Monday, September 23, 2024
spot_img

వికారాబాద్ అడవి విధ్వంసాన్ని ఆపాలి

Must Read

( డిమాండ్ చేసిన పర్యావరణ,అటవీ ప్రేమికులు )

-దామగుండంలో నేవి రాడార్ స్టేషన్..
-12 లక్షల ఔషధ మొక్కలు హాంఫట్..
-సేవ్ దామగుండం ఫారెస్ట్ పిలుపునిచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు..
-వేలాదిగా కదలివచ్చిన పర్యావరణ,అటవీ ప్రేమికులు..

హైదరాబాద్ మహానగరం కనుమరుగు కానుందా..? దామగుండం అటవీ ప్రాంతం బూడిదగా మారనుందా..?లక్షలాది జీవరాశులు,జీవాన్నిచ్చే వృక్ష సంపద మాయమై పోనుందా..?వికారాబాద్ జిల్లా గుండెల్లో మంటలు చెలరేగనున్నాయా..?అంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవునని సమాధానం వినిపిస్తోంది.. పచ్చటి అటవీ ప్రాంతాన్ని కాలరాస్తూ..నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లాతోపాటు,హైదరాబాద్ నగర వాసులు సైతం ఆందోళన వెలిబుచ్చుతున్నారు..ఇంతకూ దాగుండంలో ఏమి జరుగుతోంది..? ఎందుకిన్ని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి..? భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలు ఏమిటి..?ఇప్పుడు తెలుసుకుందాం.

దామగుండం వెళ్తే యమగండం పోతుందని నానుడి.వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌కు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది.జిల్లాలోని అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉన్న దామగుండం అడవిలో కొన్ని వేల రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. అక్కడికి ఎవరైనా వచ్చి ఆ గాలి పీలిస్తే ఉన్న రోగాలు పూర్తిగా నయమవుతాయని భావిస్తారు.అలాంటి ఎంతో చరిత్ర గల దామగుండం అడవి నేడు ప్రమాదంలో పడింది.

మరో కొన్ని రోజులైతే ఆ ప్రాంతంలో జన నివాసం కష్టమేనని స్థానిక గ్రామాల ప్రజలతో పాటు జిల్లా,హైదరాబాద్ నగర ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు.

ఏళ్ల చరిత్ర ఉన్న రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ అడవికి నేవీ ర్యాడార్ స్టేషన్‌తో ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ ప్రేమికులు,జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ భద్రత కోసం నేవీ ర్యాడార్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ మంచిదే అయినా అందుకు ఆ ప్రాంతం సరైన చోటు కాదని వారి వాదన. నేవి రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఎంతో విలువైన 12 లక్షల ఔషధ మొక్కలు నరికివేయాల్సి ఉంటుంది. దీంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అక్కడితో ఆగకుండా నేవి రాడార్ నుంచి పెద్ద మొత్తంలో వచ్చే రేడియేషన్ వేవ్స్ వల్ల అక్కడ నివసించే ప్రజలు, జంతు జాతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అంత రేడియేషన్ తట్టుకుని ప్రజలు నివసించడం అసాధ్యమని ప్రకృతి నిపుణులు చెబుతున్న మాట.

రేడియేషన్ అత్యంత ప్రమాదకరం :

సెల్‌ఫోన్ నుంచి వచ్చే తక్కువ మొత్తం రేడియేషన్‌ను తట్టుకోలేకే పక్షులు, జంతువులు అనేక జీవరాశులు మరణిస్తున్నాయి.నేడు ఎక్కడా పక్షులు కనిపించకపోవడమే అందుకు నిదర్శనం.ఈ ప్రభావం మనుషుల ఆరోగ్యంపై సైతం పడనుందని వైద్యులు చెబుతున్న మాట.ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి వస్తున్న సాధారణ రేడియేషన్ కారణంగానే ఇంత ప్రమాదం జరిగితే, దేశ రక్షణ, భద్రత కోసం ఉపయోగించే నేవి రాడార్ స్టేషన్ నుంచి వెళ్లే సిగ్నల్స్, దాని నుంచి వెలువడే రేడియేషన్ ఏ స్థాయిలో ఉంటుందో స్పష్టం అవుతోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాడార్ స్టేషన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నా ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరు.దీంతో దామగుండం అటవీ సమస్యలపై లోలోపల ఓ ఉద్యమమే మొదలు పెట్టారు.అది మెళ్లిగా హైదరాబాద్ మహా నగరానికి చేరింది. ఆదివారం రోజు ‘సేవ్ దామగుండం’ పేరుతో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరసన దీక్ష చేపట్టే స్థాయికి వెళ్లింది. సోషల్ మీడియా వేదికగా ఈ ఉద్యమం తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

హైదరాబాద్ నగరంపై ఎఫెక్ట్ :

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ అనేక రాష్ట్రాలు, దేశాల ప్రజలు నివసించడమే కాక, అనేక రకాల కంపెనీలతో పాటు ఐటీ లాంటి సంస్థలకు అనువైన ప్రదేశంగా నగరంపై ముద్ర ఉంది. అందుకే అనేక దేశాల వ్యాపారస్తులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు.నేవి రాడార్ ఏర్పాటుతో దామగుండానికి కేవలం 60 కి.మీ దూరంలో ఉన్న నగర ప్రజలపై సైతం రేడియేషన్ ప్రభావం పడనుందని ప్రకృతి నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా దేశ భద్రత కోసం పనిచేసే నేవి రాడార్ స్టేషన్ అంటే దాని చుట్టుపక్కల ప్రాంతంలో హై సెక్యూరిటీ అనేది సర్వసాధారణం. రాడార్ స్టేషన్ చుట్టుపక్కలకు ఎవ్వరూ వెళ్లాలన్నా రక్షణ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి అవుతుంది. అలాంటి పరిస్థితే వస్తే పర్యాటక కేంద్రంగా ఉన్న వికారాబాద్ అనంతగిరి చుట్టుపక్కల పర్యాటకం కలగానే మిగిలిపోనుందని జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు,వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, రాడార్ స్టేషన్‌పై శత్రు దేశాల నిఘా సైతం పెద్దగానే ఉంటుంది. దీంతో ఎప్పుడు ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ మహా నగరాన్ని సైతం శత్రు దేశాలు టార్గెట్ చేస్తాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు,ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలా ఉన్న హైదరాబాద్ నగరానికే మొదటి ప్రమాదం ఉంటుంది కాబట్టి, నేవి రాడార్ స్టేషన్‌ను దామగుండం అటవీ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని వారు కోరారు. లేదంటే ఈ ఉద్యమాన్ని మరో తెలంగాణ ఉద్యమాన్ని మించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్లి దామగుండం అడవిని కాపాడుకుంటామని జిల్లా ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.

Latest News

వకుళాభరణంతో కులసర్వేపై మాటా-మంతీ

రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్‌ సూచించింది. శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న...
- Advertisement -spot_img

More Articles Like This