ఒడిస్సా నుంచి హైదరబాద్ కు అక్రమంగా గాంజాయి తరలిస్తున్న ఇద్దరు పెడ్లర్లను లాలాగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన మంగళవారం లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్యనగర్ లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రఘు బాబు తెలిపిన మేరకు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన రాఘవేందర్ రెడ్డికి ఒడిస్సా లోని డ్రగ్ పెడ్లర్లతో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైద్రాబాద్ లో అధిక ధరలకు విక్రయిస్తుంటాడు. అందులో భాగంగా రాఘవేందర్ మల్లాపూర్ కు చెందిన పడాల దనుష్(23), మౌలాలికి చెందిన పిట్ల వంశీ (25)లతో కలిసి ఒడిస్సాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తిరిగి హైద్రాబాద్ కు వస్తున్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైలు చేరుకునే సమయంలో లాలాపేటలోని ఆర్యనగర్ పట్టాల వద్ద సిగ్నల్ పడడంతో రైలు ఆగింది. ఈ క్రమంలో ముగ్గురు పెడ్లర్లు రైలు దిగి శాంతినగర్ బ్లూమూన్ హోటల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పటికే విశ్వసనీయ సమాచారం అక్కడికి చేరుకున్న లాలాగూడ, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ధనుష్, వంశీలను అదుపులోకి తీసుకొని వారి బ్యాగుల్లో ఉన్న 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, మరో పెర్లర్ రాఘవేందర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.