- అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటా వార్పు
- దేవరుప్పుల మండలంలో ఘటన
- గిరిజనుల విషయంలో అధికారుల తీరుపై పలు విమర్శలు
తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో విసుగు చెందిన బ్యాంకు(BANK) అధికారులు ఏకంగా ఆమె ఇంటి మందు పొయ్యిపెట్టి వంటా వార్పు చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాలో చోటు చేసుకుంది. పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి మహిళా సంఘం సభ్యురాలు ఐతే ఆమె తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. 61 వేలు బ్యాంకుకు బకాయి ఉంది. అయితే రుణం చెల్లించాలని లక్ష్మిని చాలా సార్లు కోరినా పట్టించుకోకపోవడంతో బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం వెంకట్‌రెడ్డి, సీసీ సోమనారాయణ, వీవోఏలు రుణం వసూలు కోసం గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటావార్పు చేపట్టారు. కాగా, లబ్దిదారు ప్రస్తుతం రూ. 10 వేలు కడతానని 28 వ తేదీ లోగా మిగతా 51 వేలు కడతానని హామీ ఇచ్చిందని బ్యాంకు, సెర్ప్ అధికారులు చెప్పారు. అయితే గడువులోగా డబ్బులు కట్టకపోతే మరోమారు ఇదేవిధంగా ఇంటి దగ్గరకు వచ్చి నిరసన తెలుపుతామని బ్యాంకు, సెర్ప్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రుణాలు రికవరీ చేయాలని మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. కాగా, ఓ గిరిజన మహిళ నుంచి రుణం వసూలు చేసే తీరు సరిగా లేదని, బడాబాబులను వదిలి గిరిజనులను రుణాలు కట్టమని ఇలా వంటా వార్పుతో నిరసన తెలపడం సరికాదని పలువురు గిరిజనులు వాపోతున్నారు.