- ఇక్కడ చదువు చాలా కాస్లీ గురూ.. రూ.లక్షల్లో ఫీజులు వసూల్
- ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్
- సర్కార్ ఫీజు స్ట్రక్చర్ కేవలం రూ.1760
- ఫస్ట్ ఇయర్ కు లక్షన్నర.. సెకండ్ ఇయర్ కు లక్షా అరవై పక్కా
- ఇంటర్మీడియట్ చదివించాలంటే రూ.4లక్షలు ఉండాల్సిందే
- తల్లిదండ్రుల గుండెలు గుబేల్
- ఓ వైపు యాజమాన్యం వేధింపులు, మరో వైపు ఒత్తిడి ఎక్కువై పిల్లల సూసైడ్
- మీన మేషాలు లెక్కిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు
‘చదువు సారెడు బలుపాలు దోసెడు’ అన్నట్టే ఉంది నేటి చదువులు. ప్రస్తుతం పిల్లలు చదువు’కుంటున్నట్టు లేదు చదువు’కొంటున్నట్టు ఉన్నది. కార్పోరేట్ విద్య వచ్చినంక అంతా వ్యాపారమయం అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పేదోడి ఇంట్లో చదువు భారంగా మారింది. ఎల్.కే.జీ మొదలు పీ.జీ వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నరు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫీజులు చూస్తే తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుడుతోంది. శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ రూ. లక్షన్నర ఉండగా, సెకండ్ ఇయర్ కు లక్షా అరవై వేల రూపాయలు వసూలు చేస్తుంది. రెండు సంవత్సరాల చదువుకు కనీసం రూ.4లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కార్పోరేట్ వ్యవస్థ వచ్చినంక పెద్ద కాలేజీలో పేదోడి బిడ్డ చదవాలంటే చాలా కష్టతరంగా మారింది.
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ శ్రీచైతన్య బ్రాంచ్ యాజమాన్యం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌కు రూ. 1.45 వేలు వసూలు చేస్తుంది.. ఈ విషయం ఇంటర్ మీడియెట్ బోర్డ్ అధికారులకు తెలిసిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం శోచనీయం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ రూ.1760లు ఉండాలి. కానీ ప్రైవేటు కాలేజీలు కనీసం ఎగ్జామ్ ఫీజే వెయ్యి నుంచి రూ.1500లు వసూలు చేస్తుంది. ఇదీ అమలుకు సాధ్యం కాదన్న విషయం తెలిసి కూడా.. గవర్నమెంట్ లెక్కల్లో చూపుతున్నది. కార్పోరేట్ కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. హాస్టల్స్ లో ఏసీ వంటి సకల సౌకర్యాలు చూపుతూ లక్షల్లో వసూలు చేస్తుంది. దీనికి అదనంగా పరీక్ష ఫీజు, బుక్స్, మెటీరియల్ కు ఎక్స్ ట్రాగా తీసుకుంటున్న శ్రీ చైతన్య యాజమాన్యం పేరెంట్స్ రక్తాన్ని జలగలాగా పీడిస్తుంది.
ఇంటర్మీడియట్ చదువు కోసం అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కాలేజీలపై డీఐఈవో చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. జిల్లా విద్యాశాఖ అధికారులకు మాముళ్లు వస్తున్నందునే ఆయా కాలేజీలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లోపాయికారి ఒప్పందం వల్లే ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఫీజుల నియంత్రణ గురించి మాట్లాడే ప్రతిసారి ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారించడం గమనార్హం. లక్షల్లో ఫీజులు వసూలు చేసే కార్పోరేట్ కాలేజీలపై దృష్టిపెట్టకపోవడం వెనుక ఆంతర్యామేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు భేఖాతరు చేసే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీలా ఉంటే లక్షల్లో ఖర్చు చేసి ఇంటర్ చదివిస్తున్న పేరెంట్స్ కు టెన్షన్ గా ఉండాల్సిన పరిస్థితి. పలానా కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ అంటూ టీవీ, పేపర్లలో రోజుకొక వార్త చూస్తూ భయాందోళనకు గురవుతున్నారు. ఓ వైపు కళాశాల యాజమాన్యం వేధింపులు మరోవైపు చదువు రావడం లేదనే ఒత్తిడితో విద్యార్థులు బలవన్మారణానికి పాల్పడుతున్నారు. కారణమేదైనా చేతికొచ్చిన కొడుకు, కూతురు కళ్ల ముందే తనువు చాలిస్తే కన్నవారి పేగు తట్టుకోలేక పోతుంది. తమ బిడ్డ ఉన్నత చదువులు చదవాలనే కోరికతో లక్షలు పెట్టి చదివిస్తుంటే మధ్యలోనే తొందరపాటు నిర్ణయం తీసుకుంటుండంతో వేరే పిల్లల పేరెంట్స్ సైతం కార్పోరేట్ కాలేజీలో వేసేందుకు భయపడుతున్నారు.
ఇంటర్ చదివే పిల్లలకు ఒక టార్చర్ అయితే బిడ్డలను చదివించే పేరెంట్స్ పైసలు భారం అవుతున్నాయి. ఇకనైన ప్రభుత్వం స్పందించి కార్పోరేట్ కాలేజీలపై ఆగడాలు అరికట్టాలి. ఇంత జరుగుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్న ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు.