- జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
- టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి
- 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ,
- అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి
- ఒరిజినల్ ఐడీలతో పరీక్ష కేంద్రంకు రావాలి
గ్రూపు 03 పరీక్షలకు నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం, రీజినల్ కోఆర్డినేటర్ మధుసూదన్ శర్మ, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, స్పెషల్ అబ్జర్వర్ నాగార్జున రెడ్డిలతో కలిసి గ్రూప్-03 పరీక్ష సన్నద్ధతపై డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, చీఫ్ సూపరిండెంట్స్, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ, గ్రూప్ 03 పరీక్ష నేపథ్యంలో
టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచన తూ.చ.తప్పకుండా పాటించాలని తెలిపారు. జిల్లాలో పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం పరీక్ష రాసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,478 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, వీరి కోసం 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ నెల 17న ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) పరీక్ష ఉంటుందని వెల్లడించారు. పరీక్ష కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారని అన్నారు. సాయంత్రం 3.00 గంటల నుండి 5.30 గంటల వరకు పేపర్ -2 హిస్టరీ, పాలిటి అండ్ సొసైటీ పరీక్ష ఉంటుందని, పరీక్ష కేంద్రం గేట్లు మధ్యాహ్నం 2.30 గంటలకు మూసివేస్తారని స్పష్టం చేశారు. నవంబర్ 18న ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం12.30గంటల వరకు పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష ఉంటుందని, పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రం గేట్లు మూసినా తర్వాత ఎవరిని లోపలికి అనుమతించబడదని పేర్కొన్నారు.
జిల్లాలో ఉన్న పరీక్షా కేంద్రాలను, ప్రశ్నా పత్రాలను పోలీసుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూం నుండి టీజీపీఎస్సీ నిబంధనలు పాటిస్తూ తరలించాలని అధికారులను ఆదేశించారు. టీజీపీఎస్సీ గైడ్ లైన్స్ ను ప్రతి ఒక్కరూ చదివి, నిబంధనలు పాటించాలని సూచించారు. డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షా కేంద్రాలను ముందస్తుగా సందర్శించి త్రాగునీటి, విద్యుత్, సిట్టింగ్ , సి.సి. కెమెరాల ఏర్పాటు, ఇతర మౌళిక వసతులను సరి చూసుకోవాలని తెలిపారు. పరీక్ష రోజు పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఆశ, ఒక ఏ.ఎన్.ఎం.లను ఉంచాలని, పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు వెళ్ళే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని ఆదేశించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు. గ్రూప్ 03 పరీక్ష నిర్వహణ అత్యంత పటిష్టంగా జరగాలని, చిన్న తప్పుకు కూడా ఆస్కారం ఉండవద్దని అన్నారు. అభ్యర్థులను చెక్ చేసేందుకు పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా సిబ్బంది ఉండాలని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ తో పాటు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకొని రావాలని సూచించారు. అంతకుముందు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు, రూట్ అధికారులకు పరీక్ష రోజు చేయవలసిన విధి, విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివరించారు. పరీక్షా కేంద్రాల్లో సీటింగ్ , రూమ్ వారీగా అభ్యర్థుల కేటాయింపు, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర అంశాలు పకడ్బందీగా జరగాలని తెలిపారు.