ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేందప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గానూ, మంగళవారం తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7వ రౌండ్ ముగిసే సరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా, ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. దీంతో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటిని విజేతగా ప్రకటించారు. ఇక తొమ్మిదో రౌండ్ పూర్తయ్యే సరికి ఆలపాటికి 1,45,057 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించారు. ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజార్టీ దక్కింది. చెల్లుబాటు అయిన ఓట్లలో 60 శాతం పైగా ఓట్లను ఆలపాటి సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ తరఫున పోటీచేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. పోటాపోటీగా సాగిన ఎన్నికలో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మీద ఆయన గెలుపొందారు. ఏయూలో జరిగిన ఓట్ల లెక్కింపు పక్రియ చివరివరకు ఉత్కంఠగా సాగింది. ఈ ఎన్నికల్లో 10 మంది బరిలో ఉన్నా.. పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసులునాయుడు, పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి, ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ మధ్యే పోటీ నెలకొంది. నువ్వానేనా అన్నట్లు పోటీ సాగగా ఆఖరుకు రఘువర్మను ఎలిమినేట్ చేశారు. మొత్తం పోలైన ఓట్లు 20,791 అయితే చెల్లిన ఓట్లు 20,135. ఇందులో 10,068 ఓట్లతో మేజిక్ ఫిగర్ని అందుకోవాల్సి ఉండగా గాదెకు 12,035 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన గెలిచినట్లు ప్రకటించారు.