Friday, November 22, 2024
spot_img

సవాలు చేసాను అయ్యా!

Must Read

పూర్తిగా చదవటానికి సమయం,ఆసక్తి లేని వారి కోసం,సంక్షిప్తంగా, అంశంలోకి సూటిగా పోతే,ఒక అబ్బాయి చెప్పిన మాట :పేరు చినముని అనుకుందాము.అతని పరీక్షలు ఆగష్టు 5 నుంచి ప్రారంభం.ఆలోపులో అతను తెలుగు పరీక్షకి సిద్ధం కాలేడు.అందుకే తెలుగు సంగతి ప్రస్తుతానికి మర్చిపో,అని చెప్తే అతను అన్న మాట “రిషి తో సవాలు చేసాను అయ్యా, అతన్ని ఈ సారి పరీక్షలో ఓడగొడతానని”.నాకు ముద్దేసింది. ముచ్చటేసింది.మీకు చెప్పాలనిపించింది.అదీ పోటీ తత్వం అంటే.”కష్ట పడి చదువుతా,ఎలాగైనా వాణ్ని ఓడగొట్టాలి అయ్యా!”అదీ పౌరుషం అంటే.పెద్దలు కూడా ఇలా ఉంటె ఇల భూతల స్వర్గం కాదా?

ఓపిక ఉండి,వివరాలు కావాలనుకునేవారి కోసం -కొనసాగిస్తా చెప్పడం ఇంకా.

ఆ అబ్బాయి ఏడో తరగతి.ఒక ప్రసిద్ధ పాఠశాలలో ఆరో తరగతి ఉత్తీర్ణుడై వచ్చాడు. ఆ పాఠశాలతో పూర్తిగా అసంతృప్తి చెందారు,తలిదండ్రులు, పిల్లాడు.నా దగ్గర గణితంలో చాలా బలహీనంగా ఉన్నాడని పెట్టారు.గణిత తర్ఫీదు ఇచ్చాను ప్రాథమికం నుంచి -ఎక్కాలు,గణిత నియమాలు,సూత్రాల నుంచి. అప్పుడు అంటే ఏదీ అర్ధం కాక అన్నీ జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించేవాడు.ఈ కాలంలో చాలా మటుకు నేర్చుకోవడం అంటే అదే. కానీ, నేను అలా కాకుండా ప్రతీది విడమర్చి వివరంగా చెప్పాను.ఫలితంగా గణితంలో ఆత్మవిశ్వాసం పెరిగింది.గణితాన్ని ఆస్వాదిస్తున్నాడు.ఇప్పుడు గణితం అంటే చాలా ఇష్టం.నా దగ్గర చదువుకునే మిగతా పిల్లల్ని పోటీకి రమ్మంటాడు. సరే, వేసవి సెలవులు అయిపోయాయి.ఇతన్ని ఇంకో ప్రఖ్యాత పాఠశాలలో ప్రవేశపెట్టారు. పాఠశాల తెరుచుకుంది.తరగతులు ప్రారంభం అయ్యాయి. 13000 రూపాయలు తీసుకుని అచ్చు పుస్తకాలు, రాత పుస్తకాలు, ఒక బడి సంచి లాంటివి ఇచ్చారట. ఏదో సెలవు వచ్చిందని ఊరు వెళ్ళాడు. అక్కడ ఆడుతూ పడ్డాడు, పాదం విరిగింది, కట్టు కట్టారు వైద్యులు.పాఠశాలకి సుమారు నెల రోజులు డుమ్మా. ఇతని గైర్హాజర్ లో ఒక పరీక్ష అయిపోయింది. అందులో రిషి ప్రథమస్థానంలో నిలిచాడు.మనవాడు కాలు కట్టు విప్పిన తరువాత బడిలో రంగ ప్రవేశం చేశాడు.పరిస్థితి అర్థం చేసుకున్నాడు.అది బాలుర, బాలికల పాఠశాల.వారం తరువాత నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాడు “రిషి ‘అతి’ చేస్తున్నాడు అయ్యా!”. నేను పెద్దగా పట్టించుకోలేదు. నా స్నేహితుడు కుమార్తె ఒకామె ఆంగ్లం ఇంటిపని ప్రశ్నలు గురించి అడుగుతున్నది.ఆ పనిలో నిమగ్నమై ఉన్నాను.

నిన్న ఉదయం చరవాణిలో మాట్లాడాడు.”మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, రావచ్చా?”నేను”ఆదివారం సెలవు కదా!”అతను”అవును అయ్యా! కానీ పరీక్షలు ఉన్నాయి.”అలా అభ్యర్దిస్తే ఎలా కాదనగలం? నా ఆదివారం పనులు పక్కన పెట్టి “సరే, రా” అన్నాను.మళ్లీ చరవాణి చేసాడు.”అయ్యా, మీ స్థల వివరాలు వాట్సాప్ లో పంపించండి.””రోజూ అమ్మ దింపుతుంది కదా, స్థలం నీకు తెలుసుకదా!””అమ్మ ఈ రోజు దించలేదు, నేను ఓలా వాడుకుని వస్తాను.”స్థలం వాట్సాప్ చేసాను. వచ్చాడు.తెలుగు, హిందీ కూడా బలహీనం.హిందీ చాలా నెమ్మది.వచ్చు,గానీ అభ్యాసం లేదు,మెల్లగా కూడబలుక్కుని చెప్తాడు,’ర’కి, ‘వ’కి, ‘ఖ’కి, ‘శ’ కి తికమకపడతాడు. ఒక దానికి వేరొకటి చదువుతాడు. రాత కూడా బాలేదు. సాధన లేదు కదా! నేను ముందే చెప్పాను కాబట్టి, హిందీ నకలు పుస్తకం చూసి రాయడానికి తెచ్చుకున్నాడు.రెండో పాఠం పరీక్షకు వస్తుంది.చదివి అర్థం చెప్పా.కష్టమైన పదాలకు ఉచ్ఛారణ తెలుగులో రాసి ఇచ్చా.కొంచెం అభ్యాసం చేసాడు.”అయ్యా, తెలుగు కూడా నేర్పండి.”నేను చిన్నప్పుడు ఒకటి తరువాత ఒకటి పూర్తిగా,స్పష్టంగా నేర్చుకున్నా.కాబట్టి అదే పద్ధతిలో నేను అన్నాను “హిందీ ముందు చెప్పినవన్నీ తిన్నగా నేర్చుకో.తరువాత తెలుగు నేర్చుకుందువు గాని.” తప్పకపోతే, తెలుగు సంగతి ఈ సారి వదిలె య్.పాఠశాల పరీక్షే గదా. తరువాత నేర్చుకుందువు గాని.” అప్పుడు అన్నాడు అలా.
అప్పుడు నేను అడిగాను.”రిషి అతి చేస్తున్నాడు,అన్నావు,ఏమి చేసాడు?”

వాడు ప్రథముడు కాబట్టి అందరూ వాడిని సంప్రదిస్తున్నారు.వాడేమో అందరికీ తప్పులు పట్టి, చులకనగా వ్యవహరిస్తున్నాడు. వాడి అహంకారం అణచాలి. నేను అందుకే సవాలు చేసా.నేను లేనప్పుడు ప్రథముడు గా రావడం కాదు, నేను ఉన్నప్పుడు వచ్చి చూపించమని.ఈ సారి నేను ఎంత కష్టపడి అయినా, ప్రథమ స్థానం సంపాదించి తీరాలి”

ఇది యదార్థ సంఘటన.తెలుగు వాడటం పెంపొందించటానికి కొంచెం భాష మార్చాను, పేర్లు కూడా మార్చాను అంతే. ఉదాహరణకి ముని నాతో ” ఛాలెంజ్ చేసాను సార్! “అన్నాడు.
‘ఓవరాక్షన్’ ని నేను అతి గా మార్చాను.

సీతారామ రాజు సనపల,

రక్షణ శాఖ పూర్వ శాస్త్రజ్ఞులు

7259520872

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS