Friday, September 20, 2024
spot_img

దళితబంధు పథకంలో 30 కోట్ల జీఎస్టీ ఎగవేత.!

Must Read
  • సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి ‘దళితబంధు’ పైలట్ ప్రాజెక్టులో రూ.30 కోట్ల జీఎస్టి సొమ్మును దిగమింగిన ఏజెన్సీలు..
  • ఆధారాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు రూపంలో అందజేసిన ‘దళిత మానవ హక్కుల వేదిక’
  • స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్.. జీఎస్టి వసూళ్లపై కసరత్తు.. కమిటీ ఏర్పాటు
  • ప్రభుత్వ పన్నుల ఎగవేత తీవ్రమైన నేరం: కలెక్టర్ వెంకట్ రావు

‘దళిత బంధు’ పథకంలో దళిత కుటుంబాలు ఆశించిన లబ్ధి కన్నా, మధ్య దళారీలే దిగమింగింది ఎక్కువ. సగటు ఒక దళిత బంధు లబ్ధిదారుడికి ప్రభుత్వం 9 లక్షల 90 వేల రూపాయలు నూరు శాతం సబ్సిడీ రుణం మంజూరి చేసింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద గత ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ మండలంలో 2,223 మందిని అర్హులైన దళితబంధు లబ్ధిదారులుగా గుర్తించి, ఇందుకోసం సుమారు 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒక యూనిట్ కు రూ. 9 లక్షల 90 వేలు కాగా, మిగిలిన 10 వేల రూపాయలు ఆయా లబ్ధిదారుడి రక్షణ నిధి క్రింద సదరు లబ్ధిదారుడి ఖాతాల్లో జమ చేశారు.

గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కానీ అనుకున్నంతగా ఈ పథకాన్ని సంపూర్ణంగా సక్సెస్ చేయడంలో ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ పథకమునకు లబ్ధిదారుల ఎంపిక విధానం సంబంధిత ఎమ్మెల్యేలకు అప్పగించడం, ఒక విధి విధానం అంటూ లేకుండా అమలు చేయడంతో పథకం యొక్క లక్ష్యం నీరుగారిపోయింది. రాష్ట్రంలో నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అందులో తిరుమలగిరి మండలం ఒకటి. మిగిలిన మూడు మండలాల్లో ఎంతోకొంత లబ్ధిదారులకు న్యాయం జరిగి ఉండవచ్చు. కానీ తిరుమలగిరి మండలంలో అమలు జరిగిన ‘దళిత బంధు’ పథకంలో తీవ్రమైన దోపిడీ జరిగింది.

జీఎస్టీ చట్టాన్ని ధిక్కరిస్తూ.. ఏజెన్సీల ఇష్టారాజ్యం…
జీఎస్టీ చట్టం – 2017 ను ధిక్కరించి, నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఏజెన్సీలు కొన్ని చట్ట వ్యతిరేక చర్యలకు తెగబడ్డాయి. సగటు దళిత బంధు లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ.9 లక్షల 90 వేలు ఆయా యూనిట్ల కొరకు కొటేషన్లు ఇచ్చిన ఏజెన్సీలకు నిధులు మంజూరు చేసింది. సంబంధిత ఏజెన్సీలు జీఎస్టి నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఒక్కో లబ్ధిదారుడి నుండి 18 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేశారు. ఇందులో సెంట్రల్ జీఎస్టి 9 శాతం కాగా, స్టేట్ జీఎస్టి 9 శాతం అన్నట్లు. కనీసం జీఎస్టీ అనే పదానికి అర్థం తెలియని దద్దమ్మలు సైతం ఈ ప్రాంతంలో రాత్రికి రాత్రే నకిలీ జీఎస్టి లైసెన్సులు సృష్టించారు.

మరికొంత లోతుగా పరిశీలిస్తే.. కొటేషన్లు, ట్యాక్స్ ఇన్వాయిసులు ఇవ్వకూడని/జారిచేయడానికి అర్హత లేని కాంపోజిషన్ లైసెన్సులు తెచ్చుకొని అమాయక దళిత లబ్ధిదారుల నుండి కోట్లాది రూపాయలు దండుకున్నారు.(ఉదాహరణకు శ్రీ శ్రీనివాస ఏజెన్సీస్ (అదిలాబాద్), అవంతి ట్రేడర్స్, సందీప్ కిరాణం అండ్ జనరల్ స్టోర్స్, సంధ్యా లేడీస్ కార్నర్(తిరుమలగిరి), ఆక్స్ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాషన్స్(చిక్కడపల్లి), శ్రీకృష్ణ బ్యాంగిల్ స్టోర్స్ (జనగామ), శివ స్టీల్ ఫర్నిచర్ (తిరుమలగిరి) లాంటి ఏజెన్సీలు అన్నీ కూడా కేవలం కాంపోజిషన్ లైసెన్సును పొంది, జీఎస్టి చట్టానికి వ్యతిరేకంగా కొటేషన్లు ఇచ్చి, ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా కోట్లాది రూపాయలు దోచుకున్నారు.

ఒక్కో లబ్ధిదారుడి రూ. 9,90,000 నుండి 18 శాతం జీఎస్టీ పేరుతో రూ.1,78,200 అధికారికంగా కట్ చేసుకోగా, అప్పటి ఎమ్మెల్యే పేరు చెప్పి రూ. 50 వేలు, వార్డు కౌన్సిలర్ పేరుతో రూ.10 వేలు, ఎమ్మెల్యే పి.ఏ, అధికారులకు, సదరు ఏజెన్సీ కమిషన్ ఇలా అన్నీ కలుపుకొని అదనంగా మరో రూ.1,50,000 ఆయా ఏజెన్సీలు లబ్ధిదారుల నుండి ముక్కు పిండి వసూలు చేసుకున్నాయి. ఈ విధంగా ఒక్కో లబ్ధిదారుడి 3 నుండి 4 లక్షల రూపాయల వరకు అక్రమంగా దోచుకు తిన్నారు. ఇది తిరుమలగిరిలో జగమెరిగిన సత్యం.

ఏజెన్సీల అక్రమాలకు చెందిన ఆధారాలను కలెక్టర్ కు ఫిర్యాదు రూపంలో అందజేసిన ‘దళిత మానవ హక్కుల వేదిక’
నాయకులు, అధికారులు, వార్డు కౌన్సిలర్ల పేర్లు చెప్పి అక్రమంగా లబ్ధిదారుల నుండి వసూలు చేసిన చేసిన సొమ్ము విషయం పక్కకు పెడితే, ఇక్కడ 65-70 ఏజెన్సీలు అధికారికంగా 18 శాతం జీఎస్టీ పేరున ఒక్కో లబ్ధిదారుడు నుండి వసూలు చేసిన రూ.1,78,200 ఆయా ఏజెన్సీలు ఇచ్చిన కొటేషన్ల ఆధారంగా లెక్కలు కడితే, సుమారు 30 కోట్ల జీఎస్టీ పన్ను ప్రభుత్వానికి చెల్లించకుండా, ఎగవేతకు పాల్పడినట్లు ఆధారాలతో కూడిన ఒక నివేదికను “దళిత్ హ్యూమన్ రైట్స్ ఫోరమ్”(దళిత మానవ హక్కుల వేదిక) ఈనెల 25వ తేదీన సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రావు కు ఫిర్యాదు రూపంలో అందజేసినట్లు తెలుస్తోంది. సదరు ఫిర్యాదును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఈ విషయమై తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. సంబంధిత ఫిర్యాదును ఫోరం రాష్ట్ర సెక్రటరీ పత్తేపురం ప్రవీణ్ కలెక్టర్ కు అందజేశారు.

పన్నుల ఎగవేత తీవ్రమైన నేరం: కలెక్టర్ వెంకట్ రావు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు గండి కొడుతూ పన్నుల ఎగవేత వలన భారతదేశానికి ప్రతి ఏడాది 75 వేల కోట్ల రూపాయల పైగా నష్టం కలుగుతోందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రావు అన్నారు. “ఆదాబ్” అడిగిన విషయమై వివరణ ఇస్తూ, తిరుమలగిరి దళిత బంధు ప్రాజెక్టులో జరిగిన జీఎస్టీ ఎగవేతపై దళిత్ హ్యూమన్ రైట్స్ ఫోరం వారి నుండి భారీ ఫిర్యాదు వచ్చిందన్నారు. సంబంధిత ఫిర్యాదు మేరకు జీఎస్టీ పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక జిల్లా కమిటీ ఒకటి వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీకి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రియాంక చెక్క సారథ్యం వహిస్తారని, ఇందులో జిల్లా పరిషత్ సీఈఓ వి.వి అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్ ఇన్ ఛార్జ్ ఈడి కిషన్, జీఎస్టి అసిస్టెంట్ కమిషనర్ యాదాద్రి ఇందులో ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. జీఎస్టీ ఎగవేత దారుల నుండి జరిమానాతో సహా పన్నులు వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This