసి,కాల్వ‌ల‌ను పున‌రుద్దించాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇరిగేష‌న్ శాఖ‌లో ఎస్ఈ హైద‌ర్‌ఖాన్,అనుచ‌ర గ‌ణం చేయిస్తున్న అవినీతి అక్ర‌మాల‌పై మ‌రో క‌థ‌నం ద్వారా పూర్తి ఆధారాల‌తో మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైద‌రాబాద్..మా అక్ష‌రం..అవినీతిపై అస్త్రం.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS