అబిడ్స్ లిటిల్ ప్లవర్ స్కూల్ లో కేజీ సెక్షన్ కు రూ.50వేల పైనే
- క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్ లో ఫీజుల మోత
- హైదరాబాద్ లో ప్రైవేటు పాఠశాలల దోపిడి
- సేవ పేరుతో చదువు భారం చేస్తున్న యాజమాన్యం
- అధిక ఫీజులతో పేద, మధ్య తరగతి పేరెంట్స్ కు కన్నీళ్లు
- టీచర్స్ కు అంతంత మాత్రంగానే సాలరీలు
- బుక్స్ పేరుతో అధనపు వసూళ్లు
- విద్యాశాఖకు సబ్మిట్ చేయని ఆడిట్ రిపోర్ట్
- ప్రేక్షకపాత్రలో విద్యాశాఖ అధికారులు
తెలంగాణలో స్కూల్ ఫీజులు మోత మోగిపోతున్నాయి. నేటి తరం పిల్లలు చదువుకున్నట్టు లేదు.. చదువు కొనుక్కునేటట్టు అనిపిస్తోంది. కార్పోరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఎల్ కేజీ, యూకేజీ సెక్షన్లకు వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ మైనార్టీ స్కూల్ లో వేలల్లో డోనేషన్లు, ఫీజులు పెట్టడంతోపాటు హైదరాబాద్ లో ఉన్న స్కూల్స్ లో అధిక ఫీజులతో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్ లో అయితే అధిక భారం పడుతోంది. అబిడ్స్ లోని లిటిల్ ప్లవర్ స్కూల్ లో కేజీ సెక్షన్ కు రూ.50వేలకు పైనే ఫీజు వసూలు చేయడం గమనార్హం. క్రైస్తవ మిషనరీ స్కూల్స్ ను పేదల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ పాఠశాలలో ఫీజుల మోత మోగిపోతుంది. సేవ పేరుతో నిరుపేదలకు చదువు భారం చేస్తున్నది యాజమాన్యం. విద్యాహక్కు చట్టం ప్రకారం నడచుకోకుండా అధిక సంఖ్యలో విద్యార్థులను జాయిన్ చేసుకోవడం, టీచర్లకు సరైన జీతాలు ఇవ్వకపోవడంతోపాటు ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్ చేస్తుంది స్కూల్ యాజమాన్యం.
హైదరాబాద్ లోని అబిడ్స్ లోని లిటిల్ ప్లవర్ స్కూల్ లో అరాచకాలు ఎక్కువైపోతున్నయి. ఫీజుల మోత మోగిపోతుంది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు రూ.60 వేలకు పైగా, ఏడు నుంచి పదో తరగతి వరకు కూడా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోవైపు బుక్స్ పేరుతో అధనంగా డబ్బులు వసూలు చేస్తూ యాజమాన్యం పేరెంట్స్ ను పట్టిపీడిస్తున్నాయి. అంతేకాకుండా ఈ స్కూల్ లో పిల్లలకు ట్రాన్స్‌పోర్టు లేకపోవడం.. బయట ప్రైవేటు ఆటోలు, ఇతర వెహికిల్స్ ను ఆశ్రయిస్తుండడంతో మరో రూ. 15,000 నుంచి రూ.20,000 వరకు దండుకుంటున్నారు. స్కూల్ యూనిఫామ్, టై బెల్టులకు అదనం పైసలు వసూలు చేస్తూ యాజమాన్యం దండుకుంటుంది. వాటితోపాటు డిజిటల్ క్లాస్‌లు, ఆటల పోటీలు, డ్యాన్స్, సైన్స్‌ల్యాబ్, లైబ్రరీలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అడ్డూఅదుపు లేకుండా జరుగుతున్న విద్యావ్యాపారాన్ని అరికట్టడంతో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి.
పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఫీజుల రూపంలో రూ. లక్షకుపైగా వసూలు చేస్తున్నా.. సౌకర్యాలు మాత్రం నామమాత్రమే. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులుండరు. ఒక్కోతరగతి గదిలో నలుబై మందికి పైగా విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి సరైన అనుమతి లేకుండానే కొన్ని స్కూళ్లను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాఠశాలల్లో వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వంటివాటిపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. నేతిబీరలో నెయ్యీ లేదు’ అన్నట్టు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అని పెద్ద చదువులు చదివిన టీచర్లను రిక్రూట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వక పోవడం గమనార్హం. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికి వారికీ జీతాలు తక్కువగా చెల్లిస్తున్నారు.
మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిబంధనల ప్రకారం క్లాసుకు ఇంతమంది పిల్లలు మాత్రమే ఉండాలని లిమిట్ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఎక్కువ సంఖ్యలో చిన్నారులను చేర్చుకొని విద్యను వ్యాపారం చేసుకుంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి ప్రవేశాల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అదేవిధంగా 10వ తరగతి వరకు 5శాతం పేదలకు ఫ్రీ సీట్లు ఇవ్వాలి. సెక్షన్-23 ప్రకారం ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అలాగు సెక్షన్-25 ప్రకారం షెడ్యూల్‌లో నిర్ధారించిన విధంగా విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది విద్యాశాఖకు ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ లిటిల్ ప్లవర్ స్కూల్ యాజమాన్యం మాత్రం అలా చేయడం లేదు. అయినా విద్యాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ‘తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు’ అన్నట్టుగా కార్పోరేట్ స్కూల్స్ వ్యవహరిస్తున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తూ నిరుపేద తల్లిదండ్రులను ఘోస పెడ్తున్నాయి.
ప్రైవేట్ పాఠశాలలు పెద్ద ఎత్తున ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తూ సామాన్యులను ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ స్కూళ్లు ఫీజులను నియంత్రించి డొనేషన్లూ తగ్గించాలి. క్వాలిఫైడ్ టీచర్లు లేకుండా, ఉన్నా వారికి కనీస జీతాలు ఇవ్వక నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి స్కూల్స్ పై ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు