మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించింది. తెలంగాణ నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు బాద్యతలు అప్పగించారు. జార్ఖండ్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పార్టీ సీనియర్ నేతలైన తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరికు బాద్యతలు అప్పగించారు.
దేశంలోని రెండు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర , జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20న మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ లో రెండు విడతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న తొలి విడత, 20న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 23న రెండు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ చేపట్టనున్నారు.