- వికారాబాద్ పట్టణంలో రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద నిత్యం ఇబ్బంది
- అత్యవసర చికిత్స అందాల్సిన పేషంట్‌తో ఉన్న ఓ ప్రైవేట్ అంబులెన్స్ 15 నిమిషాలు పాటు ఆగిన వైనం
వికారాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ రైల్వే లైన్ ఉండటం ప్రజల పాలిట శాపంగా మారింది. రైల్వే గేటు పడితే రైలు వచ్చేదాకా అంబులెన్స్ అయినా సరే ఆగాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిందే. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పరిష్కార మార్గం దొరకని పరిస్థితి. గతంలో కొత్తగాడి సమీపంలో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వేసి ఆ రోడ్డు మార్గంలో వెళ్లే ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. కానీ పట్టణం నడి బొడ్డున పరిస్థితి దారుణంగా తయారయింది. తాజాగా ఆదివారం రోజున మధ్యాహ్నం సమయంలో రైల్వే గేటు పడటంతో అత్యవసర చికిత్స అందాల్సిన పేషంటుతో ఓ ప్రైవేటు అంబులెన్స్ 15 నిమిషాలు ఆగాల్సిన పరిస్థితి తలెత్తిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పశమనం కల్పించాలని పల్లె, పట్టణవాసులు వేడుకుంటున్నారు.