Monday, September 23, 2024
spot_img

వకుళాభరణంతో కులసర్వేపై మాటా-మంతీ

Must Read
  • రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్‌ సూచించింది.
  • శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
  • అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న జీవో విడుదల చేసింది.
  • ముసాయిదా ప్రశ్నావళి కూడా రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం
  • ప్రభుత్వం వెంటనే కార్యాచరణను మొదలుపెట్టాలి
  • కుల సర్వే కోసం సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ,సమగ్రంగా పూర్తి చేయడం అవసరం
  • రాజ్యాంగ సవరణ ద్వారా బి.సి.లకు 42% ఇవ్వడం సాధ్యమవుతుంది.

నిబద్ధత కలిగిన బి.సి.ఉద్యమకారుడిగా,నాయకుడిగా,విషయ పరిజ్ఞానిగా,మంచి వక్తగా ఎదిగిన క్రమం పారదర్శకమైనది.డాక్టర్‌ వై.యస్‌.ఆర్‌. లాంటి దిగ్గజ రాజకీయ నాయకుడిని ఆకర్షించగలిగారు.ఈ పరిచయంతోనే రెండు పర్యాయాలు బి.సి.కమిషన్‌ సభ్యుడిగా నియమించబడ్డారు.అనూహ్యంగా,కరీంనగర్‌ జిల్లాలోని తన స్వస్థలం హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా,వై.ఎస్‌.ఆర్‌.ప్రత్యేక చొరవతో 2009 సాధారణ ఎన్నికలలో పోటీచేయగలిగారు.అలాగే 2010 ఉప ఎన్నికలలో కూడా ఆయననే కాంగ్రెస్‌ పార్టీ మరో మారు అభ్యర్థిగా నిలబెట్టింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక,తొలి బి.సి.కమిషన్‌లో సభ్యుడిగా,రెండవ బిసి.కమిషన్‌కు ఛైర్మన్‌గా కూడా నియామకం అయ్యారు.ఇలా క్రమంగా ఉన్నత దశలకు చేరిన వైనం మహోన్నతం.ఎంత ఎత్తుకు ఎదిగినా,ఒదిగి ఉండే నైజంతో కొనసాగుతున్నారు.సుదీర్ఘకాలంగా హక్కులు,ప్రయోజనాల నిమిత్తం విశేషంగా కృషి చేస్తూ బి.సి.వర్గాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు.విశేషంగా బి.సి.ల అంశాలపై ఏళ్ల తరబడిగా కృషి చేశారు.ఇటీవలేె బాధ్యతల నుండి విరమణ పొందిన,తెలంగాణ రాష్ట్ర రెండవ బిసి కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావుతో,రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న బి.సి.సర్వే,కులసర్వే,స్థానిక సంస్థలలో బి.సి.రిజర్వేషన్లు,ప్రధాన అంశాలపై వివరణాత్మకంగా సేకరించిన అంశాలను ఆయన మాటల్లోనే.

ప్రశ్న : ప్రస్తుతం రాష్ట్రంలో కులసర్వే (కులగణన) పై కొనసాగుతున్న భిన్నాభిప్రాయాలపై మీ సమాధానం ఏమిటి?

జవాబు :రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్‌ సూచించింది.అందుకు రేవంత్‌ ప్రభుత్వం అనుకూలంగా స్పందించింది.మంత్రిమండలిలో ఆమోదించింది.శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.అందుకు అనుగుణంగా ప్రభుత్వం జి.వో.ఎం.ఎస్‌.నెం. 26ను మార్చి 15,2024 తేదీన విడుదల చేయడం జరిగింది.ఇందుకు సంబంధించి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడానికి వీలుగా,ముసాయిదా ప్రశ్నావళి కూడా మేమే రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం.ఈ దిశగా ప్రభుత్వం వెంటనే కార్యాచరణను మొదలుపెట్టాలి.కాగా ఆరు నెలలుగా ఏ చర్యలూ లేని కారణంగా సామాజికవేత్తలు,మేధావులు,విషయ నిపుణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.బి.సి.సంఘాలు,ప్రజా సంఘాలు ఉద్యమ బాట పట్టాయి.

ప్రశ్న :ఇటీవల బి.సి.కమిషన్‌కు కొత్త పాలకమండలిని నియమిస్తూ,విడుదల చేసిన జి.వో.నెం.199లో కేవలం బి.సి.ల సర్వే చేసి,స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల శాతంను నిర్ణయించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.మీ అభిప్రాయం చెప్పండి.

జవాబు : నిజమే.జి.వో.నెం.199లో ప్రభుత్వం బిసిల సర్వే అనే పేర్కొంది.నేను ఇంతకు ముందే వివరించిన విధంగా మొత్తం కులసర్వే అనంతరమా? లేదా బిసి సర్వేతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళుతుందా?ఈ అంశంలో ప్రభుత్వం నుండి మరింత స్పష్టత రావాలి.ఏదేమైనప్పటికీ ఆదరాబాదరాగా పూర్తిచేయాలని అనుకుంటే,తిరిగి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.న్యాయ నిపుణులతో చర్చించి,సరైన సలహాలతో ముందుకు వెళ్లాలి.సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ,సమగ్రంగా పూర్తి చేయడం అవసరం.

ప్రశ్న : కామారెడ్డి బి.సి.డిక్లరేషన్‌లో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలలో బి.సి.లకు 42% రిజర్వేషన్‌లు కల్పించడం సాధ్యం అంటారా?

జవాబు: సాధ్యమే.కానీ ఇందుకు సంబంధించి డాక్టర్‌ కె.కృష్ణమూర్తి (2010),వికాస్‌ కిషన్‌రావు గవాలి (2021) కేసులలో సుప్రీంకోర్టు నిర్దిష్టంగా ట్రిపుల్‌ టెస్ట్‌ల పేరిట మార్గదర్శకాలను సూచించింది.ప్రత్యేక డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించాలి.ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సమాచారంను,గణాంకాలను సేకరించాలి.రాజకీయ వెనుకబాటుతనంను నిర్దిష్టంగా గుర్తించాలి.క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామ పంచాయితీ నేపథ్యంగా,జనాభా ప్రకారం సమగ్ర అధ్యయనం చేయాలి.ఎట్టి పరిస్థితులలో కూడా ఎస్సీ,ఎస్టీ,బీసీ,వర్గాలకు కల్పించే మొత్తం రిజర్వేషన్‌లు 50% దాటకూడదు.వీటిని దేశమంతా అన్ని రాష్ట్రాలు తప్పకుండా పాటించాలని సుప్రీం సూచించింది.ఈ ట్రిపుల్‌ టెస్ట్‌ల అమలును చాలా సీరియస్‌గా పాటించాల్సి ఉంటుంది.అయితే ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్ధానంను నిలబెట్టుకోవాలి.అలాంటప్పుడు అందుకు అనుగుణంగా రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి.గవర్నర్‌తో ఆమోదం పొందాలి.అలా రూపొందించిన రాష్ట్ర చట్టంను కేంద్రంకు నివేదించాలి.పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం పొందాలి.రాష్ట్రపతి సంతకంతో చట్టం కావాలి.అనంతరం రాజ్యాంగ సవరణ ద్వారా బిసి.లకు 42% ఇవ్వడం సాధ్యమవుతుంది.

ప్రశ్న: మీ సారథ్యంలోని బి.సి.కమిషన్‌ వివిధ రాష్ట్రాలలో పర్యటించి వచ్చింది కదా? అందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏమైనా నివేదికలు అందించారా?

జవాబు: అవును.మధ్యప్రదేశ్‌,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాలలో పర్యటించి రావడం జరిగింది.అందుకు సంబంధించిన పూర్తి వివరాలను పలు అధ్యయన పత్రాల రూపంలో ప్రభుత్వానికి అందించాం.ఎప్పటికప్పుడు స్టేటస్‌ రిపోర్టులను కూడా నివేదించడం జరిగింది.మా నుండి కొత్త కమిషన్‌ పాలకమండలి,రాష్ట్ర ప్రభుత్వం కోరితే సంపూర్ణ సహకారాన్ని అందించడానికి సిద్ధం.

ప్రశ్న: బీహార్‌ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా,500 కోట్ల రూ.లను వెచ్చించి చేపట్టిన సమగ్ర కులసర్వేతో వచ్చిన వివరాల ఆధారంగా ఎస్‌.సి.,ఎస్‌.టి.,బి.సి.లకు 65% విద్యా,ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్‌లను కల్పించారు.అలా అమలులోకి తెచ్చిన చట్టంను పాట్నా హైకోర్టు కొట్టివేసింది కదా!మరి మన రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయంటారు?

జవాబు:ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది.హైకోర్టు కొట్టివేసినంత మాత్రాన పూర్తిగా నిష్ఫలం అని భావించరాదు.సుప్రీంకోర్టులో ప్రభుత్వం వాదనలు పూర్తయ్యాక,సానుకూలమైన నిర్ణయం వస్తుందని భావిస్తున్నాను. మన రాష్ట్రంలో కూడా కులసర్వే చేపట్టడానికన్నా ముందే బీహార్‌కు సంబంధించి హైకోర్టు ఆయా సందర్భాలలో ఇచ్చిన తీర్పులను సమగ్రంగా అధ్యయనం చేసి ముందుకెళ్లాల్సి ఉంటుంది.ఈ లోపు సుప్రీంతీర్పు వెలువడితే మరింతగా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Latest News

వికారాబాద్ అడవి విధ్వంసాన్ని ఆపాలి

( డిమాండ్ చేసిన పర్యావరణ,అటవీ ప్రేమికులు ) -దామగుండంలో నేవి రాడార్ స్టేషన్..-12 లక్షల ఔషధ మొక్కలు హాంఫట్..-సేవ్ దామగుండం ఫారెస్ట్ పిలుపునిచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ తులసి...
- Advertisement -spot_img

More Articles Like This