- హెల్త్ డిపార్ట్ మెంట్ లో బదిలీల పరేషాన్
- అవకతవకలు జరిగాయంటూ బోరుమంటున్న ఉద్యోగులు
- ట్రాన్స్ ఫర్స్ లిస్ట్ లో డొల్లతనం
- బదిలీల లిస్ట్‌లో 34 నెం.లో ఉండాల్సిన ఉద్యోగినీకి 23 నెంబర్
- తన అనుకున్న వారికే న్యాయం
- కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అధికారుల అవినీతి
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్
తెలంగాణలో జరుగుతున్న బదిలీల్లో అధికారుల అవినీతి, అక్రమాలు బట్టబయలు అవుతున్నాయి. డిపార్ట్ మెంట్ ఏదైనా గానీ ట్రాన్స్ ఫర్స్ లో అధికారుల డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తన అనుకున్న వారికీ అధిక ప్రియార్టీ ఇస్తుండడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో ఆధారంగా వివిధ శాఖల్లో ఉద్యోగులందరీ బదిలీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హెల్త్ డిపార్ట్ మెంట్ లో తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లు సంబంధిత ఉద్యోగులు వాపోతున్నారు.
తిప్పర్తి ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలోని సబ్ సెంటర్ లో పనిచేస్తున్న ఏఎన్ఎం స్లీవ నక్షత్రకు కొందరూ అధికారులు వెన్నుదండుగా నిలువడం గమనార్హం. అక్రమంగా ఆమె బదిలీల ప్రక్రియలో ముందు వరుసలోకి వచ్చింది. వాస్తవానికి స్లీవ నక్షత్ర స్పౌజ్ కాదు, మెడికల్ గ్రౌండ్ లేదు, విడో కూడా కాదు అయినా గానీ ఆ ఉద్యోగినీకి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా బదిలీల లిస్ట్‌లో 34వ సంఖ్యలో రావాల్సిన సదరు ఉద్యోగినికి అక్రమ మార్గంలో 23వ నెంబర్ కేటాయించాడు యూడీసీ అనిల్.
ఏఎన్ఎం స్లీవ నక్షత్ర తిప్పర్తి సబ్ సెంటర్ లో 16 సంవత్సరాల 11 నెలల 6 రోజులుగా పనిచేసింది. కానీ 28 సంవత్సరాల సర్వీస్ చేసిన ఉన్న వారికంటే ముందు స్లీవ నక్షత్రకు యూడీసీ అనిల్ అధిక ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. ఇంచార్జ్ డాక్టర్‌కు తెలియకుండానే అనిల్ లోపాయికారి ఒప్పందం చేసుకొని ఏఎన్ఎం స్లీవ నక్షత్రకు బదిలీల లిస్ట్‌లో 23వ నెంబర్‌కు వచ్చే విధంగా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సదరు ఉద్యోగిని క్లిష్టతరమైన (హార్డ్‌షిప్) ప్రాంతంలో పనిచేస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ లిస్ట్‌లో ముందు వరుసలోకి తీసుకురావడం జరిగింది. కానీ, నల్గొండ జిల్లా హెడ్ క్వాటర్స్‌కు 18 కి.మీ దూరం, జాతీయ రహదారికి సమీపంలో ఉన్న తిప్పర్తికి ఇది ఎలా వర్తిస్తదనీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన చందంపేట, దేవరకొండ, పెద్దదేవులపల్లి, నేరేడుకొమ్మలకు వర్తించని రూల్స్ తిప్పర్తి సబ్ సెంటర్ లో పనిచేసే ఏఎన్ఎం నక్షత్రకు ఎలా వర్తిస్తుందనేది అనుమానం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి చందంపేట, దేవరకొండ, పెద్దదేవులపల్లి, నేరేడుకొమ్మ క్లిష్టతరమైన ప్రాంతాలుగా చెప్పవచ్చు. కానీ తిప్పర్తి లాంటి ప్రాంతాల్లో పనిచేసిన వారికి హార్డ్‌షిప్ ఏరియాగా పరిగణించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లిస్ట్ ఎవరూ రూపొందించారో, లేదా మారుమూల ప్రాంతాలకు కూడా ఇదే అవకాశం ఇవ్వాలని 5వ జోన్ ఏఎన్ఎంలు అందరూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలల ప్రక్రియలో ఈ రకంగా నిబంధనలు ఉల్లంఘించిన దాఖలాలు లేవు. ఈ అక్రమాలపై దృష్టి సారించాలని, అర్హులైన వారికి తగిన బదిలీల అవకాశం కల్పించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారులను ఉద్యోగులు కోరుతున్నారు. బదిలీల్లో తన అనుకున్నవారికి న్యాయం చేస్తూ అర్హులకు అన్యాయం చేసిన వారిపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.