Friday, November 22, 2024
spot_img

అక్రమార్కులకు అండగా సీజీఎం

Must Read
  • ట్రాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ ఆఫ్ డీటీఆర్ పేరుతో భారీ కుంభ‌కోణం
  • 2022లోనే టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో స్కామ్‌
  • 47 మంది డీఈ, ఏడీఈ, ఏఈలను రక్షిస్తున్న మురళి కృష్ణ
  • స్క్వేర్ ఫీట్ పనులకు రూ. 56 కుగాను రూ. 384 చొప్పున వ‌సూలు
  • కోట్ల రూపాయల సర్కార్ సొమ్ము స్వాహా
  • ఆర్టీఐలో వివరాలు కోరగా సమాచారం ఇవ్వని వైనం
  • స.హ. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు సమాచారం ఇచ్చిన సి.జి.ఎం
  • సీజీఎంపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

‘కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది’ అన్నట్టు సర్కారు సొమ్మును కాపాడాల్సిన ఓ ఉన్నతాధికారి అక్రమార్కులకు అండగా నిలవడం చూస్తే సిగ్గుకే సిగ్గనిపిస్తుంది. లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు స్వలాభం కోసం పనిచేయడం విడ్డూరంగా ఉంది. గత పదేళ్లల్లో తెలంగాణ దోపిడీకి గురైందంటే ఎందుకో అనుకున్నారు.. ఒకరా.. ఇద్దరా ఎవడికి అందింది వాడు గుంట నక్కల్లా దోచుకు తింటే దోపిడీకి గురికాక ఏమైతది. ‘గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు’ అసలు పాలకులే పాపాలు చేస్తే ఇంకా అధికారులు ఏం చేస్తరు వాళ్లూ అదే తొవ్వలో పోతరు. రాజకీయ నాయకులే కాదు ఆయా శాఖలల్లో ఉన్నతాధికారులు సైతం సర్కారు ఆదాయానికి గండిపెట్టారనడంలో సందేహాం లేదు. తెలంగాణ వచ్చిందనే సంతోషం కన్న రాష్ట్రం ఎంత దోపిడికి గురైంది తెలిసినొళ్లు తలలు పట్టుకుంటున్నారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన అవినీతి, అక్రమాల లెక్కలు చూద్దామంటే హనుమంతుని తోకకంటే పెద్దదివిగానే ఉంటాయి.

అందులో భాగంగా టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో త‌వ్వినా కొద్ది భ‌య‌క‌ర‌మైన అవినీతి బాగోతాలు బ‌ట్ట‌బ‌య‌లు అవుతున్నాయి.. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అండ చూసుకొని అప్ప‌టి సీఎండీ ర‌ఘుమారెడ్డి స్మార్ట్‌గా ఉంటునే.. స్మార్ట్‌గా భారీ స్కామ్‌ల‌కు తెగ‌ప‌డ్డాడు.. తాజాగా దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో భారీ కుంభకోణం బయటపడింది. అందుకు సంబంధించిన వివరాలు ఆదాబ్ హైద‌రాబాద్‌ చేతికొచ్చాయి. పాత సీఎండీ రఘుమారెడ్డి, అతని అవినీతి శిష్యగణం కాసుల కోసం రూ.వేల కోట్ల స్కాం చేసేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయంలో మమ్ములను అడిగేవారేవ్వరన్నట్లు ఆయా డివిజన్ల పరిధిల్లోని కొందరు డీఈ, ఏడీఈ, ఏఈలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి కోట్లు దండుకున్నారు. నవ్విపోదుగాక నాకేంటి సిగ్గన్నట్లు టెండర్ లో కోడ్ చేసిన ప్రకారం కాకుండా ఇష్టారీతిన చేసిన పనులకు.. బిల్లులు అప్రూవల్ చేసేశారు.

రూ. 56 కుగాను రూ. 384 చొప్పున వ‌సూలు :
2016-2020 వార్షిక బడ్జెట్లలో టీఎస్ఎస్పీడీసీఎల్ లోని సుమారు 20 డివిజన్ల పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు కంచె వేసేందుకు సంబంధిత డీఈలు ఓపెన్ టెండర్ల ద్వారా గుత్తేదార్లను బిడ్డింగ్స్ కు ఆహ్వానించారు. ఈ బిడ్డింగ్స్ లోని నిబంధనల ప్రకారం ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ 5 ఫీట్ల పొడగు, 4 ఫీట్ల వెడల్పుతో ఇనుప కంచె వేయాల్సి ఉంటుంది. డీటీఆర్ (ట్రాన్స్ ఫార్మర్) చుట్టు మొత్తం 120 ఫీట్లతో పెన్సింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇనుప కంచె తప్పకుండా 7 ఫీట్లు ఉండేలా గుత్తేదారు చూసుకోవాలి. పెన్సింగ్ చుట్టు ఇనుప ముళ్లతో కూడిన వైర్ ఏర్పాటు చేయాలి. కంచె చుట్టు మొత్తం 8 ఇనుప రాడ్స్ ను పోస్టులుగా ఏర్పాటు చేసి.. వాటి కింద కాంక్రిట్ నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. పెన్సింగ్ పూర్తైన తర్వాత దానికి ఒక గేట్ ను కూడా అమ‌ర్చాలి.. అయితే ఇంతవరకు బాగానే ఉన్న పెన్సింగ్ నిర్మాణ పనుల్లో అనేక గోల్ మాల్ పనులు జరగడం గమనార్హం. గుత్తేదారు ఎస్టిమేషన్ కు క్షేత్ర స్థాయిలో పనులకు అస్సలు సంబంధం లేకపోవడం ఆశ్చ‌ర్యాన్ని క‌ల్గిస్తుంది. చేసిన పనులకు ఇచ్చిన బిల్లులకు కూడా అస్సలు పోలిక లేకపోవడం గమ్మత్తుగా ఉంది. ఎస్టిమేషన్స్ ప్రకారం పనులు జరగకున్నా.. సంబంధిత బిల్లులను ఆయా డివిజన్లలోని డీఈలు పాస్ చేయడం బాధాకరం. నిబంధనల ప్రకారం ఫీట్ కు ఏరియాను బట్టి ఎస్టిమేషన్ లెక్కలు వేయాలి.. మామూలుగా అయితే ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు 120 ఫీట్లకు మించి పెన్సింగ్ వేయాల్సి పనిలేదు. కానీ, అనేక చోట్ల 600 ఫీట్ల కంచె వేసినట్లు ఎస్టిమేషన్ వేసి బిల్లులు పాస్ కావడం గమనార్హం. మరికొన్ని చోట్ల స్క్వేర్ ఫీట్ కు రూపాయి చెల్లించాల్సిన చోట అంతకు 14 రెట్ల అధిక మొత్తాన్ని చెల్లించారు. అలాగే వికారాబాద్ జిల్లా దోమలో మాత్రం క్వాంటిటిని తగ్గించినప్పటికీ.. స్వ్కేర్ ఫీట్ కు రూ . 56 వేసే రేట్ ను మాత్రం అమాంతం పెంచేశారు. ఇక్కడ ఒక్క ఫీటు కంచె వేసేందుకు రూ.384 అయినట్లు చూపించడం గమనార్హం. ఈ విధంగా సుమారు 20 డివిజన్లలో పనులు నిర్వహించి, అక్రమంగా సుమారు రూ. 1200 కోట్ల బిల్లులు వసూలు చేసినట్లు 2022లోనే నిర్ధారించడం జరిగింది.

ఆర్టీఐ ద్వారా తప్పుడు సమాచారం :

సమాచార హక్కు చట్టం ద్వారా ఈ అవినీతికి పాల్పడిన డీఈ, ఏడీఈ, ఏఈ లపై శాఖ పరమైన చర్యలు తీసుకోని సర్కార్ సొమ్మును రెవిన్యూ రికవరీ ఆక్ట్ ప్రకారం రికవరీ చేస్తామని తెల్పడం జరిగింది. కానీ, ఈ రోజు వరకు కూడా అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకుండా లోపాయకారి ఒప్పదాలు చేసుకొని భారి మొత్తంలో డబ్బులు దండుకొని, సర్కార్ సొమ్ము రికవరీ చేయకుండా చీఫ్ జెనరల్ మేనేజర్ మురళి కృష్ణ అవినీతి అధికారులను రక్షిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదే విషయమై ఆదాబ్ హైదరాబాద్ 08-04-2024న సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతికి పాల్పడిన 47మంది అధికారుల పై తీసుకున్న చర్యల వివరాలు, అవినీతి సొమ్మును రికవరీ చేసినచో వాటికీ సంబందిచిన వివరాలు తెల్పాల్సిందిగా కోరడం జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 47మంది అవినీతి అధికారులకు వివిధ డివిజన్ లలో తిరిగి పోస్టింగ్ లు ఇచ్చినట్లు తెలుస్తుంది. వాటి వివరాలు కూడా కోరడం జరిగింది. కానీ, చీఫ్ జెనరల్ మేనేజర్ మురళి కృష్ణ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. కోరిన సమాచారం చాలా పెద్దది.. దానిని ఉత్పత్తి చేయడం వలన అందుబాటులో ఉన్న పరిమిత మానవ వనరులపై అపారమైన ఒత్తిడి ఉంటుంది. ఈ పని కోసం అటువంటి వనరులను మళ్లించడం ఖర్చుతో కూడుకున్నది. రాష్ట్ర కమీషన్ మరియు సెంట్రల్ కమీషన్ కూడా ఏ పబ్లిక్ అథారిటీకి చెందిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దరఖాస్తుదారు కోరిన సమాచారం కారణంగా ఏదైనా సమాచారాన్ని కొత్తగా సృష్టించి, రూపొందించాలని ఆశించరాదని కూడా పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సమాచారం కోరిన వ్యక్తికి, ఆర్టీఐ చట్టం, 2005 ప్రకారం సమాచారం ఇవ్వలేమని తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు.

‘ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు’ ప్రభుత్వ నౌకరు చేస్తూ అవినీతి అధికారులకు అండగా నిలుస్తున్న సి.జి.ఎం మురళి కృష్ణపై సిఎండి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అవినీతికి పాల్పడిన 47 అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోని, అవినీతి సొమ్మును రికవరీ చేయాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS