Friday, December 13, 2024
spot_img

ప్రజాస్వామ్య మనుగడకు వెన్నెముక..రాజ్యాంగం

Must Read

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దశ, దిశా,నిర్దేశాలు, విధి విధానాలు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, హక్కుల గురించి తెలియజేసే లిఖిత మైన మహత్తర గ్రంథమే భారత రాజ్యాంగం. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలో, ప్రజలకు పాలకులు ఏ విధమైన పరిపాలన చేయాలో తెలియజేసే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల సమన్వయం ఎలా ఉండాలో తెలిపేదే భారత రాజ్యాంగం. మన రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా చెప్తారు. ఇది దేశ ప్రజలకు ఒక భగవద్గీత, ఖురాను, ఒక బైబిల్ లాంటిదని చెప్పవచ్చును. రాజ్యాంగంలో 448 అధికరణాలు, 12 షెడ్యూల్ కలవు. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే రాజ్యాంగ ముసాయిదాను రూపకల్పన చేశారు. అందుకు ఒక కమిటీగా రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులను పరోక్ష ఎన్నిక ద్వారా, భారత్ సంస్థానాల నుండి 93 మంది, రాష్ట్ర శాసనసభల ద్వారా 292 మంది, చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ ప్రతినిధుల నుండి నలుగురిని, ఇలా 389 మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్ నిర్మాణం జరిగింది. దీనిని రాజ్యాంగ సభ గా చెప్పుకుంటారు. 1947 జూన్ మాసంలో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ ఆధ్వర్యంలో దేశ విభజన జరిగింది. ఆయన సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ (రాజ్యాంగ సభ) సభ్యుల సంఖ్యను 299 మందికి కుదించారు. ఈ రాజ్యాంగ సభ మొట్టమొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 211 మందితో సమావేశం జరిగింది. దీనికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానాఅబుల్ కలాం ఆజాద్, జేబీ కృపలానీ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సరోజినీ నాయుడు, టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైనవారు ఈ సభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డారు. వారి నేతృత్వంలో స్వతంత్ర భారత రాజ్యాంగం ముసాయిదాను తయారు చేశారు. ఈ ముసాయిదా కమిటీ (డ్రాఫ్ట్ కమిటీ) అధ్యక్షుడిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను 1947 ఆగస్టు 29న ఎన్నుకున్నారు.

రాజ్యాంగ నిర్మాణం: స్వతంత్ర భారత దేశానికి వెన్నుముకగా చెప్పుకునే భారత రాజ్యాంగం నిర్మాణానికి 2 సంవత్సరాల,11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగ రాతప్రతిని తయారు చేయుటకు రాజ్యాంగ సభ 11 సార్లు, సుమారు 165 రోజులు సమావేశమైంది. రాతప్రతిని తయారుచేసే క్రమంలో 2473 ప్రతిపాదనలు రాగా వాటిని పరిశీలించి 7635 సవరణలు చేసి రాతప్రతిని తయారు చేయడం జరిగింది. ఈ రాత ప్రతిని 1949 నవంబర్ 26 న రాజ్యాంగ ఆమోదించారు.1950 జనవరి 24న రాజ్యాంగ ప్రతి పై సంతకాలు చేశారు.ఆ తరవాత రోజున రాజ్యాంగ సభ రద్దయి జనవరి 26, 1950 న భారత రాజ్యాంగాన్ని అమలు లోకి తీసుక రావడం జరిగింది.

మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు 64 లక్షలు ఖర్చు కావడం జరిగింది.రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్ జాదా ఇటాలిక్ కాలిగ్రఫిలో చేతితో రాశారు. ప్రతి పేజీని అందంగా తీర్చి దిద్ది ఇంగ్లీష్,హిందీ భాషల్లో సైతం రాయడం జరిగింది. దీనిని పార్లమెంట్ భవన్ లోని గ్రంధాలయం లో హీలియం వాయువు నింపిన పెట్టెలో భద్రపరిచారు. ఈ రాజ్యాంగాన్ని పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని సందర్బాలలో సవరణలు చేస్తుంటారు.మన రాజ్యాంగం భారతీయుల స్వేచ్ఛ,సమానత్వ, సౌభ్రాతృత్వం పట్ల నిబద్ధతను తెలుపుతుంది. మొదటగా భారతదేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగా పేర్కొన్నారు. ఆ తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్వసత్తాక, సౌమ్య వాద, లౌకిక, ప్రజాస్వామ్య ,గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

భారత రాజ్యాంగం ఐక్యత, సమగ్రత, వైవిద్యత ల సమాహారం అని , దేశాన్ని ముందుకు నడిపే చోదక శక్తి రాజ్యాంగానికి ఉంటుందని గత సంవత్సరం రాజ్యాంగ సభ చారిత్రక 250 వసంతాల సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు.2015 లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత గూర్చి నేటితరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి నరేంద్ర మోడీ నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం గా జరుపుకోవాలని ప్రకటన చేశారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని గతంలో న్యాయ దినోత్సవంగా, సంవిధాన్ దివాస్ గా పిలుస్తారు. ఆ సందర్భంగా ముంబై లోని హిందూ మిల్స్ కంపౌండ్ లో అంబేద్కర్ స్మారక చిహ్నానికి పునాదిరాయి వేశారు. దేశం గర్వించే విధంగా స్మారక చిహ్నాన్ని నిర్మించడం జరిగింది. ఇది భారతీయులందరికీ గర్వకారణం. రాజ్యాంగం అనేది దేశ పరిపాలన వ్యవస్థకు ఒక అద్దం అలాంటిది. ఒక దిక్సూచి, ఒక వెన్నెముకగా చెప్పుకోవచ్చును. పాలకులు రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలి తప్ప దాని పరిధి దాటి పోకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో అనుభవం లేని పాలకులు ప్రాతినిధ్య సభలలో అడుగు పెట్టడం వల్ల ప్రజాస్వామ్య విలువలు అడుగంటి పోతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాస్వామ్య విలువలు సమాజంలో గొప్పగా అమలు కావాలంటే ముందుగా మన గ్రంథమైన “రాజ్యాంగం’

విలువలు, ఆదర్శాలు, చట్టసభల నిర్మాణం, న్యాయపరమైన సలహాలు , సూచనలు ఇలా అనేక అంశాలపై పాలకులకు అవగాహన కలిగినప్పుడే అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు అమలు అవుతాయని చెప్పవచ్చు. గతంలో రాజ్యాంగ దినం గూర్చి పాఠశాల ,కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలో వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ , డిబేట్, లాంటివి నిర్వహిస్తూ, రాజ్యాంగ ప్రవేశిక, ప్రతిజ్ఞ, రాజ్యాంగ నిర్మాణం పై అవగాహన కల్పించడం జరిగింది . కాబట్టి ఆ దిశగా రాజ్యాంగం నిర్మాణం విలువలు, రాజ్యాంగ చరిత్ర గురించి ముఖ్యంగా ప్రాతినిధ్య సభలోని ప్రతినిధులు,యువత, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అవగాహన చేసుకున్నప్పుడే సుపరిపాలన ప్రజలకు చేరువ అవుతుందని చెప్పవచ్చును.

కామిడి సతీష్ రెడ్డి, జడలపేట,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
9848445134.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS