- శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ భూదాన్ భూమిగా నిర్థారించిన తర్వాత చర్యలు చేపట్టిన రెవెన్యూ అధికారులు
- తుర్కయంజాల్ లో కబ్జాకోరులకు ఫుల్ సపోర్ట్
- సర్వే నెం.206(అ)లో 1.30 గుంటలు మాయం
- ‘రూ.45 కోట్ల భూమి హాంపట్’ శీర్షికతో ఆదాబ్ లో కథనం
- స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం
- సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారణ
- అయినా శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ పై చర్యలు శూన్యం
- వెంటనే భూదాన్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
- అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
- ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ పన్ను మదింపుపై అనేక అనుమానాలు..?
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు దొంగలకు సద్ది మోస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్రమాలు, అవినీతిని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా? అన్నట్లు ఉంది అధికారులు తీరు. ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, దేవాదాయ భూములను మింగుతున్న కబ్జాకోరులను కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నారంటే ఇక్కడ్నే అర్థం చేసుకోవచ్చు. తప్పు చేశారని రుజువు అయినప్పటికి వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారంటే వారి వెనుక ఎంత బలం ఉందో.. లేదంటే అధికారులు ఎంత డబ్బు ముట్టిందోనన్న డౌట్ రాకమానదు. ‘ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?’ అన్న సామెతను నిజం చేస్తున్నారు. అటు గవర్నమెంట్ ఆఫీసర్లు, ఇటు అక్రమార్కులు నీకింత, నాకింత అని పంచుకొని భూములను కొల్లగొడుతుంటే నడిమిట్ల ఈ జనానికెందుకో అనుకుంటున్నారు కొందరు అధికారులు. ‘రూ.45 కోట్ల భూమి హాంపట్’ శీర్షికతో ఆదాబ్ లో ఈ నెల 17న కథనం ప్రచురితం అయింది.
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్, కమ్మగూడ గ్రామం సర్వే నెం. 206(అ) ఎకరం 30గుంటల భూదాన్ భూమి కబ్జాకు గురైంది. అత్యంత కాస్లీ అయిన భూదాన్ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఈ భూమి విలువ సుమారుగా రూ. 45 కోట్లు ఉంటుంది. ఇంత విలువైన భూదాన్ భూమిని కబ్జా చేసి, నిర్మాణం చేపట్టినట్లు ఆదాబ్ హైదరాబాద్ లో భూదాన్ భూమి అన్యక్రాంతంపై వచ్చిన కథనాలకు స్పందించిన తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి తేది 20-02-2025న శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడం జరిగింది.
గతంలో మహానుభావులు భూదానోద్యమం చేసి ఎంతోమంది భూమి లేని నిరుపేదలకు భూములు ఇప్పించడం జరిగింది. కానీ, కొందరు అధికారులు స్వార్థప్రయోజనాల కోసం, అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ భూదాన్ భూములను అన్యక్రాంతం చేస్తున్నారు.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులను మచ్చిక చేసుకొని ఖరీదైన భూములను కొల్లగొడుతున్నారు. ఈ భూమిని కబ్జాచేసిన సదరు వ్యక్తులు కోట్లు సంపాదించారు. ఎన్నో ఏళ్లుగా భూమిని వాడుకుంటూ దాని ద్వారా భారీగా డబ్బు ఆర్జించారు. అంతేకాకుండా విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఆరు నెలలకు రూ. 1,54,625లు చొప్పున పన్నును విధించడం పలు అనుమానాలకు తావిస్తుందంటే.. ప్రతి సంవత్సరం రూ.3,09,250లు తుర్కయంజాల్ మున్సిపాలిటీకి శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ యాజమాన్యం పన్ను రూపంలో చెల్లిస్తున్నారు. అంటే ఇన్నాళ్లు భూదాన్ భూమిని కబ్జాచేసి యధేచ్ఛగా కన్వెన్షన్ హాల్ నిర్మించి కస్టమర్లనుంచి ఒక్కరోజుకు సుమారు రూ.3లక్షలు కన్వెన్షన్ హాల్ రుసుము కింది వసూలు చేస్తున్నారు.. అంటే భూదాన్ భూమిని అన్యక్రాంతం చేసి కోట్లు ఘడిస్తుండడం ఆశ్చర్యం..
మున్సిపల్, రెవెన్యూ అధికారులు భూదాన్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారు. కోట్లు విలువ చేసే భూదాన్ భూమి అక్రమార్కుల చెరలో పడితే ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. ఇకనైన తహసీల్దార్ గతంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో అన్యక్రాంతమైన భూదాన్ భూమిని కాపాడి, అట్టి భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ యాజమాన్యంపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని, అట్టి భూమిని ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించి, కన్వెన్షన్ హాల్‌పై సామ శ్రీనివాస్ రెడ్డి సంపాదించిన డబ్బును రెవెన్యూ రికవరీ ఆక్ట్ ప్రకారం రికవరీ చేయాలని, కబ్జాదారులకు సపోర్ట్ చేసిన అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.