Friday, September 20, 2024
spot_img

వానా కాలం,వ్యాధులతో అప్రమత్తం

Must Read

(కాలానుగుణ వ్యాధులతో కాస్త జాగ్రత్త!) :

రోజు రోజుకు మనం ప్రకృతి సిద్ధమైన పంచభూతాలకు దూరం అవుతున్నాం. అందువల్లనే రోగాలకు దగ్గర అవుతున్నాం. స్వచ్ఛమైన గాలి, నీరు, నింగి, నేల, నిప్పును కలుషితం చేస్తున్నాం. ప్రకృతిని వికృతిగా మారుస్తూ పలు జబ్బులను కొనితెచ్చుకుంటున్నాం. సమాజంలో 80 శాతం వ్యాధులు ప్రబలుటకు పరిసరాల పారిశుధ్య లోపం, సురక్షితమైన నీరు, ఆహారం తీసుకోక పోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం, సూక్ష్మక్రిములు, కీటకాలు ముఖ్యమైన కారణాలు. పరిశుభ్రతే ఆరోగ్యానికి భద్రత. రోగం వచ్చిన తర్వాత పడే ఇబ్బందుల కన్నా, అంటురోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఇంటి చుట్టు పక్కల నీరు నిల్వ ఉండటం, చెత్తా చెదారం చేరటం వల్ల దోమలకు, ఈగలకు నిలయమై రోగాలు సక్రమించే అవకాశం ఉంది. వర్షాకాలంలో వ్యాపించే కాలానుగుణ (సీజనల్) అంటువ్యాధుల గురించి అవగాహన పెంచుకొని నివారణ చర్యలు తీసుకుని మన ఆరోగ్యం మన కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవాలి.

వర్షాకాలంలో నీటి ద్వారా వ్యాపించే అంటు వ్యాధులు: నీళ్ల విరేచనాలు (డయేరియా), రక్త విరేచనాలు (అమీబియాసిస్) అతిసారం (గ్యాస్ట్రో ఎంటరైటీస్), కలరా, టైఫాయిడ్, పచ్చ కామెర్లు (జాండిస్), హెపటైటిస్.వాన కాలంలో గాలి ద్వారా వ్యాపించే అంటువ్యాధులు: జలుబు, దగ్గు, ఫ్లూ, తట్టు, కంఠసర్పి, చికెన్ పాక్స్, టీబి.కీటకాల (దోమల) ద్వారా వచ్చే అంటు వ్యాధులు: మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడు వాపు, జికా వైరస్ జ్వరాలు.

నీళ్ల విరేచనాలు: సాధారణంగా ఇది రోటా వైరస్ అనే వ్యాధి కారక క్రిమి వల్ల వస్తుంది. కలుషితమైన నీరు మరియు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తరచుగా విరేచనాలు, కడుపునొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, చర్మం సాగే గుణం కోల్పోవుట, మూత్రవిసర్జన తగ్గిపోవుట మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వైరస్ కలిగిన రోగి మలంతో కలుషితమైన నీరు, ఆహారము ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. నీళ్ల విరేచనాలు అయినప్పుడు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పప్పు మీది తేటా, ఇతర ద్రవ పదార్థాలు ఇవ్వాలి. దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం లేదా ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినట్లయితే ఓ.ఆర్.ఎస్.ద్రావణం, జింక్ టాబ్లెట్స్ మరియు ఐవి ఫ్లూయిడ్ లతో చికిత్స చేస్తారు.

వ్యాధి రాకుండా తీసుకునే ముందస్తు జాగ్రత్తలు (నివారణ చర్యలు): వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే భుజించాలి. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలి. మలవిసర్జన తర్వాత ఆహార పదార్థాలు తీసుకునే ముందు ప్రతీసారి సబ్బునీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి. మరుగుదొడ్డిని వాడాలి. బహిరంగ మల మూత్ర విసర్జన చేయరాదు.

అతిసార వ్యాధి: వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, చర్మం సాగే గుణం కోల్పోవుట, మూత్రవిసర్జన తగ్గిపోవుట మొదలైనవి అతిసార వ్యాధి లక్షణాలు. కలుషితమైన నీరు త్రాగడం, కలుషితమైన లేదా నిలువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, పరిసరాల మరియు వ్యక్తిగత పారిశుద్ధ్యం లోపం వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మన రాష్ట్రంలో చిన్నపిల్లల్లో వచ్చే అంటువ్యాధులో దాదాపు 60 నుంచి 70 శాతం కేవలం డయేరియా /అతిసారం ఆక్రమిస్తున్నాయి. 23 శాతం చిన్నారుల మరణాలు సంభవిస్తున్నాయి. నివారణ చర్యలు: గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, లేదా జిహెచ్ఎంసి. వారు క్లోరినేషన్ చేసిన సురక్షిత నీటిని తాగాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి. చేతులు ముంచిన కుండ, బిందెలలో నీరు వాడకుండా కాడ గిన్నెతో నీటిని తీసుకునే అలవాటు చేసుకోవాలి. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయరాదు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు నిల్వ ఉంచుకోవాలి.

టైఫాయిడ్: సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. వారం పది రోజుల పాటు అధిక జ్వరం, విరేచనాలు, పొత్తి కడుపులో నొప్పిగా ఉండటం, కొందరికి శరీరంపై గులాబీ రంగులో చెమటకాయలు మాదిరి దద్దుర్లు మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. రోగి మలంతో కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. రక్త పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించి అంటీ బయోటిక్ తో తగిన చికిత్స చేస్తారు. నివారణ చర్యలు: బయట అమ్మే ఆహార పదార్థాలు తినరాదు. కాచి చల్లార్చి వడబోసిన నీటిని లేదా క్లోరినేషన్ చేసిన నీటినే త్రాగాలి. వారానికోసారి గోళ్ళను కత్తిరించు కోవాలి. వ్యాధిగ్రస్తుల బట్టలను వేడి నీటి యందు లేదా డెట్టాల్ కలిపిన నీటితో ఉతకవలెను.

పచ్చ కామెర్లు( జాండిస్): హెపటైటిస్ అనే వైరస్ ద్వారా వ్యాధి వస్తుంది. జ్వరము, ఆకలి లేకపోవుట, కళ్ళు, చర్మం, పసుపు పచ్చగా మారడం ఈ వ్యాధి లక్షణాలు. హెపటైటిస్-ఏ మరియు ఈ వైరస్ కలిగిన రోగి మలంతో కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. నివారణ చర్యలు: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. సురక్షిత నీటిని త్రాగాలి. బయట అమ్మే ఆహార పదార్థాలు తినరాదు. మలవిసర్జన తర్వాత భోజనానికి ముందు ప్రతిసారి చేతులను సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.

దోమలపై దండయాత్ర: ప్రతి ఐదుగురిలో ఒకరు దోమకాటుకు గురవుతున్న నేటి స్థితిలో దోమల నిర్మూలనకు ప్రభుత్వ కృషితో పాటు ప్రజా ఉద్యమంగా చేపట్టాలి. వ్యాధుల కంటే ముందు ప్రస్తుత సమాజానికి చికిత్స జరగాలన్నది మేధావుల అభిప్రాయం. ఆడ దోమలు నిల్వ నీటిలో వంద నుంచి మూడు వందల గుడ్లు పెడతాయి. గుడ్డు నుంచి లార్వా, ప్యూపా, దోమగా పెరగడానికి రెండు వారాలు పడుతుంది. మగ దోమలు సగటున 6లేదా 7రోజులు మాత్రమే బతుకుతాయి. ఆడ దోమలు 6 నుంచి 8వారాల వరకు జీవిస్తాయి. దోమలు చాలా వరకు శాకాహారులే. మనుషుల్ని కుట్టేది ఆడ దోమలు మాత్రమే. ఆడదోమ గుడ్డు పెట్టాలంటే రక్తంలోని ప్రోటీన్ అవసరం అందుకే అది మనుషుల, పశువుల, పక్షులను కుట్టి రక్తాన్ని పీలుస్తుంది. దోమ రక్తాన్ని పీల్చే ముందు మానవ శరీరంలోకి సూక్ష్మక్రిములను ప్రవేశపెట్టి అంటువ్యాధులకు వాహకంగా పనిచేస్తుంది. మూడు దోమలు ఆరు జబ్బులు : దోమ బహు చిన్నదైన మనిషి ఆరోగ్యానికి అది కలిగించే ముప్పు అతిపెద్దది. దోమకాటు పాముకాటు కన్నా ప్రమాదకరం. మూడు పూలు ఆరు కాయలు అవుతాయో కావో చెప్పలేము కానీ మూడు రకాల దోమలు ఆరు రకాల జబ్బులను కలుగ జేస్తాయని ఘంటా పథంగా చెప్పవచ్చు.

మలేరియా: ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్, ప్లాస్మోడియం వైవాక్స్ రకానికి చెందిన రెండు రకాల క్రిముల వల్ల మన ప్రాంతాల్లో మలేరియా వస్తుంది. ఆడఎనాఫిలిస్ దోమకాటు వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. చలి, వణుకుతో కూడిన జ్వరం, చెమటలు పట్టడం మరియు రోజు విడిచి రోజు జ్వరం రావటం ఈ వ్యాధి లక్షణాలు.

మలేరియా నియంత్రణ: జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకొని నిర్ధారణ తర్వాత మలేరియా రకాన్ని బట్టి పూర్తి మోతాదులో చికిత్స పొందాలి.

డెంగ్యూ: అకస్మాత్తుగా వచ్చే ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, శరీరంపై చిన్నపాటి దద్దుర్లు (తీవ్రమైన కేసుల్లో) రావడం డెంగ్యూ జ్వరం లక్షణాలు. చిగుళ్లు,ముక్కు, మలం నుంచి రక్తం పోవడం డెంగ్యూ హెమరేజిక్ లక్షణాలు. అయితే డెంగ్యూ వైరస్ సోకిన అందరికీ వ్యాధి రాదు. ఏడీస్ ఈజిప్ప్టై దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి డెంగ్యూ వైరస్ (ప్లావి వైరస్) వల్ల వస్తుంది. ఈ వ్యాధికి లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స చేస్తారు.

బోధవ్యాధి (ఫైలేరియా, ఎలిఫెంటియాసిస్): తరచూ వచ్చే జ్వరం,చంకల్లో గజ్జల్లో బిళ్లలు కట్టడం, కాళ్లు,చేతులు, స్తనాలు, ముష్కం మొదలైన అవయవాలు బాగా వాపు రావడం (వరిబీజం/బుడ్డ) మొదలైన లక్షణాలు ఉంటాయి. కూలెక్స్ దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి “ఉకలేరియా బ్రాంక్రాఫ్ట్” అనే హెల్మింథిస్ పరాన్న జీవి వల్ల వస్తుంది. వ్యాధికారక క్రిములు శరీరంలో ప్రవేశించిన కొన్ని ఏళ్లకు ఈ వ్యాధి లక్షణాలు బయట పడతాయి. యేడాదికి ఒక మోతాదు డి.ఇ.సి., ఆల్బెండజోల్ మాత్రలు మింగడం వల్ల వ్యాధిని నివారించవచ్చు.

చికున్ గున్యా: ఏడిస్ దోమ కాటు వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అకస్మాత్తుగా వచ్చే జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ప్రత్యేకించి చిన్న చిన్న కీళ్ల దగ్గర నొప్పి ఎక్కువగా బాధిస్తుంది. లక్షణాలను బట్టి చికిత్స నిర్వహిస్తారు.

జికా వైరస్ వ్యాధి: ఈ వైరస్ సోకిన వారికి జ్వరం,తలనొప్పి, ఒంటి మీద దద్దుర్లు, కండ్లు ఎర్రబారడం వంటి సాధారణ లక్షణాలుంటాయి. ఒక్కో సారి రోగికి మెదడు కుంచించుకు పోయే (గులియన్ బ్యారీ సిండ్రోమ్) మైక్రో సెఫాలి వంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. ఏడిస్ ఈజిప్టై దోమ కాటుతో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. జికా ఫీవర్ కు నిర్దిష్ట చికిత్స లేదు.

మెదడువాపు జ్వరం: హఠాత్తుగా వచ్చే విపరీతమైన జ్వరంతో కూడిన ఈ వ్యాధి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో మరణాలు సంభవించడం గాని అంగవైకల్యం కలగడం గాని జరుగుతుంది. మురికి నీటి నిల్వల్లో పెరిగే క్యూలెక్స్ రకానికి చెందిన దోమల ద్వారా ‘జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్’ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని చికిత్స ద్వారా నియంత్రించటం కష్టం. నివారణే సరైన మార్గం. పందులను, కొంగలను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. వ్యాధి గ్రస్తులను గుర్తించి సత్వర వైద్య సేవలు అందించాలి. రెండేళ్ల లోపు పిల్లలకు జే.ఈ. టీకా రెండు డోసులు ఇప్పించాలి.

వర్షా కాలంలో ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు:
కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వేడి వేడి ఆహారం తినవలెను. ఏరోజు ఆహారము అదే రోజు తినాలి. ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా మూతలను ఉంచవలెను. కలుషితమైన నీటిని, ఆహారాన్ని తీసుకోకూడదు.మంచినీటి పాత్రలపై మూతలుంచాలి. చేతులు ముంచి కుండ, బిందెలలో నీరు వాడకుండా కాడవున్న గ్లాస్ తో నీరు తీసుకోవాలి. ఆకు కూరలు, కూరగాయలను నీటిలో ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి.

భోజనానికి ముందు మరియు మలవిసర్జన తర్వాత చేతులు సబ్బునీటితో శుభ్రపరుచుకోవాలి.ఈ సీజన్లో బయట చిరు తిండిని, నిల్వ ఉన్న మాంసాహారాన్ని, మిగులు ఆహారాన్ని ఎట్టి పరిస్థితిలో తినకూడదు.
బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయకూడదు. ఎందుకంటే వర్షపు నీటితో కలుషితమైనచో వ్యాధులు ప్రబలుతాయి.కాబట్టి ప్రతి ఇంటిలో మరుగుదొడ్డిని తప్పక వాడవలెను.

ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా మరియు చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. పల్లపు ప్రాంతాలు, గుంతలను పూడ్చాలి. నీరు నిల్వ ఉన్న మురికి గుంటలో కిరసనాయిలు గాని, వాడిన ఇంజన్ ఆయిల్ గానీ మురికి నీటిలో వేసినచో దోమల పెరుగుదలను అరికట్టవచ్చు. మురికి కాలువలలో చెత్తా చెదారం వేయకుండా. మురికి నీరు ప్రవహించేందుకు ఏర్పాటు చేసుకోవాలి.

ఇంటి పరిసరాలోని పనికిరాని కుండలు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ గ్లాసులు, పాత టైర్లు, కూలర్లు పూల కుండీలు, ఇంటి పై కప్పున నీరు నిలువకుండా చూడవలెను.ప్రతి శుక్రవారం నీరు నిల్వ ఉండే ఆన్ని పాత్రలను ఖాళీ చేసి, ఆరబెట్టి మరల శుభ్రమైన నీరు నింప వలెను. ( ఫ్రైడే – డ్రైడే విధానం) దీనివల్ల కూడా దోమల పెరుగుదలను అరికట్టవచ్చు. దోమల నుండి రక్షణ పొందుటకు దోమ తెరలు, దోమల బ్యాట్, దోమల కాయిల్స్ వాడవలెను. శరీరం పూర్తిగా కప్పబడే వస్త్రాలు వాడాలి.

గ్రామపంచాయితీలు విధిగా గ్రామంలోని మంచినీటి పైపుల లీకేజిని మరమ్మత్తు చేయించి, నీటి ట్యాంకులను పది రోజులకు ఒకసారి శుభ్ర పరచవలెను. మిషన్ భగీరథ పథకం ద్వారా అందే క్లోరినేటెడ్ నీటిని కాచి చల్లార్చి త్రాగవలెను. విరేచనాల నివారణకు ప్రాథమికంగా మీ గ్రామంలో ఉన్న ఆశా కార్యకర్త వద్ద ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు తీసుకొని ఒక లీటర్ కాచి చల్లార్చిన నీటిలో కలుపుకొని త్రాగవలెను. తగ్గని సమయంలో ఆలస్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళవలెను.

నాశబోయిన నరసింహ (నాన), కవి, రచయిత, ఆరోగ్య విస్తరణ అధికారి, 8555010108.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This