- ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇంటర్మీడియట్ కాలేజ్
- విద్యాసంస్థలకు ప్రైవేట్ లిమిటెడ్ ఎలా సాధ్యం
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు
- ఇంటర్ బోర్డు అనుమతి అసలే లేదు
- బొక్క బోర్లా పడ్డ స్టూడెంట్స్ పేరెంట్స్
- అధికారుల కనుసన్నల్లోనే అంతా
- కనీస వసతులు, జాగ్రత్తలు కరవు
- డీఐఈఓ ఎంక్యా నాయక్ అండతోనే యవ్వారం
- విద్యార్థులు, తల్లిదండ్రులను నమ్మించిన బన్సల్ క్లాసెస్ యాజమాన్యం
- విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సీజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్
‘బడికి పోనప్పుడు బలపం బలపం అని… బడిపోయినంక బప్పం బప్పం’ అన్నట్టు ఉన్నది ఓ విద్యాసంస్థ పనితీరు. లక్షల్లో డోనేషన్లు, ఫీజులు వసూలు చేస్తే దానికేం స్కూల్ చాలా మంచిదే అనుకుంటా అని బొక్క బోర్లాపడి తమ పిల్లలను ఆ పాఠశాలలో చేర్పిస్తున్నారు నేడు తల్లిదండ్రులు. ‘మేడి పండు చూడు మేలిమై ఉండు.. పొట్టవిప్పి చూడు పురుగులుండు’ అన్న చందంగా కార్పోరేట్, ప్రైవేట్ స్కూల్, కాలేజీల పరిస్థితి తయారైంది. జనగ పీల్చినట్టు పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసుడు వరకే తెలుసు అంతకు తగ్గ న్యాయం చేస్తున్నామా లేదా అనేది వాళ్ల అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేటు చదువులు చాలా కాస్లీ అయిపోయినయి. అందులోను టెన్త్, ఇంటర్ అయితే మరీ ఘోరం. పేరెంట్స్ ను పీల్చి పిప్పి చేయడంలో వారు సిద్ధహస్తులు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. నగరంలోని ఓ జూనియర్ కళాశాల యవ్వారం తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే.
ఇక వివరాల్లోకి వెళితే.. బన్సల్ క్లాసెస్ అనే పేరుతో కాదు.. దానికన్న ప్రైవేట్ లిమిటెడ్ అని చెబితేనే ఎక్కువ నోటెడ్ అవుతుంది అనుకుంట. హైదరాబాద్ నగరంలో బన్సాల్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ విద్యాసంస్థ సరికొత్త దందా చేస్తుంది. మనకు తెలిసి ఏదైనా కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉంటుంది. కానీ ఇంటర్మీడియట్, ఐఐటి, నీట్ పేరుతో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు, అకాడమీలను చూసాం. చదువు చెప్పే ఓ విద్యాసంస్థకు ఇలాంటి పేరు పెట్టుకున్నారంటే దాని అంత తోపు లేదని అనుకోవాలి కావొచ్చు. కానీ కొత్తగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల పేరుతో కూడా ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారు అంటే కార్పొరేట్ మాఫియా ఎంతకైనా తెగిస్తుంది అనడానికి బన్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మంచి ఉదాహరణ. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఈ బన్సాల్ క్లాసెస్ కాలేజీలు వెలిశాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదు. విద్యాశాఖ లేదా ఇంటర్ బోర్డు నుంచి పర్మిషన్ కూడా లేదు. అవేం లేకున్నా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను పట్టిపీడిస్తున్నది యాజమాన్యం. కాలేజ్ బిల్డింగ్ కు కనీస జాగ్రత్తలు, అవసరాలు లేకుండా.. స్టూడెంట్స్ ప్రమాదానికి గురయ్యే రీతిలో భవనాలు ఉండడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఈ విద్యాసంస్థ సిటీలోని పలుచోట్ల బ్రాంచీలను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో స్టూడెంట్స్ ను జాయిన్ చేసుకొని ఫీజులు వసూలు చేస్తుంది.
దిల్ సుఖ్ నగర్, కొత్తపేట లలిత జ్యువెలరీపైన డేస్ కాలర్ పేరుతో బాయ్స్ క్యాంపస్, ముసారంబాగ్ లో గర్ల్స్ రెసిడెన్షియల్, మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో రెసిడెన్షియల్ ను ఐఐటి, నీటి పేరుతో బ్రాంచీలు కొనసాగిస్తుంది. ఇన్ని కాలేజీలను బన్సాల్ క్లాసెస్ దర్జాగా నడుపుతున్నది. నెలనెలా విద్యాశాఖ అధికారులకు ముడుపులు ఇచ్చుకుంటూ వారి అండదండలతో మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఈ క్యాంపస్ ల్లో ఏ ఒక్క దానికి కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి కళాశాల నిర్వహించుకోవడానికి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు అనే నిజం కనీసం పేరెంట్స్ కూడా తెల్వకుండా మెయింటెన్ చేస్తున్నారంటే ఎంత పెద్ద నేరం మీరే ఆలోచించాలి. విద్యార్థుల వద్ద లక్షల్లో ఫీజులు తీసుకొని చివరకు ఇంటర్ బోర్డు నుంచి పర్మిషన్ లేదని తెలిసిన తల్లిదండ్రులు షాక్ గురవుతున్నారు. ఇంతలా ఎలా జరుగుతుందంటే ప్రభుత్వ ఆఫీసర్ల చేతులు తడుపుతూ ఇంత పెద్ద దందా చేస్తున్నది. ఇందులో చదువుతున్న వందల మంది విద్యార్థుల నుండి లక్షల రూపాయలు ఫీజులను వసూలు చేసి కనీసం విద్యార్థులకు రక్షణ కూడా అందించలేని పరిస్థితి యజమాన్యాలది. సరైన బిల్డింగ్స్, భవనాలు లేకుండా ఫైర్ స్టేఫి, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోకుండా కళాశాల నడిపిస్తుండడంపై పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్, షార్ట్ సర్క్యూట్ లాంటివి ఏమైనా జరిగితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు గ్యారెంటీ అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి అనుమతి లేని కళాశాలలు నిర్వహించినట్లయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకారం క్రిమినల్ కేసులను నమోదు చేసి పది లక్షల రూపాయల జరిమానాను విధించాలని సీజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. బన్సాల్ క్లాసెస్ యాజమాన్యం బరితెగించి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటే జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారులు స్పందించకుండా, వారు ఇచ్చిన మాముల్ల మత్తులో ఉండిపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘ నాయకులు జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇంకా ఇలాంటి స్కూల్స్, కాలేజీలు ఉన్నా విద్యాశాఖ వాటిని వెరిఫై చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇదే విషయంపై రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యూకేషనల్ అధికారి ఎంక్యా నాయక్‌ను ఆదాబ్ ప్రతినిధి వివరణ కోసం సంప్రదించగా స్పందించలేదు…