మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే తెలంగాణలో కులగణన సర్వే చేయిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేసిందని, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు. బీసీల ఓట్ల కోసమే కులగణన అనే కొత్త నాటకాన్ని మొదలుపెట్టిందని అన్నారు. చేతివృత్తులకు చేయూతనిస్తూ, బలహీన వర్గాలకు విద్య, వృత్తి లాంటి అన్ని అవకాశాల్లో బీఆర్ఎస్ ఆసరాగా నిలిచిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు.