- హైదరాబాద్ లిబర్టీ లో ఉన్న టీటీడీ తీరు నిలయం శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి…
- ఆలయ అలంకరణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది… ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రాంగణమంతా వివిధ రకాల పువ్వులు పండ్లతో అలంకరించారు…
- ఆలయం ద్వారం వద్ద ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వర ఫైబర్ విగ్రహ రూపం విశేషంగా భక్తులను… ఆ మార్గంలో వెళ్ళే వాహనదారులను ఆకట్టుకుంటోంది
వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అంతకుముందు ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి నిర్వహించారు. మిధున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు.