- తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్నగర్
ఇంచార్జీ బండి సుధాకర్
తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంపదను దోచుకుందాని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్నగర్ ఇంచార్జీ బండి సుధాకర్ విమర్శించారు. రాష్ట్ర సంక్షేమాన్ని మరిచి బీఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నెరవేర్చుతూ ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రంగాల సంక్షేమం కోసం రూ. 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికె దక్కుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 07, 2023న ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి, రబీ సీజన్ లో మొదటి ఆరు నెలల్లోనే రూ.7600 కోట్లు జమ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం రాష్ట్రంలోని 26 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతు బిడ్డ అని నిరూపించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 50 లక్షల గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని అన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.10 లక్షల ఆరోగ్య భీమా, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్, యువత నైపుణ్యానికి స్కిల్ యూనివర్సిటీ లాంటి ఎన్నో కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి హైడ్రా, మూసి ప్రక్షాళన, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, ధరణి ప్రక్షాళనతో భూ సమస్యలు పరిష్కారం, విద్యార్థులకు మేస్ చార్జీలు పెంచడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం, సచివాలయంలో తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాలలో అభివృద్ది చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు మాత్రం ఓర్వలేక, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు ప్రతిపక్షల ఉచ్చులో పడొద్దని తెలిపారు.