- బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్
- ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు
- త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు.!
- జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి.?
- పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి
- అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు
- గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు
- ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్న సీనియర్ నేతలు
- గతంలో ఎమ్మెల్యేలకు నో అపాయింట్మెంట్.. నేడు గల్లీ లీడర్ తో కేసీఆర్
- గులాబీ గూటిలో చివరకు మిగిలేది కల్వకుంట్ల ఫ్యామిలీయే
‘ఓడలు బండ్లు అవుతాయి… బండ్లు ఓడలు అవుతాయి’ అనే సామెత ఊరికనే రాలేదు.. అన్ని రోజులు మనవి కావు అనడానికి దీన్ని వ్యంగ్యంగా వాడుతారు. ఇప్పుడు ఈ సామెత మాజీ ముఖ్యమంత్రివర్యులు, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఫర్ఫక్ట్ గా సూట్ అవుద్ది. గత పదేళ్లు తెలంగాణలో అధికారమనే గద్దెపైకి కూర్చున్న ఇతగాడికి ఎవరూ కానరాలేదు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, నిరుద్యోగులు, ఉద్యోగులు చివరకు మీడియాను సైతం లెక్కచేయని పరిస్థితి. అధికార మదంతో ఎవడితో నాకేంటి పని అనే ఊహలో ఉండేవాడు. కానీ ఆదివారం తర్వాత సోమవారం వస్తుందనే విషయం మరిచిపోయాడు. ఢిల్లీ మెడలు వంచి, చావు నోట్లో తలపెట్టి, నిద్రహారాలు లేక, రాత్రింబవళ్లు కష్టపడి ఒక్కడ్నే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని చెప్పుకుంటే సరిపోదు.. రాష్ట్ర ప్రజల్నీ ఎంత ఘోస పుట్టించుకున్నా, పార్టీలు, ప్రజా సంఘాలు నా గురించి ఏమనుకుంటున్నారు.. ఉద్యోగ, నిరుద్యోగ సంఘాల పరిస్థితి ఏంటి.. జర్నలిస్టుల అంతర్మథనం ఏంటనీ కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయిండు. అంతేగాక దేక్ లేంగే.. తీన్ బార్ పక్కా.. అంటూ విర్రవీగిన కేసీఆర్ కు ఆకలి మంటలు, కడుపులో కోపం, ఉద్రేకంతో మరిగిపోయిన జనం కర్రు కాల్చి వాత పెట్టారనేది జగమెరిగిన సత్యం..
నాడు మంత్రులకే అపాయిట్మెంట్ దొరకలే, నేడు గల్లి లీడర్లతో మీటింగ్ :
నాడు మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ (ప్రగతి భవన్ లోకి నో ఎంట్రీ) ఇవ్వని సారు నేడు గల్లీ లీడర్ ను పిలుచుకొని గంటల తరబడి మాట్లాడే దుస్థితికి దిగజారిండు. తెలంగాణలో మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 63మంది ఎమ్మెల్యేలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్.. టీడీపీ శాసనసభ్యులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని నూరు మందినీ చేసుకున్న ఘనత ఆయనది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉవ్వెత్తున ఎగసిపడ్డ ఉద్యమం రాష్ట్రం సిద్ధించినంక ఆ నినాదం నీరుగారిపోయింది. అదీ అట్లుంటే ఏండ్ల తరబడి కొట్లాడంగ వచ్చిన తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుంది. మనమంతా ఉన్నత స్థాయికి ఎదుగుతామనే ఊహల్లో జనాలు ఉన్నారు. అయితే పైకి ఎదుగుడు దేవుడెరుగు గానీ కనీసం రాష్ట్రంలో ఎక్కడా డెవలప్ మెంట్ చూద్దామన్న కానరాలే.
సడెన్ గా గవర్నమెంట్ రద్దు :
యనకటికి ఎవడో.. ఒంగ లేక మంగళవారం అన్నాడంట.. అప్పుడు కేసీఆర్ ను చూస్తే అదే గుర్తొచ్చింది. ప్రతిపక్షం పార్టోళ్లు అభివృద్ధికి అడ్డం పడుతుర్రు.. గవర్నమెంట్ నడుపుడు నావల్లె అవుతలే.. ప్రభుత్వాన్ని రద్దు జేస్తున్నా.. నా పార్టీకి (టీఆర్ఎస్) ఫుల్ మెజార్టీ ఇవ్వండి అప్పుడు చూడండి దేశంలోనే రాష్ట్రాన్ని నెం.1 స్థాయికి తీసుకుపోతా, తెలంగాణను ప్రపంచ పటంలో పెడతా అనే మోతెబరి ముచ్చట్లు శానానే చెప్పిండు. అయ్యే నిజమెనేమో అని ప్రజలు నమ్మి ఆయనకు 88సీట్లు (ఎమ్మెల్యేలను) ఇచ్చిర్రు. అంతటితో ఆగకుండా మళ్లీ కాంగ్రెస్, టీడీపీల నుంచి పోటీచేసి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకున్నాడు. అదే పాపం ఇప్పుడు కాకకు తగిలినట్టుంది. మొన్న డిసెంబర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలు గద్దె దింపారు. బిఆర్ఎస్ కు కేవలం 39 సీట్లు మాత్రమే ఇచ్చి బుద్ధి చెప్పారు. అందులోనూ కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఎంపీ ఎలక్షన్స్ తో పాటు అక్కడ బైపోల్ జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపొందారు. మల్లోకటి కాంగ్రెస్ ఖాతాలో పడడంతో అది కాస్త 38కి పడిపోయింది. అందులో ఆరుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్(ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు( భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్ పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి(బాన్సువాడ) సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవెళ్ల) ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురువారం రాత్రి ఒక్కసారిగా ఆరుగురు ఎమ్మెల్సీ లు సీఎం రేవంత్ ఆధ్యర్యంలో జాయిన్ అయ్యారు. మరో పది మంది గులాబి పార్టీ ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్సీలు కూడా హస్తం పార్టీ మారే అవకాశ ఉందని తెలుస్తోంది. కొందరు కాంగ్రెస్ వైపు చూస్తుండగా మరికొందరు బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబర్చుతున్నట్టు సమాచారం.
జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి ?:
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతున్న వేల ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి రాజీనామా కోసం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా నేడు జరిగే కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తెలంగాణ భవన్ కు రావాల్సిందిగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు గులాబీ బాస్ నుంచి సమాచార వెళ్ళింది. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినప్పటికీ అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే, మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పఠాన్ చెర్వు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు గైర్హాజరు అయినట్లు సమాచారం. అదేవిధంగా బీఆర్ఎస్ కు 47 మంది ఉన్న కార్పొరేటర్లు ఉండగా కేవలం 30 మంది మాత్రమే అటెండ్ అయినట్లు తెలుస్తోంది.
గేట్లు ఓపెన్ చేసినంక క్యూ కట్టిన
బీఆర్ఎస్ పార్టీలో నమ్మకమైన నేతలు కూడా షాక్ ఇస్తూ కాంగ్రెస్ గూటికి చేరుతుండడంతో ఏం చేయాలో అర్థం కాక నాయకత్వం తలలు పట్టుకుంటోంది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి పార్టీ భవిష్యత్ పై భరోసా కల్పిస్తున్నా.. జంపింగ్ లు ఆగడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేసినట్టు ప్రకటించిన తర్వాత ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరో ఆరుగురు ఎమ్మెల్సీ లు కాంగ్రెస్ లో చేరారు. మిగతా వారు కూడా పార్టీ మారుతారనేది హాట్ టాపిక్ గా మారింది. చేరికలు ఊపందుకోండంతో మాజీ సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ఫాంహౌస్ కు పిలిపించుకొని చర్చిస్తున్నారు. పార్టీకి భవిష్యత్తు ఉందని, ఎవరూ వెళ్లొద్దని అభయం ఇస్తున్నారు. ఫాంహౌస్ కు వచ్చిన ఎమ్మెల్యేలు కేసీఆర్ వద్ద తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూనే పక్కచూపులు చూస్తున్నారనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా వలసలకు బ్రేక్ వేసేందుకు గులాబీ బాస్ డే అండ్ నైట్ వర్కవుట్ చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వీడిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు తాజాగా హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. కేటీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో వారు కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్న ప్రచారం మళ్లీ ప్రారంభమైంది. ఇలా ఒకరి వెనుక మరొకరు దారి పట్టి కారు ఖాళీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. చివరకు గులాబి గూడులో కల్వకుంట్ల ఫ్యామిలీయే మిగిలిపోయేటట్టు తెలుస్తోంది.