ఐపీఎల్ 2024 సీజన్‌ను తెర వెనుక ఉండి నడిపించిన అన్‌సంగ్ హీరోలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో 13 వేదికల్లో పిచ్‌లను సిద్దం చేసిన క్యూరెటర్లతో పాటు మైదానాల సిబ్బందికి బీసీసీఐ క్యాష్ రివార్డ్ అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. 10 ఫ్రాంచైజీలకు చెందిన హోమ్ గ్రౌండ్స్‌లోని క్యూరెటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు ఒక్కో మైదానం చొప్పున రూ. 25 లక్షల నజరానా ఇవ్వనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. అలాగే అదనపు వేదికల్లోని ధర్మశాల, వైజాగ్, గువాహటి గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్లకు ఒక్కో మైదానం చొప్పున రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఐపీఎల్ విజయవంతంగా మగియడంలో వీరు కీలక పాత్ర పోషించారని, దాంతోనే క్యాష్ రివార్డ్స్ అందజేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం చెపాక్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ముచ్చటగా మూరోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిరది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఎయిడెన్ మార్క్‌రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20), ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి 57 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(6) విఫలమైనా.. రెహ్మానుల్లా గుర్బాజ్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), వెంకటేశ్ అయ్యర్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్) సత్తా చాటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, షెప్‌ాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీసారు.