- గత పాలకుల వల్ల గర్భిణులు రోడ్ల మీదే ప్రసవాలు
- మంచి రోడ్లు నాగరికతకు చిహ్నం
- సంక్రాంతి వరకు గుంతల రోడ్లు కనిపించొద్దు
- పరవాడలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గుంతలు లేని రోడ్లకు శనివారం అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో శ్రీకారం చుట్టామని తెలిపారు. గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని.. రోడ్ల మీద గర్భిణీలు డెలివరీ అయ్యారని.. ఈ పాపం గత పాలకులదే అంటూ మండిపడ్డారు. గుంతల రోడ్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఎంతోమంది చనిపోయారని అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఐదేళ్లలో రహదారుల కోసం కేవలం రూ.1000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. మంచి రోడ్లు నాగరికతకు చిహ్నమని.. అభివృద్ధికి ఆనవాళ్లు మంచి రహదారులు అని చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలన్నారు. వర్షం వస్తే గతంలో రోడ్లు స్విమ్మింగ్ ఫూల్‌ను తలపించే విధంగా ఉన్నాయన్నారు. రౌడీ రాజకీయాలు వద్దని.. అభివృద్ధి రాజకీయాలు కావాలని వెల్లడించారు. ‘‘నేను ఎక్కడకు వెళ్ళినా పరదాలు లేవు, చెట్లు కొట్టడం లేదు. మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. మంచి రోడ్లు వస్తాయి’’ అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలను, మద్యాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలన్నారు. డబ్బులు ఊరికనే రావు… సంపద సృష్టిస్తే డబ్బులు వస్తాయన్నారు. రూ.860 కోట్లు తో రాష్ట్రంలో మొత్తం గుంతలు పూడుస్తున్నామన్నారు. రాష్ట్రంలో జగన్ విధ్వంసం సృష్టించారన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను.. గాడిలో పెడతానని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని రోడ్లు వేస్తామని ఇందుకోసం ఒక పక్కా ప్రణాళిక వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
సురక్షిత ప్రయాణం కోసమే: మంత్రి నాదెండ్ల
మరోవైపు విశాఖపట్నం పూర్ణ మార్కెట్ రామకృష్ణ థియేటర్ వద్ద గుంతల పూడ్చివేత కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జనసేన, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గుంతలేని రహదారి కోసం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో రోడ్ల కోసం జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసిందని గుర్తుచేశారు. వైసీపీ కారణంగా ఈరోజు రోడ్లు గుంతలు పూడ్చుకునే స్థాయికి దిగజారాల్సి వచ్చిందన్నారు. ప్రజల సురక్షితవంతమైన ప్రయాణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
గుంతల రహిత రాష్ట్రంగా ఏపీ: మంత్రి రామానాయుడు
వచ్చే సంక్రాంతి నాటికి రూ.600 కోట్లతో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని విమర్శించారు. గత ఐదు సంవత్సరాల పాలనలో అద్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామన్నారు. జగన్ పాలనలో మ్యాప్‌ను చూసి కాకుండా గుంతల రోడ్లను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించే స్థాయికి జగన్ దిగజార్చారంటూ మంత్రి రామానాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.