Thursday, April 17, 2025
spot_img

చీపుర్లు కూడా వదల్లేదు..!

Must Read
  • తూ.. గివేం బతుకులు రా.. జీహెచ్ఎంసీలో సరికొత్త గోల్మాల్
  • కార్మికులకు అందనీ జాడు కట్టలు, సున్నం, బ్లీచింగ్ పౌడర్, బ్లాక్ కవర్స్, గంపలు, పారలు
  • చీపుర్ల బిల్లులు ఎత్తుకుపోతున్న ఏజెన్సీలు
  • ప్రతి మూడు నెలలకు ఓసారి సప్లై చేయాల్సిన కాంట్రాక్ట్ ఏజెన్సీలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లు, 30 సర్కిల్స్
  • దాదాపు సర్కిల్స్ అన్నింట్లోనూ ఇదే పరిస్థితి
  • గత కొన్నేండ్లు గుట్టుగా సాగుతున్న యవ్వారం
  • సొంత డబ్బులతో చీపురు కట్టలు తెచ్చుకోవాలంటూ హుకూం
  • జీహెచ్ఎంసీ మెటిరీయల్ కాంట్రాక్ట్ ఏజెన్సీల బరితెగింపు
  • ఏజెన్సీలతో అధికారుల లోపాయికారి ఒప్పందం
  • బిల్లుల చెల్లింపు తర్వాత నీకింత, నాకింత అంటూ వాటాలు
  • చాలిచాలనీ జీతాలతో బతుకులు వెళ్లదీస్తున్న పారిశుధ్య కార్మికులు
  • అనారోగ్యాల పాలవుతూ.. చస్తూ, బతుకుతూ పనిచేస్తున్న వైనం

“తిమింగలానికి ఏ చేప అయితే ఏమిటి తినడానికి” అన్నట్టు ఉంది జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు, పారిశుద్ధ్య మెటిరీయల్ కాంట్రాక్ట్ ఏజెన్సీల పరిస్థితి. సుమారు రూ.లక్ష జీతాలు తీసుకునేవారు ఉద్యోగులు అయితే.. రూ.లక్షలకు లక్షలు బిల్లులు తీసుకునే కాంట్రాక్టర్లు. వీళ్లంతా బాగానే సంపాదిస్తారు.. ఏసీల్లో బతుకుతుంటారు. మరీ నిద్ర మబ్బులో హైదరాబాద్ లో రోడ్లు ఊడ్చివేసి, చెత్త కుండీలు, మురికి కాల్వలు, డ్రైన్ ల దగ్గర ఉండే పాడుంతా ఎత్తిపోసే పారిశుద్ధ్య కార్మికులకు వచ్చేది రూ.పది, పన్నెండు వేలు. ఇళ్లు, ఆఫీసులు, హోటళ్లు, హాస్పిటల్స్, కంపెనీలలో వాడిపడేసి చెత్త చెదారం.. రోజూ తీసుకెళ్లే వీరి బతుకులు మారడం లేదు. “అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు” అన్నారు పెద్దలు. పాపం జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల దుస్థితి ఇలానే ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో పనిచేసే వీళ్ల ఘోడు చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడి తోకకన్నా పెద్దగానే ఉంటది. మురికి కూపాలు, దుర్గంధంలో మెదిలి రోగాలబారిన పడుతూ అసువులు బాస్తున్న అభాగ్యులు. పైగా జీహెచ్ఎంసీ మెటిరీయల్ కాంట్రాక్ట్ ఏజెన్సీల దబాయింపు, జీహెచ్ఎంసీ, శానిటైజేషన్ అధికారుల బెదిరింపులతో కార్మికుల బతుకులు ఆగమాగం…

చీపురు కట్టల బిల్లులు వదలని ఏజెన్సీలు :
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ఆరు జోన్లలో మొత్తం 30 సర్కిల్స్ ఉన్నాయి. ప్రతి రోజు హైదరాబాద్ లో రోడ్డులు, వీధులన్నీ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేయాలి. కార్మికులకు ఏ సర్కిల్ లో ఆ పారిశుద్ధ్య మెటీరియల్ కాంట్రాక్ట్ ఏజెన్సీ వారికి కావాల్సిన వస్తువులన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తెల్లజాడు కట్టలు, సున్నం పౌడర్, బ్లీచింగ్ పౌడర్, బ్లాక్ కవర్స్, గంపలు, పారలు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు సప్లై చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతి కార్మికునికి మూడు నెలలకు ఒకసారి 45 జాడు కట్టలు, వివిధ పనిముట్లు అందించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య మెటీరియల్ సఫ్లై చేసే కాంట్రాక్ట్ ఏజెన్సీలు స్కామ్ కు పాల్పడుతున్నాయి. అంటుకోను ఆముదం లేదుకాని, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఉన్నది జీహెచ్ఎంసీ(GHMC)లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి. పారిశుద్ధ్య పనిచేసే కార్మికులు జాడు కట్టెలు, చీపుర్లు, తట్ట, పార ఇవన్నీ మీరే కొనుకొచ్చువాలి అంటూ హుకూం జారీ చేస్తున్నారు. ఆరు నెలలకు, సంవత్సరానికి కనీసం ఆరు జాడు కట్టలు కూడా ఇవ్వడం లేదు. దాదాపు అన్ని సర్కిల్స్ లో ఇదే తతాంగం కొన్నేండ్లు గుట్టుగా సాగుతుంది అంటే నమ్మశక్యం కాదు. పారిశుద్ధ్య కార్మికులు వారికి కావాల్సిన పనిముట్లు ఇంటి వద్ద నుంచే తెచ్చుకోవాలంటూ ఆర్డర్ చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ అసలు సప్లై లేదు అయినా బిల్లు మాత్రం యథావిధిగా పొందుతున్నారు. పారలు కానీ రేకులు కానీ అసలు సప్లై చేయకున్నా పూర్తి స్థయిలో బిల్లులు తీసుకుంటున్నారు. సున్నం కూడా వారికి కేటాయించిన టెండర్ ప్రకారం సప్లై కాకుండా నామమాత్రం సప్లై చేస్తున్నారు. కానీ ఏజెన్సీలు మాత్రం గవర్నమెంట్ వద్ద బిల్లులు దొబ్బి తింటున్నాయి. అయినా జీహెచ్ఎంసీ, శానిటరీ అధికారులు నోరు మెదపకపోవడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ పారిశుద్ధ్య మెటీరియల్ కాంట్రాక్ట్ ను జోనల్ కార్యాలయంలోనే టెండర్లు పిలిచి అధికారులే కేటాయిస్తారు.

అప్పుడప్పుడే సున్నం, బ్లీచింగ్ పౌడర్:
రాజకీయ నాయకులు, పండగలకే వీధులు, రోడ్ల వెంబడి సున్నం, బ్లీచింగ్ పౌడర్ చల్లి మమా అనిపిస్తున్నారు. ఇక నెలంతా కనీసం చూద్దామన్న కానరాదు. ఎమ్మెల్యే, మంత్రి ఎవరన్న ప్రముఖులు వస్తున్నారంటే జీహెచ్ఎంసీ అధికారులు హడావుడి చేసి రోడ్ల వెంట కాస్త ఎక్కువగా శుభ్రం చేసి సున్నం, బ్లీచింగ్ వేయడం జరుగుతుంది. రంజాన్, బక్రీద్, మొహరం, బోనాలు, దీపావళి, దసరా మొదలగు పండుగలకు వ్యర్ధాలను తొలగించడానికి బ్లాక్ కవర్స్ వాడాలి కానీ నామమాత్రంగా కవర్స్ సప్లై చేసి ఏడాదంతా, పూర్తిస్థాయిలో కవర్ సప్లై చేసినట్లు బిల్లులు తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రతి సర్కిల్ లో ఈ బిల్లులు కనీసం ప్రతి నెల 3 నుండి 5 లక్షల వరకు కాంట్రాక్ట్ ఏజెన్సీలు బిల్లులు పొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏ మాత్రం మెటీరియల్ సప్లై చేయకుండా కాంట్రాక్ట్ ఏజెన్సీలు పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేస్తున్నాయి. సుమారుగా 30 సర్కిల్స్ కు కలిపి సుమారుగా కోటి రూపాయలు ఏజెన్సీలు బిల్లులు పొందుతున్నాయి. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులకు కనపడకపోవడం విడ్డూరంగా ఉంది.

కాంట్రాక్ట్ ఏజెన్సీలతో కుమ్మక్కు :
జీహెచ్ఎంసీ(GHMC)
పరిధిలోని ఆరు జోన్లు, 30 సర్కిల్స్ లో పారిశుద్ధ్య కార్మికులు సొంత డబ్బులతో చీపుర్లు, ఇతర పనిముట్లు కొని తెచ్చుకుంటుంటే ఎవరికి పట్టడం లేదు. అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, సానిటరీ సూపర్వైజర్, డిప్యూటీ ఇంజనీర్లు సప్లై ఏజెన్సీల వారితో కుమ్మకైనట్టు అనుమానాలు రాకమానవు. జీహెచ్ఎంసీ సొమ్మును స్వాహా చేస్తున్నారని బహిరంగ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంతోష్ నగర్ సర్కిల్, మలక్ పేట్ సర్కిల్ లో భారీ ఎత్తున ఈ వ్యవహారం కొనసాగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, ఏజెన్సీలకే సహకరిస్తున్నారు. అసలే చాలీచాలని జీతాలతో కార్మికులు బతుకులు వెళ్లదీస్తుంటే వారి సొంత డబ్బుతోని చీపుర్లు, తట్ట, పార, సున్నం వంటి వస్తువులు కొనుక్కొని తెచ్చే పరిస్థితి లేదు. ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ చీపుర్ల బిల్లుల స్కామ్ పై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, కమిషనర్ చొరవ తీసుకోవాలి. ఈ యవ్వారంపై జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య మెటీరియల్ కాంట్రాక్ట్ ఏజెన్సీలపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు 1278 నామినేషన్లు

వ్యక్తిగత క్యాటగిరిలో 1172 నామినేషన్స్‌ చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 నామినేషన్స్‌ ఈ నెల 21 నుండి స్క్రీనింగ్‌ చేయనున్న జ్యూరీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS