-ప్రభుత్వ టీచర్ల పంచాయతీలోకి చొరబడ్డ పోలీసులు..
-మండల విద్యాశాఖ అధికారి కోరిండని..ఓ ఉపాధ్యాయుని పర్సనల్ కాల్ డేటాను ఎమ్.ఈ.ఓకు అప్పగించిన పోలీసులు
- ఎలాంటి కేసులు నమోదు కాకుండా టీచర్ వ్యక్తిగత కాల్ డేటాను నలగొండ పోలీసులు ఎలా తీశారు.?
- సంబంధిత సి.డి.ఆర్ రిపోర్టును అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ కు యత్నించిన అధికారి
- సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు అడిగిన టీచర్ పై కక్ష తీర్చుకున్న ఎం.ఈ.ఓ వైనం!
- ఆలస్యంగా వెలుగు చూసిన నల్లగొండ పోలీసుల ఘనకార్యం..
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆయనొక ఉపాధ్యాయుడు. ఈ మధ్యనే ఆయన ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందాడు. కేవలం టీచర్ గానే కాకుండా సామాజిక అంశాలు, అన్యాయాలపై గళమెత్తాలనే అభిప్రాయం కలిగిన వ్యక్తిత్వమే ఆయనకు శాపంగా మారింది. విద్యాశాఖలో తమ పైఅధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే చూస్తూ ఉండలేక ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా, సమాచార హక్కు చట్టమే అస్త్రంగా కొన్ని అవినీతి వ్యవహారాలను ఆధారాలతో సహా బయటికి లాగే ప్రయత్నం చేశాడు. దీనితో మండల, జిల్లా విద్యాశాఖలోని కొంతమంది అధికారులకు ఈయన కంట్లో నలుసుగా తయారయ్యాడు. ఎక్కడో మారుమూల మండలంలో పాఠాలు చెప్పుకునే సాధారణ టీచర్ తమను ప్రశ్నించడం ఏంటని.! భావించిన విద్యాశాఖలోని పలువురు అధికారులు అందరూ కలిసి కుమ్మక్కై, ఆ ఉపాధ్యాయుడిని ఎలాగైనా కట్టడి చేయాలనే పథకం వేశారు. అందుకు జిల్లాలో తమకు ఉన్న పలుకుబడిని పణంగా పెట్టి, పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇతన్నీ నోరు మెదపకుండా చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు పథకం రచించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఐ.నాగయ్య గడచిన 2019 నుండి కళా శ్రీనివాస్ అనే ప్రభుత్వ టీచర్ నకిలీ కుల ధ్రువీకరణతో ఉద్యోగం పొందిన విషయంలో విరామం లేని పోరాటం చేస్తున్నారు. ఈ విషయమై గడిచిన జూలై 27న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నకిలీ కుల ధ్రువీకరణ ఉద్యోగంపై ఉన్నతాధికారుల విచారణ జరిగింది. ఈ విచారణ ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, గడచిన 2018-19లో మిధాని (మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్) సంస్థ సి.ఎస్.ఆర్ నిధుల క్రింద వెనుకబడిన మండలాలలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు 1209 ఖరీదైన డిస్క్ బెంచీలను ఉచితంగా పంపిణీ చేసింది. చింతపల్లి మండలం కురుమేడు జిల్లా పరిషత్ పాఠశాలకు 35, మర్రిగూడ మండలానికి 974, మునుగోడు మండలం వెల్మకన్నె జిల్లా పరిషత్ పాఠశాలకు 10, నారాయణపూర్ మండలం సర్వేల్ పాఠశాలకు 10, నారాయణపూర్ జిల్లా పరిషత్ పాఠశాలకు 45 కాగా, చండూరు జిల్లా పరిషత్ పాఠశాలకు 63 చొప్పున మిధాని సంస్థ ఈ డెస్క్ బెంచీలను ఉచితంగా పంపిణీ చేసింది.
అయితే నాడు మర్రిగూడ మండలానికి విద్యాశాఖ ఇన్ ఛార్జ్ అధికారిగా(ఎమ్.ఈ.ఓ) విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడైన సుధాకర్ ఎమ్.ఈ.ఓ హోదాలో ఉన్నందున మిధాని సంస్థ ఇచ్చిన సదరు డెస్క్ బెంచీలను తన సొంత ప్రాంతమైన గరిడేపల్లి మండలం, పొనుగోడు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలకు 39, మండల పరిషత్ పాఠశాలకు 33 డెస్క్ బెంచీలను తరలించి, తన నాయనమ్మ స్మారకం పేరు మీద అక్కడ తానే ఈ 72 బెంచీలను ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నట్లు ఆరోపణ. అంతేకాకుండా ఇదే మిధాని సంస్థ చండూరు జిల్లా పరిషత్ పాఠశాల కొరకు ఇచ్చిన 63 డెస్క్ బెంచీలను కూడా ఇన్ ఛార్జ్ ఎం.ఈ.ఓ సుధాకర్ మాయం చేశారనే అభియోగాలపై సహచర టీచర్ అయిన నాగయ్య ఉన్నతాధికారులకు, మిధాని సంస్థకు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి నేటి వరకు కూడా చండూరు పాఠశాలకు ఇచ్చిన సదరు 63 డెస్క్ బెంచీలు ఆ పాఠశాలకు చేరలేదని తెలుస్తోంది.
జరిగిన ఈ తతంగంపై ఉపాధ్యాయుడు నాగయ్య చేస్తున్న పోరాటం నాటి స్థానిక ఎం.ఈ.ఓకు నచ్చలేదు. జిల్లా విద్యాశాఖ అధికారుల సహకారంతో నాగయ్యకు ఎలాగైనా చెక్ పెట్టాలనే ఆలోచనలో భాగంగా ఆయన వాడుతున్న రెండు పర్సనల్ ఫోన్ నెంబర్లపై అనధికారికంగా పోలీసులతో సి.డి.ఆర్ (కాల్ డీటెయిల్ రికార్డింగ్) తెప్పించుకున్నారు. ఇక్కడే అందరికీ అనుమానం మొదలవుతోంది. కేవలం ఒక మండల ఎంఈఓ తన సహచర టీచర్ కు చెందిన సి.డి.ఆర్ రిపోర్టు కావాలని జిల్లా పోలీసులను కోరడం, నాటి (2019) జిల్లా పోలీస్ సూపరిండెంట్ అధికారికి లేఖ రాసిన వారం రోజుల్లోనే జిల్లా పోలీస్ కార్యాలయం నుండి నాగయ్య టీచర్ కు చెందిన రెండు మొబైల్ నెంబర్ల సి.డి.ఆర్ రిపోర్టును సంబంధిత ఎంఈఓ సుధాకర్ కు జిల్లా ఎస్పీ పేరున పంపించడం జరిగింది. (సంబంధిత లేఖ సి.నెం.08/ఐటిసిటి-ఎన్.ఎల్.జి/2019, తేది.04-04-2019)
ఎలాంటి కేసులు నమోదు చేయకుండానే వ్యక్తిగత సి.డి.ఆర్ రిపోర్టును పోలీసులు తీయవచ్చునా..?
పోలీసులు ఒక వ్యక్తికి చెందిన పర్సనల్ కాల్ డీటెయిల్స్ రికార్డులను (సి.డి.ఆర్) ఇతరులకు ఇవ్వడం అనేది నిబంధనలకు, చట్ట విరుద్ధమైనది కూడా. ఒకరి కాల్ డీటెయిల్స్ బయటికి తీయాలంటే, సదరు వ్యక్తిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు అయి ఉండాలి. లేదా వారి రక్షణ నిమిత్తం కొరకు పోలీసులు వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా
సిడిఆర్ రిపోర్టు సేకరించే అవకాశం ఉంటుంది. విషయం ఏదైనా సరే ఎఫ్.ఐ.ఆర్ లేకుండా జిల్లా పోలీస్ అధికారులు ఎవరి సిడిఆర్ రిపోర్టుకు అనుమతించరు. కొన్నిసార్లు కోర్టు అనుమతి పొందిన తర్వాత గాని సిడిఆర్ తీయాల్సి ఉంటుంది. మరి ఇంత పగడ్బందీగా వ్యవహరించే పోలీసులు ఒక సాధారణ మండల విద్యాశాఖ అధికారి అడిగిన వెంటనే నిబంధనలను తుంగలో తొక్కి, ఒక ప్రభుత్వ టీచర్ కు చెందిన పర్సనల్ సిడిఆర్ రిపోర్టులను బయటికి తీసి, పాస్ వర్డ్ తో సహా ఒక సీడిని సంబంధిత ఎమ్.ఈ.ఓకు ఏ విధంగా పంపారు అనేది ఇక్కడ చర్చ. ఈ విషయం పాతదే అయి ఉండొచ్చు కానీ, ఇలా పర్సనల్ జీవితాలతో చెలగాటం ఆడుతున్న విద్యాశాఖ అధికారులు, పోలీసుల వ్యవహార శైలి ప్రజలకు తెలియజేయడం పత్రికలు, మీడియా బాధ్యత.
సి.డి.ఆర్ రిపోర్టును అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్..!
జిల్లా పోలీసులు ఇచ్చిన సంబంధిత తన సీ.డి.ఆర్ రిపోర్టును అడ్డం పెట్టుకొని నాటి ఎంఈఓ సుధాకర్ తనని విపరీతంగా వేధించేవాడని టీచర్ నాగయ్య ఆదాబ్ కు తెలిపారు. వీళ్ళ అవినీతి అక్రమాలను వెలికితీస్తున్నందునే తనపై కక్షగట్టి, చట్ట వ్యతిరేకంగా నా వ్యక్తిగత కాల్ డేటాను తెప్పించుకొని తనని పలు రకాలుగా నాటి ఎంఈఓ సుధాకర్ బ్లాక్ మెయిలింగ్ కు తెగబడ్డారని నాగయ్య వాపోయారు. గతంలో జరిగిన ఈ విషయం పై ప్రస్తుత జిల్లా ఎస్పీ విచారణ చేసి, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీచర్ నాగయ్య ఎస్పీని కోరుతున్నారు. తద్వారా దీని వెనకాల ఉన్న విద్యాశాఖ అధికారులు, వీరికి సహకరించిన పోలీసులు ఎవరో తేలిపోనుందని బాధిత టీచర్ నాగయ్య ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నారు. తనలాగా ఇంకెవరికి ఇలాంటి అన్యాయం జరగరాదని ఆయన కోరుకుంటున్నాడు.
అవును నేనే సిడిఆర్ రిపోర్ట్ తెప్పించాను: నాటి ఎమ్.ఈ.ఓ సుధాకర్ వివరణ
పాఠశాల సమయంలో నాగయ్య అనే టీచర్ ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతున్నాడని స్థానిక మర్రిగూడ గ్రామస్తులు నాకు ఫిర్యాదు చేయడం వలనే తాను పోలీసులకు ఫిర్యాదు చేసి, జిల్లా పోలీసుల ద్వారా టీచర్ నాగయ్య పర్సనల్ సి.డి.ఆర్ రిపోర్టు తనిఖీ నిమిత్తం తెప్పించుకున్నట్లుగా సుధాకర్ “ఆదాబ్” కు వివరణ ఇవ్వడం గమనార్హం.