- ధరణిని రేవంత్ బంగాళాఖాతంలో కలిపేస్తాడా..?
- ఈనెల 14న భూభారతి అట్టహాసంగా ఆరంభం..
- శిల్పకళా వేధిక సాక్షిగా ఆరంభించనున్న సీఎం రేవంత్..
- ధరణి దరిద్రం తీరనుందా..? కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా..?
- రైతుల ఇక్కట్లకు ఇక్కనైనా విముక్తి లభిస్తుందా..?
- ఇప్పటికీ నిషేధిత జాబితాలో మూలుగుతున్న వేల ఎకరాల..
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతుల కడగండ్లు తీరుస్తుందని అందరూ భావించారు.. మనం ఒకటి తలిస్తే..పైవాడు ఇంకొకటి తలచాడని, రైతుల ఆలోచనలు ఒకరకంగా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ పెద్దల ఆలోచన మరో రకంగా రూపుదిద్దుకుంది… రైతుల కష్టాలు తీరకపోగా కొత్త కష్టాలు వచ్చి చేరాయి.. మూలిగే నక్కమీద కొబ్బరిబోండాం వచ్చి పడినట్లు..ధరణి పోర్టల్ తో ప్రాణాల మీదకు వచ్చింది.. ఎన్నెన్నో మారణహోమాలు జరగడం చూశాం.. ఈ పోర్టల్ ను తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి..ధరణిని బంగాళా ఖాతంలో కలిపేస్తానని ఎన్నికలముందు చెప్పడం..కాంగ్రెస్ అధికారంలోకి రావడం..రేవంత్ సీఎం కావడం జరిగిపోయింది.. మరి ఏడాదిన్నర కాలం తరువాత ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను తీసుకు రావడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు.. ఈనెల 14 న ప్రారంభానికి ముహూర్తం కూడా నిర్ణయించారు.. మరీ భూ భారతి రైతులకు మేలు చేస్తుందా…?
రైతుల పాలిట ఒక భయంకరమైన నరకంగా రూపుదిద్దుకున్న వెంటాడిన ధరణి పోర్టల్ తో నేటికీ ఎంతోమంది రైతులకు పాసుపుస్తకాలు కూడా రాని పరిస్థితి… ప్రోహిబిటెడ్ కాలంలో వేలాది మంది రైతుల భూములు మగ్గుతున్నాయి.. ఇక ఎన్నారైల పరిస్థితి చెప్పడానికి అలవు కావడం లేదు.. రైతుల జీవితాలను అస్తవ్యస్తం చేసి, ఆత్మహత్యలకు ప్రేరేపించిన ధరణి పోర్టల్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాయని మచ్చలా మిగిలిపోయింది.. నిజంగా భూమి కలిగిన భూ యాజమానుల పాసు పుస్తకాలు మాయమైపోయాయి.. అసలు భూమే లేని వారికి పాస్ పుస్తకాలు, అదేవిధంగా గుట్టలకు, రోడ్లకు, రెషిడెన్షియల్ ప్లాట్ల, ఇండ్లకు కూడా గత ప్రభుత్వ పాసు పుస్తకాలు జారీ చేసింది. దీని వల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టం వాటిల్లింది.. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అనేక వ్యథలు రైతులను ఉక్కిరి బిక్కిరి చేశాయి.. అంతే కాకుండా ధరణిని అడ్డం పెట్టుకుని ఉన్నతాధికారులు చేసిన భూ కబ్జాలు ఎన్నో కథనాలను ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది.. అయితే రైతుల కష్టాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ రూపొందించిన వ్యవస్థ భూభారతి.. అయితే నిజంగా ఇప్పటికైనా రైతుల కడగండ్లు తీరుతాయా ? అన్నది విశ్లేషకులు అంటున్న మాట..
ధరణి పోర్టల్ రెండు రోజుల్లో తన ఉనికిని కోల్పోతుంది.. గత ఎన్నికల ముందు ప్రస్తుత మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన విదంగా ఈనెల 14వ ప్రస్తుత ధరణిని బంగాళఖాతంలో కలిపేందుకు ప్రజా ప్రభుత్వం సిద్దమైంది. ఈనెల 14వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన భూభారతి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే దీనికి సంబందించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడంతో ఆ యాప్‌ను బుధవారం నాడు భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్.అంబేద్కర్ జయంతి రోజున ఈ పోర్టల్‌ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు నగరంలోని శిల్పకళా వేధిక సాక్షిగా నిలవబోతోంది… కాగా ఈమేరకు ప్రభుత్వం అధికారులకు అదేశాలు కూడా జారీ అయ్యాయి.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ధరణి యాప్‌ను తీసుకురావడం జరిగింది. దీని వల్ల రైతులకు సంబందించిన భూములు అన్యాక్రాంతం కాకుండా వుంటుందని చెపుకొచ్చారు. అదే విధంగా రైతు భూమికి సమగ్ర రక్షణ వుంటుందని ఉదరగొట్టారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల సమయంలో రైతులకు తెలియకుండా అతని భూమిని దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం వుండదని చెప్పడం జరిగింది. అయితే తీరా యాప్‌ను తీసుకువచ్చిన తరువాత మాత్రం రైతుల కష్టాలు తగ్గడం మాట అటు ఉంచితే రెట్టింపు అయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా ధరణి యాప్ ప్రారంభం అయిన నాటి నుండి నేటి వరకు కూడా ఇంకా చాలా మంది రైతులకు పాసు పుస్తకాలు రాక అనేక అవస్థలు పడుతున్నారు. కొంతమంది భూములు ఇతరుల పేర్లపైకి మారడంతో అనేక చోట్ల రైతులు నేటికి మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ధరణి యాప్ తీసుకువచ్చిన సమయంలో వివిధ భద్రతా ప్రమాణాలతో కూడిన నూతన పాస్ పుస్తకాలను కూడా అప్పటి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.
అయితే ఈ పాస్ పుస్తకాల జారీ సమయంలో ప్రభుత్వం భూసర్వే నిర్వహించి పాత పాస్ పుస్తకాల స్థానంలో కొత్త వాటిని ముద్రించడం జరిగింది. ఆ సమయంలో అధికారులు చేసిన పొరబాట్ల కారణంగా చాలా మంది రైతుల భూములు సాంకేతిక తపుల కారణంగా ప్రోహిబిటెడ్ ల్యాండ్స్, ప్రభుత్వ భూముల ఖాతాల్లోకి వెళ్ళిపోయ్యాయి. అదే విధంగా దశాబ్దాల కింద అమ్ముకున్న భూములకు కూడా కొత్త పట్టాదారులకు కాకుండా పాత పట్టాదారులకే పాస్ పుస్తకాలను ఇచ్చారు. దీంతో ఆ భూములను కొన్ని దశాబ్దాలుగా సాగుచేసుకున్న రైతులు తమ భూముల హక్కులను కోల్పోయారు. కొత్త పాస్‌పుస్తకాలు పొందిన పాత పట్టాదారులు నేరుగా భూ యజమానులుగా మారి భూమిపై పోజిషన్‌లోకి రావడంతో చాలా చోట్ల అనేక భూ వివాదాలు జరిగాయి. ప్రభుత్వం చేసిన తప్పులకు అనేక ప్రాంతాల్లో రైతులు కష్టాల పాలు అయ్యారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.. నిజమైన భూ యజమానులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అగత్యం ఏర్పడింది..
ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో హత్యలకు, ఆత్మ హత్యలకు దారి తీసిన దారుణ సంఘటనలు కూడా జరిగాయి.. కొంతమంది రైతులు కొన్న భూములనే మరోసారి వారి వారుసలకు పదో పరకో ఇచ్చి తిరిగి తమ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది. అదే సమయంలో చాలా చోట్ల వున్న ప్రభుత్వ భూములను కూడా అధికారులు, నాయకులు కుమ్మకై రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల ప్రభుత్వ భూములను ధరణిలో వున్న లోపాలను అసరాగా చేసుకుని పట్టా భూములగా మార్చారు. వీటిని తమకు సంబందించిన వారి పేర్ల మీదకు బదాలాయించుకుని లాభపడ్డారు. అలాగే ధరణి యాప్ తరువాత ప్రభుత్వం రైతు బంధు కూడా ఇవ్వడం కారణంగా ఇలాంటి ప్రభుత్వ భూములకు కూడా గత ప్రభుత్వం వేల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేసింది. ధరణి యాప్ రూపొందిస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగినట్లు చాలా సార్లు భయటపడిన విషయం తెలిసిందే. చాలా చోట్ల ఐఏఏస్ అధికారుల దగ్గర నుండి కిందిస్థాయి అధికారుల వరకు ఇలా వేల ఎకరాల భూములను అక్రమంగా బదాలాయించుకున్నట్లు నేటికి అనేక ఘటనలు వెలుగులోకి వస్తూనే వున్నాయి. అదే విధంగా రైతుల ఖాతాల్లో వున్న భూమిని తొలగిస్తూ చాలా ప్రాంతాల్లో రైతుల భూములను కూడా తగ్గించడం జరిగింది. ఇదేమని అడిగితే అక్కడ వున్న సమగ్ర భూ సర్వే చేసిన తరువాత మాకు వచ్చిన లెక్కల పక్రారమే నూతన పుస్తకాలలో భూముల వివరాలను ఎక్కించడం జరిగిందని చెప్పి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇలా తమ పేరుమీద వున్న భూమి ఎలా తగ్గించారో కూడా రైతులు ఎవరిని అడగాలో కూడా దిక్కుతోచ్చని స్థితిలో వుండిపోయారు. చివరకు చాలా మంది రైతులు తమ పాస్ పుస్తకాలలో వున్న పొరపాట్లను సరిచేయాలని మండల, కలెక్టర్ కార్యాలయాల చుట్టు తిరిగి తిరిగి అలిసి వేసారిపోయినా సరే వారి కష్టాలు మాత్రం తీరలేదు. రైతుల ఇబ్బందులను అసరాగా చేసుకుని మద్యవర్తులు, ప్రభుత్వ అధికారులు డబ్బులు దండుకుని ఇష్టానుసారంగా భూములలో మార్పులు చేశారు. రైతుల అమాయకత్వాన్ని చాలా మంది నాయకులు సొమ్ము చేసుకున్నారనే చెప్పాలి. వీటన్నింటిని గుర్తించి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి యాప్‌ను పూర్తిగా తొలగించి దాని స్థానంలో భూభారతి పేరుతో నూతన యాప్‌ను తీసుకువస్తామని ప్రస్తుత సీఎం.రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు.
ప్రస్తుతం ఆదిశగా ఇప్పటికే ధరణిలో పలు కీలక మార్పులు తీసుకురావడం కూడా గమనించాం. ఇపుడు ఏకంగా వారు ముందుగా ప్రకటించిన విధంగా ధరణి స్థానంలో నూతన భూభారతి యాప్‌ను తీసుకురావడంతోనైనా తమ కష్టాలు తీరుతాయా..? అనే దిశగా రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి కొత్త ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ యాప్‌లో రైతులకు సంబందించిన భూములకు సమగ్ర వివరాలు పకడ్బందీగా వుంటాయా..? లేక గతంలో మాదిరిగా మరోసారి కష్టాలు పడాల్సి వస్తుందా అనే మీమాంసలో రైతులు వున్నారు. ముఖ్యంగా ప్రోహిబిటెడ్‌లో వున్న వేలాది ఎకరాల రైతుల భూములకు ఇప్పటికైనా మోక్షం లభించి రైతులకు ఆ భూములు అందుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.. రైతులు, మేధావులు అనేక మందిలో మెదులుతున్న అనేక ప్రశ్నలకు 14వ తేదిన అమలుల్లోకి రానున్న భూభారతి పోర్టల్ సమాధానం చెప్పనుంది. చూద్దాం ఏడాదిన్నర పాలనలో అనేక విమర్శలు, అనేక ప్రశంసలు మూటగట్టుకున్న రేవంత్ ప్రభుత్వం భూ భారతి ద్వారా ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో..? రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడా..? లేక చరిత్ర హీనుడిగా వార్తల్లో నిలిచిపోతాడా కాలమే నిర్ణయించాలి… వెయిట్ అండ్ సీ..