- మున్సిపాలిటీలో యధేచ్చగా వెలుస్తున్న వెంచర్లు
- సర్వే నెం. 75లో అనుమతులు లేకుండా 17 విల్లాల నిర్మాణం
- సర్కార్ ఆదాయానికి భారీగా గండి
- గత ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని యంత్రాంగం
- కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కట్టడాలు కంటిన్యూ
- అక్రమ నిర్మాణాలకు రైట్ రైట్ చెబుతున్న మున్సిపల్, రెవెన్యూ అధికారులు
- అమ్యామ్యాలకు అమ్ముడుపోతున్న ఆఫీసర్లు..?
- జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్
తెలంగాణలో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. ఓ పక్క హైడ్రా తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్ అనుమతులు లేని, అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నా అవి చూసైనా సిగ్గు రావడం లేదు కొందరికీ. అందుకు సహకరించిన వారిపై కూడా హైడ్రా కేసులు నమోదు చేస్తున్న అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. ‘ఆశగలమ్మ దోషమెరుగదు… పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు’ అన్నట్టు ఉంది. ఇప్పటికే ప్రభుత్వంగా బహుళ అంతస్థుల భవనాలను నేలమట్టం చేసింది. బిల్డర్లకు సైతం కూసింతైన భయం లేకుండా పోయింది. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో అక్రమ వెంచర్లు, నిర్మాణాలు యధేచ్చగా కొనసాగుతున్నాయి. తద్వారా మున్సిపాలిటీ, ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలను గండి కొడుతున్నారు అక్రమార్కులు. గత ప్రభుత్వ హయాంలో కోకొల్లలుగా సాగిన అక్రమాలు నేటికి కొనసాగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మున్సిపల్, రెవెన్యూ అధికారులు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై వాళ్ల వద్ద నుంచి లంచాలు తీసుకొని పనిచేసి పెడుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్థులై ఉండి కూడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తమ జేబుల్లోకి మలుచుకుంటున్నారు. నెల నెలా లక్షలు లక్షలు జీతాలు తీసుకునే కొందరు అధికారులు అక్రమార్కుల వద్ద తీసుకునే మాముళ్ల మత్తులో జోగుతున్నారు.
వివరాల్లోకి వెళితే… సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో అక్రమంగా విల్లాలు వెలుస్తున్నాయి. బొల్లారం మున్సిపాలిటీ నుండి అనుమతులు పొందకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికోడుతున్నారు. ఇంత జరుగుతున్నది మన ప్రభుత్వ ఆఫీసర్ల ప్రొద్బలంతోనే అనేది నగ్నసత్యం. స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్ ఇద్దరూ కలిసి బడా బిల్డర్లకు పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. బొల్లారంలోని సర్వేనెంబర్ 75లో.. 17 విల్లాలను మున్సిపాల్టీ నుండి అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొందరు బిల్డర్లు అక్రమంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే వీటికి అధికారులు ఇంటి నెంబర్లు కేటాయించగా, అక్రమ మార్గంలో ఇంటి నంబర్లు ఇవ్వడం జరిగిందని దీనిపై ఓ సామాజిక కార్యకర్త, స్థానికుల ఫిర్యాదులు చేయడంతో తప్పని పరిస్థితుల్లో బొల్లారం మున్సిపల్ కమిషనర్ ఇంటి నంబర్లను రద్దు చేశారు. కానీ అక్రమ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మున్సిపల్ ఉద్యోగుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ తర్వాత కూడా బడా బిల్డర్లకు మున్సిపల్ కమిషనర్, స్థానిక కౌన్సిలర్ వీరికి పూర్తిగా సహకరిస్తూ వచ్చారు. తద్వారా మున్సిపల్ నుండి ఎటువంటి అనుమతులు లేకపోయినా నిర్మాణాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కొందరు బొల్లారం మున్సిపల్ పరిధిలో అక్రమ విల్లాలు కడుతున్నారని కంప్లైంట్ చేయడంతో జిల్లా కలెక్టర్ వారికి 28-08-2023వ తేదీన నోటీసు జారీ చేయడం జరిగింది. సర్వే నెం. 75లో ఎలాంటి అనుమతులు లేకుండా 17విల్లాలు నిర్మాణం చేపట్టడం అక్రమం అని.. వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశించారు. అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఉన్న సమయంలో అధికారుల సఫోర్ట్ తో పనులు కొనసాగించారు. గతేడాది డిసెంబర్ లో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన అక్రమార్కులు ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు. ఈ పదినెలల్లో 17విల్లాలు కూడా దాదాపు 90శాతం వరకు పనులు పూర్తి చేశారు. బడా బిల్డర్లకు మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ పూర్తిగా సహకరించారు. వీరు అమ్యామ్యాలకు అమ్ముడుపోయి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఓ వైపు హైడ్రాకు ఎందరో భయపడుతున్నా.. బొల్లారంలోని మున్సిపల్, రెవెన్యూ అధికారులకు మాత్రం చలనం లేకుండా పోయింది.
ఇకనైన ప్రభుత్వ పెద్దలు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి బొల్లారం మున్సిపల్ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ 17 విల్లాలు నిర్మిస్తున్న బడా బిల్డర్లు, వారికి పూర్తిగా సహకరిస్తున్న కమిషనర్, రెవెన్యూ సిబ్బందిపై వెంటనే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బొల్లారం మున్సిపల్ ఆఫీస్ లో జరుగుతున్న అవకతవకలపై (అక్రమాలు) మరో కథనంలో మీకు వివరిస్తాం… మా అక్షరం అవినీతిపై అస్త్రం..