సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ధనసరి అనసూయ సీతక్కతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమావేశంలో సీఎం వరద ప్రభావిత జిల్లాల అధికారులతో నేరుగా మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తూ, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు ఎటువంటి అంతరాయం లేకుండా అందేలా చూడాలని సూచించారు. అలాగే, స్థానిక స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తూ రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని, నష్టపోయిన గ్రామాల్లో సహాయక బృందాలు మరింత చురుకుగా పనిచేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.