భారతదేశ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో షెడ్యూల్ కులాలను అట్టడుగునకు నెట్టారు. వీరంతా మానవ హక్కులు నిరాకరించబడి అస్పృశ్యత, అంటరానితనాన్ని అనుభవించారు. దళిత ఉన్నతకై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. షెడ్యూల్డ్ కులాల్లో 59 ఉపకులాలున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ లలో అత్యధికంగా ఉన్న కులం మాదిగ, తరువాత మాలలు కాగా… అల్ప సంఖ్యలో మిగతా కులలున్నాయి. కానీ మాదిగలు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో వెనుకబడ్డారు. మెజార్టీ జనాభా గల మాదిగ కులానికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లలో తగిన వాటా దక్కకపోవడం ఒక కారణం. మాదిగలు అనాదిగా డప్పులు కొట్టడం, చెప్పులు కుట్టడం వంటి ఆత్మగౌరవం లేని వృత్తిని కులవృత్తిని చేపట్టడం మరో కారణం. దీంతో సామాజికంగా వెనకబడి ఊరికి దూరంగా నేట్టబడ్డారు. అయితే ఈ ప్రభావం మాలలపై లేకపోవడంతో చదువుకొని విద్య , ఉద్యోగాలలో కొంత ముందు వరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మాల, మాదిగల మధ్య అసమానతలేర్పడ్డాయి. ఈ క్రమంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా ఎస్సీ ఉపవర్గీకరణ కోసం పోరాటం ప్రారంభమైనది. ఈ వర్గీకరణ పోరాటానికి ఊపిరిలూదింది ఎమ్మార్పీఎస్(మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి). సుప్రీంకోర్టు సైతం గతేడాది ఎస్సి ఉపవర్గికరణ జరగాలని చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ వేసింది. కమిషన్ 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించి, వర్గీకరణను ప్రతిపాదించింది. దీంతో ప్రభుత్వం ఉప వర్గీకరణ కోసం తీర్మానం చేసింది. అయితే కమిషన్ అధ్యయనం జరుగుతున్న సమయంలోనే ఎమ్మార్పీఎస్ మాదిగల సాంస్కృతిక అస్తిత్వాన్ని చూపెట్టడానికి “లక్ష డప్పులు, వేయ్యి గొంతుకల” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈలోగా వర్గీకరణ సమస్య కొలిక్కి రావడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. కానీ, ఈ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ అధినాయకత్వం చెపుతుంది. ఈ నేపథ్యంలో లక్ష డప్పుల కార్యక్రమం, డబ్బులు కొట్టడం మన ఆత్మగౌరానికి ప్రతీక అవుతుందా అని పరిశీలించాల్సిన అవసరం ఉంది.
డప్పులు మాదిగల అస్తిత్వాన్ని పెంచుతాయా?
నేటి ఆధునిక యుగంలో సమాజం ఉన్నత చదువులు చదివి ముందుకు వెళ్తుంటే మాదిగ జాతి ఇంకా డప్పులు కొడుతూ ఆత్మగౌరవం లేని కళ ప్రదర్శన చేయాలనడం సబబేనా?. ఇప్పుడు ఈ జాతి బాగుకు కావాల్సింది ఏమిటిని ఒకసారి ఆలోచించాలి. మాదిగలకు జనాభా ప్రకారం విద్య, ఉద్యోగాలలో వర్గీకరణ వర్తింపచేయాలనడం కరెక్టే. ప్రభుత్వం సైతం వర్గీకరణకు సానుకూలంగా స్పందించప్పుడు లక్ష డప్పులతోని సాంస్కృతిక ప్రదర్శన చేస్తామనడం వెనక ఉద్దేశ్యం ఏమిటి?. ఇప్పటికే రాజకీయ సొయి లేకుండా కొందరు మాదిగలు ఆధిపత్య రాజకీయ పార్టీల మీటింగ్ లలో డప్పుల ప్రదర్శనలు ఇవ్వడం, పాటల పాడుతూ మన జాతి గౌరవాన్ని దిగదార్చుతున్నారు. నేటి కంప్యూటర్ యుగంలో మాదిగ సమాజం అనుసరించాల్సిన మార్గం ఇదేనా? ఒకసారి మేధావి వర్గం ఆలోచన చేయాలి. అసలు వర్గీకరణ కావాలా? వద్దా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు వర్గీకరణ చేయడానికి ముందడుగుపడుతుంటే, మాదిగలకు (10 శాతం బదులు 9 శాతం) ఒక శాతం తగ్గిందని వర్గీకరణ వ్యతిరేక శక్తులు మరోవైపు చర్చ పెడుతున్నారు. అంతేకాకుండా కమీషన్ ప్రతిపాదించిన కులాల వర్గీకరణలో మళ్లీ మార్పులు చేర్పులు చేయాలనీ కోరుతున్నారు. ఈ కారణంతో లక్ష డప్పుల కళ ప్రదర్శనను స్వాగతిద్దామా?. మన అస్తిత్వానికి ప్రతీకగా డప్పులే భావిస్తే అదే డప్పుని కొట్టుకుంటూ జీవిస్తే ఈ సమాజంలో మనకు విలువ ఉందా? అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇప్పుడిప్పుడే ఆధునికంగా ముందుకు పోతున్న మాదిగ జాతి యువకులకు లక్ష డప్పుల కార్యక్రమంతో గ్రామాలలో యువత మళ్లీ డప్పులు కొని, ఆట నేర్చుకునే పరిస్థితి ఏర్పడింది. పాటలతో కళాబృందాలు మోత మొదలైంది. ఇదే ఆట, పాట, డప్పులతో ఎన్ని రోజులు జీవిద్దామని ఒకసారి మాదిగ సమాజం ఆలోచించాలి. మరోవైపు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలనుకునే యువత డప్పులను నిరాకరిస్తే వ్యతిరేకిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే విషయంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజీగూడ గ్రామంలో ఓ మాదిగ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తూ ఊరిపెద్దలు తీర్మానం చేశారు. బీసీ కులస్తులే కాకుండా తోటి ఎస్సీ కులస్తులు కూడా ఈ ఘటనలో భాగస్వాములు కావడం కలకలం రేపింది. దీన్నిబట్టి మన అభివృద్ధిని మనం కూడా తెలుసుకోలేని అనాగరిక స్థితిలో ఉన్నామని అర్థమవుతుంది. అసలు డప్పులు కొట్టడం మన వృత్తా ? లేదా మనపై రుద్దడిందా అని ఒకసారి తెలుసుకోవాలి. ఈ అగౌరమైన వృత్తిని అగ్రవర్ణాలు మనకు ఆపాదించారని చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పుడు యువతకు డప్పు కొట్టడం మన సంస్కృతి కాదని నేర్పించి, దాన్ని ప్రోత్సహించడం మానేయాలి. అంతేకాకుండా డప్పుల వృత్తి స్థానంలో ఆత్మగౌరవంతో బ్రతికే ప్రత్యామ్నాయ జీవన విధానానికి బోధించాలి.
భారత రాజ్యాంగ ప్రదర్శన చేయాలి..
ఉప వర్గీకరణ ద్వారా కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే లబ్ధి జరుగుందని మేధావులు భావన. ఇదే ఈ జాతి యొక్క అంతిమ లక్ష్యంగా భావించడం పొరపాటు. ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయి, మరొవైపు ప్రైవేటీకరణతో రిజర్వేషన్ కు గండిపడుతుంది. ఇప్పుడు డప్పులే మన అస్తిత్వానికి ప్రతికగా అనుకుంటే మనం బాగుపడలేము. బాగా చదివి విద్యా, ఉద్యోగాలలో రాణించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాప్రతినిధులుగా మన జాతి గౌరవాన్ని నిలబెట్టాలి. కానీ డప్పుల ప్రదర్శన వంటి అసంబద్ధమైన, అశాస్త్రీయమైన కార్యక్రమాల ద్వారా జాతిని అగౌరపరచుకోవద్దు. వర్గీకరణ అనేది ఒక జాతి సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్య. దీనికి ఎమ్మార్పీఎస్ కృషి చేసిందనేది కాదనలేము, కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. కావున రాజకీయ యుద్ధమే మాదిగ జాతి యొక్క అంతిమ లక్ష్యం కావాలి. ఇందులో మాలలను కూడా కలుపుకొని సమైక్యంగా ముందుకెళ్లాలి. ఏ పార్టీలకు లొంగక స్వశక్తితో మాదిగ సమాజం సాంస్కృతిక నిర్మాణం జరగాలి. సంతు రవిదాస్ యొక్క సాంస్కృతిక మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లాలి. భారత రాజ్యాంగం కల్పించిన ఓటనే ఆయుధంతో రాజ్యాధికార యుద్దం చేయాలి. బుద్ధుడు, పూలే, అంబేడ్కర్, కాన్సరాం మార్గంలో నడవాలి. అనేక కులాలు తమ కులవృత్తులను వదిలి సమాజంలో ఉన్నతంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మాదిగ నాయకులు ఆదిమ కాలం నాటి సంస్కృతిని ప్రోత్సహించడం సరైనది కాదు. యువతను విద్యా, ఉద్యోగాల్లో రాణించమని చెప్పాలి. రాజకీయ వాటా కోసం ప్రశ్నించాలి. ఏనాడైనా అంబేద్కర్ ఈ డప్పుల ప్రదర్శనలతో, ఆటపాటలతో మీటింగ్ లు పెట్టాడా?. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా సూట్ ధరించి ఆత్మ గౌరవంతో ప్రపంచం ముందు నిలుచున్నాడు. కావున ఇప్పుడు మాదిగల అస్తిత్వాన్ని నిలబెట్టాకోవాలనుకుంటే లక్ష డబ్బులు వదిలి, లక్ష భారత రాజ్యాంగాలను పట్టుకొని ప్రదర్శన చేయించాలి. ఎందుకంటే సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రశ్నించే అవకాశాన్ని భారతరాజ్యంగమే ఇచ్చింది. ఇదే నిజమైన సాంస్కృతిక అస్తిత్వానికి నిదర్శనం.
సంపతి రమేష్ మహారాజ్
సామాజిక విశ్లేషకులు, 7989579428