- సర్కార్ దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం
- ఇదేంటని ప్రశ్నించినా పట్టించుకోని వైనం
- సర్వజనాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
నిరు పేదలు, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం సర్కార్ దవాఖానాలను ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఉండే నిరుపేద, గిరిజనుల, పట్టణప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు సర్కార్ వైద్యం అందని ద్రాక్షలా మారిందని చెప్పకనేచెప్పవచ్చు. సర్వజన ఆసుపత్రిలో రోజురోజుకు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం పెరిగిపోయి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక కేంద్రాల్లో అంటే ఏదో అనుకోవచ్చు. కాని జిల్లాకేంద్రమైన కొత్తగూడెం సర్వజనాసుపత్రిలో ఇది రోజూ జరిగే తంతు. వైద్యుల కోసం రోగులు నిరీక్షించి అక్కడే సొమ్మసిల్లిపడిపోవాల్సిందే తప్ప వైద్యులు మాత్రం సమయానికి రారు. ఇదేంటని సిబ్బందిని అడిగితే డాక్టర్ వచ్చినప్పుడు చూస్తాడు. మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండి అంటున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మరి సీరియస్‌కేసులు అయితే సర్వజన ఆసుపత్రిలో పనిచేసే వైద్యులసొంత ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇది నిత్యం జరిగే పని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రమైన కొత్తగూడెం సర్వజనాసుపత్రిలో డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి బుధవారం మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సర్వజన ఆసుపత్రిలో కొత్తగూడెం నియోజక వర్గం లక్ష్మీదేవిపల్లి మండలం తెలగరామవరంకు చెందిన చంద్రగిరి సత్యనారాయణ మంగళవారం రాత్రి కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పటల్లో చేరాడు. అయితే సరైన వైద్యం అందక సదరు వ్యక్తి బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈవిషయంపై వైద్యులను కుటుంబ సభ్యులు ఎలా చనిపోయాడని అడగగా గుండెపోటుతో మరణించారని సమాధానం చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులను నిలదీయగా అసలు కారణాలు బయటపడ్డాయి. కడుపునొప్పితో వచ్చిన వ్యక్తికి హార్ట్‌ఎటాక్ ఎలా వస్తుందని ఆసుపత్రి ముందు కుటుంబసభ్యులు నిరసన వ్యక్తంచేశారు. సత్యనారాయణ మరణానికి ప్రభుత్వ వైద్యులు, సిబ్బందే కారణమని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉండి వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లనే సత్యనారాయణ మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.