- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు
పార్టీ మారిన ఎమ్మెల్యే(MLA)కు షాక్ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్‌ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఈ వ్యవహారం ముందుకు జరగలేదు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంలో పిటిషన్ వేసింది. మొదట తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పిటిషన్ వేసింది. ఆ తరువాత మరొక ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్. అయితే వీటన్నింటినీ కలిపి ఒకేసారి విచారణ చేస్తామంటూ.. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ఈనెల 10కి వాయిదా వేసింది. ఓ వైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కూడా కోరింది బీఆర్‌ఎస్. దీనిపై స్పందించిన స్పీకర్.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. లిఖితపూర్వకంగా సమాధానాలు చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.