Friday, September 20, 2024
spot_img

‘నవ’తరానికి బోధనాంశంగా బోవెరా జీవిత చరిత్ర

Must Read

( 02 సెప్టెంబర్‌ “బోయినపల్లి వెంకట రామారావు – తోటపల్లి/కరీంనగర్ గాంధీ” 104వ జన్మదినం సందర్భంగా )

ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిన పోరాట అగ్ని కణం,నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన వీర సింహం,సాంఘీక దురాచారాల బద్ద వ్యతిరేకి,తొలి సంచార గ్రంధాలయ స్థాపకుడు,‘విశ్వబంధు’గా పేరుగాంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి బోయినపల్లి వెంకట రామారావుకు ప్రజలిచ్చిన ఆత్మీయ నామం ‘తోటపల్లి గాంధీ లేదా కరీంనగర్‌ గాంధీ’.సాహిత్య రంగంలో పట్టు సాధించిన ‘వచన రచన ప్రవీణ’/‘సాహిత్య బంధు’గా అనేక వేదికల్లో దేశాభ్యున్నతిని ఆకాంక్షించి అనేక సందేశాలిచ్చిన ‘ఉపన్యాస కేసరి’,దళితోద్ధారకుడైన ‘హరిజన బంధు’, నేటి యువతకు దేశభక్తిని పరిచయం చేస్తున్న ‘యువజన బంధు’గా పేరుగాంచిన ప్రఖ్యాత ‘గాంధేయవాది’ మన బోవెరా. నరనరానా గాంధీ భావజాలాన్ని నింపుకొని జీవితాంతం ఖద్దరు వస్త్రాలు/నెత్తిన టోపీ ధరించి అహింసయే పరమోధర్మమని నమ్మిన అతి సామాన్య జీవితం గడిపిన ‘అసామాన్యుడు’ మన కరీంనగర్‌ గాంధీ. శాకాహారిగా జీవితాన్ని గడిపిన ‘ధీనజనోద్ధారకుడు’ మన బోవెరా. తుది శ్వాస వరకు భరతమాత సేవలో తన జీవితాన్ని అర్పించిన త్యాగశీలి, నాయకత్వ లక్షణాలు జీర్ణించుకున్న ‘సర్వోదయ సిద్ధాంత హితవరి’. వితంతు వివాహాలను ప్రోత్సహించిన బోవెరా జీవితం ఆసాంతం భరతమాత సేవకే అంకితం అయ్యింది.

తోటపల్లి తోటలో బిరబూసిన బహుముఖ ప్రజ్ఞా పుష్పం:

నాటి పూర్వ కరీంనగరం జిల్లా బెజ్జంకి మండలం (నేటి సిద్ధిపేట జిల్లా) కొత్తపల్లి గ్రామంలో 02 సెప్టెంబర్‌ 1920 రోజున బోయినపల్లి రంగమ్మ-కొండాల్‌ రావు దంపతులకు జన్మించిన బోయినపల్లి వెంకట రామారావు (బోవెరా) త్యాగమయ స్ఫూర్తివంతమైన జీవితం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నది. తోటపల్లిలో పాఠశాల విద్య, కరీంనగర్‌లో ఉన్నత విద్య అభ్యసించిన బోవెరా జీవితం ఆసాంతం దేశానికే అంకితం అయ్యింది. ‘ఆర్య సమాజ్‌’ ప్రేరణతో ‘క్విట్‌ ఇండియా ఉద్యమం’లో చురుకుగా పాల్గొని స్వాతంత్ర్య పోరాటంలో కదం తొక్కిన బోవెరా మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొని వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన కారణంగా ఆయన సర్వోత్తమా వ్యక్తిత్వానికి మెచ్చిన పౌర సమాజం గౌరవ సూచకంగా ఆయనను “తోటపల్లి గాంధీ లేదా కరీంనగర్ గాంధీ” అని కూడా పిలవడం జరుగుతున్నది. స్వాతంత్ర్య పోరాటంతో పాటు భూదాన్‌, గ్రామ స్వరాజ్, వందేమాతరం, గ్రంధాలయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని తన దేశభక్తిని, అంకితభావాన్ని చాటుకున్నారు. గాంధేయవాదిగా పేరుగాంచిన బోవెరా భూదానోద్యమంలో భాగంగా తన ఏడు ఎకరాల భూమిని సహితం పేదలకు వితరణ చేసిన ‘నిస్వార్థ సేవాతత్పరుడు’, ‘పరహిత ఆలోచనపరుడు’. కవి, రచయిత, సాహిత్యాభిమాని, సమాజ సేవకులు, చేతి వృత్తుల పరిరక్షణ ఉద్యమ కెరటం, గీత కార్మికుల పక్షపాతి, సంఘ సంస్కర్త, అంటరాన వ్యతిరేకి, సామాన్యల్లో అసమాన్యుడు “తోటపల్లి పచ్చటి తోటలో విరబూసిన బహుముఖ ప్రజ్ఞా పుష్పం” మన బోవెరా జీవితం ఆసాంతం ప్రజాహితం, నిత్య ప్రేరణం.

మహాత్మాగాంధీ ఆశయాలే ఊపిరిగా….:

1945లో ఓరుగల్లు రైల్వే స్టేషన్లో మహాత్మాగాంధీని కలిసిన బోవెరా ఆయన అనుచరుడిగా మారి జీవితాంతం అహింస, శాంతియుత సహజీవన పునాదులను ప్రచారం చేయగలిగారు. సత్యాగ్రహ ఉద్యమాన్ని నమ్మిన తోటపల్లి గాంధీ అవిశ్రాంతంగా రాత్రి బడులు అనేకం నడుపుతూ గ్రామీణ స్త్రీ పురుష వయోజనులకు అక్షర జ్ఞానం నేర్పించే మహత్తర కార్యాన్ని కొనసాగించారు. వలస పాలనకు వ్యతిరేకంగా పోరు చేస్తూనే పలుమార్లు జైలుపాలుకావడం, చిత్రహింసలకు గురి కావడం కూడా జరిగింది. తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనను వ్యతిరేకిస్తూ సహాయ నిరాకరణ, పన్నులను చెల్లించక పోవడం లాంటి ప్రతిఘటనలు ప్రదర్శించి తన జీవిత లక్ష్యాన్ని రుజువు చేసుకున్నారు. నాటి సాంఘీక దురాచారాలైన వెట్టిచాకిరీ, బాల్య వివాహాలు, కుల వ్యవస్థ, వరకట్నాలకు వ్యతిరేకంగా కత్తిదూస్తూ తన సామాజిక కర్తవ్యాన్ని/బాధ్యతను చాటుకున్నారు.ఆగష్టు 2014లో ఢిల్లీలో నిర్వహించిన క్విట్‌ ఇండియా వేడుకల్లో పాల్గొని తిగిగి రైలులో వస్తున్న సందర్భంగా జారి పడగా తుంటి ఎముక విరిగి బెడ్‌కు పరిమితమయ్యారు.నిస్వార్థ జీవితానికి నిర్వచనంగా నిలిచిన మన కరీంనగర్‌ గాంధీ 27 అక్టోబర్‌ 2014 రోజున అమరత్వం పొందారు. అతి సాధారణ జీవితం గడుపుతూ,కాలి నడకకు ప్రాధాన్యమిచ్చే ఆదర్శమూర్తి బోవెరా భౌతికంగా మనకు దూరమైనా ఆయన పాటించిన సుసంపన్న జీవన విలువలు నేటి యువతకు,పౌర సమాజానికి దారి దీపంగా నిలుస్తున్నాయి.తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాల్లో చురుకైన పాత్రను పోషించిన బోవెరా పుస్తకాలను అమితంగా ప్రేమించే విలక్షణుడు.

అనేక సంస్థలతో పెనవేసుకున్న అనుబంధం:

సర్వోదయ మండలి రాష్ట్ర/జిల్లా అధ్యక్షుడు,స్వాతంత్ర్య సమరయోధుల సంఘం రాష్ట్ర భాద్యులు, రాష్ట్ర/జిల్లా గ్రంధాలయ పాలక మండలి సభ్యుడు, గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు, అఖిల భారత సర్వస్వాన్ని సంఘం సభ్యుడు, హిందీ ప్రచార సభ రాష్ట్ర బాధ్యులు,మధ్య నిషేధ సంఘ అధ్యక్షుడు, కరినగరం గ్రంధాలయ సంఘం అధ్యక్షుడిగా బహుముఖ బాధ్యతలను భుజాన వేసుకున్న బోవెరా కరినగరం నడి బొడ్డున జిల్లా గ్రంధాలయ ఏర్పాటులో ప్రధాన భూమికను నిర్వహించారు. కరీంనగర్‌లో సారస్వత జ్యోతి మిత్ర మండలి వేదిక ద్వారా అనేక తాళపత్ర గ్రంధాలు, లిఖిత ప్రతులను సేకరించి రాష్ట్ర ప్రాచ్య లిఖిత లైబ్రరీకి బహుకరించిన మహానుభావుడు మనందరి మార్గదర్శి బోవెరా.

తొమ్మిది పదుల జీవితంలో కూడా దేశం కోసం అహరహం తప్పించిన నిగర్వి, నిర్మల మనస్కుడు, కణకణాన దేశ భక్తిని నింపుకున్న స్వచ్ఛమైన ‘భారతీయుడు’ మన బోవెరా.బోయినపల్లి వెంకట రామారావు మచ్చలేని మహోన్నత వ్యక్తిత్వం నేటి ‘నవ’తరానికి జీవిత పాఠమే కాదు దారి దీపం కూడా కావాలని ఆశిద్దాం.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This