Sunday, November 10, 2024
spot_img

హైడ్రాను కట్టడి చేయండి

Must Read
  • అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి పళ్లం !
    – హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను పక్కనబెట్టాలని డిమాండ్
    – పళ్లం రాజు తీరుపై రాష్ట్ర నేతల్లో అసంతృప్తి
    – హైడ్రాపై వస్తున్న ఆదరణను చూసి ప్రధాన ప్రతిపక్షం సైలెంట్
    – ఎంట్రీ అయితే తీవ్ర వ్యతిరేకత రావచ్చనే అంచనాలో ప్రభుత్వ పెద్దలు

హైడ్రా…! కబ్జాలదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనం అవుతుంది. భూబకాసురులూ కబ్జాదారుల గుండెల్లో దడపుట్టిస్తోంది. ప్రజాసేవే జీవిత లక్ష్యమని, ప్రజల కోసమే పుట్టిన నాయకులం అన్నట్లుగా పోజులు కొట్టి అమాయకత్వం నటించే నంగనాచి నేతల అక్రమాల దందాను కూకటివేళ్లతో పెకిలించేస్తోంది! ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ ఎరుగని విధంగా అక్రమ నిర్మాణాలను నిట్టనిలువునా కూల్చేస్తూ హైడ్రా కొత్త చరిత్ర లిఖిస్తోంది. చెరువులు, రిజర్వాయర్లు, బఫర్ జోన్లు, కన్సర్వేషన్ జోన్లు, నాలాలు ప్రభుత్వ స్థలాలు! ఒక్కటేమిటి ఎక్కడైతే నిర్మాణాలు చేయకూడదని ప్రభుత్వం కట్టుబాటు చేసిందో అక్కడే ఇష్టారాజ్యంగా ఎకరాలు ఎకరాలు ఆక్రమించి, రాజకీయ పలుకుబడి, రౌడీయిజమే పెట్టుబడిగా తమ ఆక్రమణల వైపు ఎవ్వరూ కన్నెత్తి చూడకుంటా వ్యవస్థలను మ్యానేజి చేస్తూ వచ్చిన భూబకాసురులు ఇపుడు హైడ్రా దూకుడుకు బెంబేలెత్తిపోతున్నారు. హోదా, స్థాయి మరిచి.. తమకు బయట ప్రపంచంలో ఉన్న మంచి పేరును కూడా వదిలేస్తూ. హైడ్రాను అడ్డుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను పక్కనబెట్టాలని, తమ అక్రమ వ్యవహారాలకు అడ్డు తగలకుండా చూడాలని అధిష్టానం దగ్గరికి వెళ్లి కాళ్ళా వెళ్ళా పడుతున్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. పాతబస్తీ అడ్డాగా ఉన్నా పార్టీ ఎమ్మెల్యేలు హైడ్రా దెబ్బకు బెంబేలెత్తిపోయి.. పసలేని ఆరోపణలతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొన్న ఒక ఎమ్మెల్యే హైడ్రా కమిషనర్ సంగతి తెలుస్తా అంటూ తొడగొట్టగా… తాజాగా ఒక హోదా గౌరవం ఉన్నట్లు కనిపించే కేంద్ర మాజీ మంత్రి హైడ్రాను కట్టడి చేయాలనీ, లేదంటే కమిషనర్ ను అక్కడినుండి తప్పించాలని ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. బడా నాయకుడు కావడంతో అధిష్టానం ముఖ్య నేత కూడా హైడ్రాపై ఏదో ఒకటి చేయాలంటూ ముఖ్యమంత్రికి సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.

పేరుగొప్ప నాయకుడి అక్రమాలు.!

పళ్లం రాజు.. తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఒకసారి రక్షణశాఖ సహాయ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన పదవులు నిర్వహించారు. రాజకీయ నేపథ్యం ఉన్న ఉన్నత స్థాయి సంపన్న కుటుంబం నుండి రాజకీయాల్లో ప్రవేశించిన వ్యక్తి పళ్లం రాజు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ కాంగ్రెస్ పార్టీలో కూడా అత్యంత పలుకుబడి కలిగిన నేత! అలాంటి స్థాయి కలిగిన నాయకుడు ఇపుడు హైడ్రాను అడ్డుకోవాలంటూ పార్టీ ముఖ్య నేతల వద్ద ప్రాధేయపడుతున్నట్లు తెలుస్తోంది. అయన దక్షిణాదిలో ఒక పలుకుబడి కలిగిన నేత కావడంతో ఏకంగా రాహూల్ గాంధీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆదివారం గండిపేట, చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అదే సమయంలో రోజంతా ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. హైడ్రా సిబ్బంది కూల్చివేతలు మొదలవ్వగానే రాష్ట్ర ముఖ్యనేతపై ఒత్తిడి మొదలైనట్లు తెలిసింది. అయితే ఇక్కడ పెద్దగా స్పందన లేకపోవడంతో పళ్లంరాజు నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలను సంప్రదించినట్లు తెలిసింది. పళ్లంరాజు నుండి ఒత్తిడి తీవ్రం కావడంతో రాహుల్ గాంధీ నేరుగా జోక్యం చేసుకొక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. హైడ్రా విషయంలో ఏదో ఒకటి చేయాలని. కమిషనర్ ను తప్పించే విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యనేతకు ఆయన సూచించినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు, గౌరవం ఉన్న నాయకుడు ఇలా అక్రమ నిర్మాణాలను కూల్చివేతలపై యాగీ చేస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా బిగ్ బాస్ ఆదేశించడంతో హైడ్రాపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ముఖ్యనేతకు ఏర్పడిందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కట్టడి చేస్తే కష్టాలే.!

హైడ్రా కేవలం రోజుల వ్యవధిలోనే గొప్ప పేరు సంపాదించింది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ బడా బాబుల అక్రమాలను కూడా కూకటి వేళ్ళతో కూల్చేస్తూ హైడ్రా ముందుకు వెళుతున్న తీరుపై సామాన్య ప్రజల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియా లో కూడా హైడ్రాపై నెటిజన్లు పూర్తి మద్దతూగా నిలుస్తూ దమ్మున్న సంస్థగా కీర్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మంచి పేరు వస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్న అద్భుత నిర్ణయం హైడ్రా ఏర్పాటు అంటూ ప్రజల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రాకు ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి ప్రధాన ప్రతిపక్షం కూడా ఆచితూచి స్పందిస్తోంది. తమ పార్టీకి చెందిన నేతల అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు గురవుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రా ను నిర్వీర్యం చేసే ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి భంగపాటు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైడ్రా ను కట్టడి చేసినా… లేదంటే కమిషనర్ రంగనాథ్ ను తప్పించినా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావచ్చనే అంచనాలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అదీ కాకుండా ప్రధాన ప్రతిపక్షం సహా ప్రతిపక్షాలన్నీ ముప్పేట దాడి చేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రజలనుండి వస్తున్న ఆదరణ.. మరోవైపు జాతీయ పెద్దల నుండి వస్తున్న ఒత్తిడితో ఎటూ పాలుపోని పరిస్థితి ప్రభుత్వ పెద్దలకు నెలకొన్నట్లు తెలుస్తోంది. తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా ఉందని, ఏదో ఒక నిర్ణయం మాత్రం తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి మాత్రం ఉందని అధికారపార్టీకి చెందిన ముఖ్యనాయకుడొకరు అంతర్గత చర్చలో ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS