Friday, March 14, 2025
spot_img

దొంగలకు సద్ది కడుతున్న జీహెచ్ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌

Must Read
  • లక్షల్లో పన్ను ఎగవేయడానికి, మార్టిగేజ్‌ ఎగవేయడానికి, ఓసి అవసరం లేకుండా పర్మిషన్‌ ఎలా తీసుకోవాలి..!
  • ఎల్బీనగర్‌ జోన్‌ సర్కిల్‌ 3 డి.సి తిప్పర్తి యాదయ్య కనుసన్నల్లో అవినీతి తతంగం..
  • ప్రభుత్వాన్ని లక్షలో మోసం చేస్తున్న అక్రమ నిర్మాణదారుడు..
  • దగ్గరుండి సపోర్ట్‌ చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..
  • ఈ అక్రమ నిర్మాణంపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు..
  • డోంట్‌ కేర్‌ అంటున్న మున్సిపల్‌ సిబ్బంది..

పచ్చగా పండిన చేనును పశువులు మేయకుండా కంచె వేస్తాడు రైతు.. కానీ ఆ అమాయక రైతుకు తెలియడం లేదు తాను వేసిన కంచే తాను పండిరచిన పంటను మేస్తోందని.. ప్రజలు కట్టే సొమ్ముతో జీత భత్యాలు తీసుకుంటూ వారికి సేవ చేయాల్సిన అధికారులే ప్రజల పాలిట కంటకంగా మారిపోతున్నారు.. డబ్బులు ముట్టజెపితే చాలు అవినీతి పరులకు కొమ్ము కాస్తున్నారు.. ఒక డీసీ స్థాయిలో ఉన్న అధికారి అంతులేని అవినీతికి పాల్పడుతూ ఉంటే.. ఎవరికీ చెప్పుకోవాలి..? ఇలాంటి అధికారులను ఆపై ఉన్నతాధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్ధం కాని ప్రశ్న.. ఎల్బీ నగర్‌ జోన్‌ 3 డీసీ నిస్సిగ్గుగా చేస్తున్న అవినీతి భాగోతం మీ కోసం..

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే రివార్డు ఇస్తాము.. సదరు నిర్మానదారుడు అవినీతికి పాల్పడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తాము.. అన్న మాటలు ఒట్టి నీటి మూటలుగానే మిగిలి పోయాయి.. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలో తీసుకొచ్చిన టి.ఎస్‌.బి.పాస్‌ వెబ్‌ సైట్‌ పారదర్శకత లేక అవినీతి అధికారుల చేతుల్లో కీలుబొమ్మగా మారి కోట్లు దండుకోవడానికి అక్షయపాత్రలాగా మారింది అనడానికి నిదర్శనం ఈ వార్త కథనం.. గతంలో డి.పి.ఎం.ఎస్‌.లో ఏ అధికారి పర్మిషన్‌ ఇచ్చిన వారి పేరుతో సహా కనపడేది.. ఇప్పుడు అలా కాదు.. ఎవరు ఇచ్చారో ఎవరికీ తెలియదు.. సిటిజెన్‌ సర్చ్‌లో ఒకవేళ ఏదైనా వెతకాలి అంటే సమాచారం దొరకడం లేదు.. మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ శాఖ పరంగా ఉన్నత అధికారులకు సమయం లేకపోవడం ఈ అవినీతిపై దృష్టి సారించే లేకపోవడం, అవినీతికి పాల్పడ్డ కిందిస్థాయి అధికారులకు ఒట్టి చివాట్లతో, మాటలతో సరిపెట్టడంతో మహా అయితే ఏమవు తుంది ఒక మాట అంటారండి.. అంతేగాని శాఖ పరమైన చర్యలు ఉండవు కదా..? అనే అలుసుతో కిందిస్థాయి టీపీఎస్‌, ఏ.సీ.పి. స్థాయి అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడు తున్నారు.. వివరాల్లోకి వెళ్తే..
రాక్‌ టౌన్‌ కాలనీ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రక్కన ఎల్బీనగర్‌ నుండి ఉప్పల్‌ వెళ్లే ప్రధాన రహదారి అనుకుని భారీ వాణిజ్య నిర్మాణం నిర్మిస్తున్నారు.. నాగోల్‌ డివిజన్‌ రాక్‌ టౌన్‌ కాలనీ, సర్వేనెంబర్‌ 66/11 మరియు 66/12, ప్లాట్‌ నెంబర్‌ 177 ఇంటి నెంబర్‌ 3-12-89, మన్సూరాబాద్‌ విలేజ్‌ బిల్డింగ్‌.. పర్మిషన్‌ ఫైల్‌ అప్లికేషన్‌ నెంబర్‌ 36 – 156/జి.హెచ్‌.ఎం.సి/0496/2024, పర్మిట్‌ నెంబర్‌ 36156/0297/ జిహెచ్‌ఎంసి/ జిహెచ్‌ఎంసి/2024..

హైవే రోడ్డును ఆనుకొని 324 గజాల స్థలంలో జిహెచ్‌ఎంసి నుండి ఒక్క అంతస్తుకు అనుమతులు తీసుకొని.. అదనంగా ఐదారు అంతస్తులతో భారీ కమర్షియల్‌ నిర్మాణం చేపడుతున్నారు. న్యాయంగా కమర్షియల్‌ అనుమతులు తీసుకోవాలంటే లక్షల్లోనే ఫీజు చెల్లించి 10శాతం మార్టిగేజ్‌ జి.హెచ్‌.ఎం.సి. సంస్థకు ఇచ్చి, సదరు నిర్మాణదారుడు కమర్షియల్‌ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తి అయిన తర్వాత అన్ని సక్రమంగా ఉంటేనే ఓసి సర్టిఫికెట్‌ వస్తుంది. సక్రమంగా లేకపోతే ఆక్యుపెన్సి సర్టిఫికెట్‌ రాదు.. ఇలా అయితే బ్యాంకులు కానీ ఇతర ఎమ్‌.ఎన్‌.సి కంపెనీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు అద్దెకు తీసుకోవడానికి విముఖత చూపిస్తాయి. ఇలా కాకుండా దొంగ తెలివితో, తప్పుడు ఆలోచనలతో 324 గజాల స్థలంలో 211 గజాల స్థలం నిర్మాణ యోగ్యంగా చూపిస్తూ.. మిగతాది రోడ్‌ పార్కింగ్‌ కోసం చూపిస్తూ.. మార్ట్‌ గేజ్‌ ఎగవేయడానికి జి.హెచ్‌.ఎం.సి. సంస్థకు ఎక్కువ పన్ను చెల్లించ కుండా.. దొడ్డిదారిలో గృహ నిర్మాణ అనుమతులు, అనగా రెసిడెన్షియల్‌ అనుమతులు తీసుకొని, ప్రభుత్వానికి ఎక్కువ పన్ను కట్టకుండా.. నామ మాత్రపు పన్ను కట్టి మార్టిగేజ్‌ చేయకుండా, ఫైర్‌ సేఫ్టీ నిబంధనలకు విఘాతం కలిగిస్తూ, ఎలాంటి సెట్‌ బ్యాక్స్‌ లేకుండా, ఐదు అంతస్తుల భారీ వాణిజ్య నిర్మాణాన్ని చేపట్టి ఉన్నాడు నిర్మాణ దారుడు.. ఈ అనుమతులు ఇచ్చిన స్థానిక మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి టిపిఎస్‌ ఎసిపి, డిప్యూటీ కమిషనర్‌ క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి సక్రమమైన రీతిలో అనుమతులు ఇవ్వ వలసి ఉంటుంది. ఒకవేళ కిందిస్థాయి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అవినీతికి పాల్పడితే, డిసి డిప్యూటీ కమిషనర్‌ స్థాయి అధికారి అప్రూవల్‌ ఇవ్వరు.. ఈ అక్రమ నిర్మాణ, అక్రమ పద్ధతిలో అనుమతులు సంబంధిత అధికారులకు సమ స్తాయిలో భారీ ముడుపులు అందాయి అనడానికి ఆధారాలు కనబడుతున్నాయి.

ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ప్రజలు సదరు అక్రమ నిర్మాణంపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసి, స్థానిక ఎల్బీనగర్‌ జోన్‌ సర్కిల్‌ 3 డిప్యూటీ కమిషనర్‌ తిప్పర్తి యాదయ్యని ప్రశ్నిస్తే.. నోటీసులు ఇచ్చాం కూల్చే అధికారం మాకు లేదు.. అవినీతిపరులుపై, అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకొనే అధికారం మాకు లేదు.. అనే సమాధానం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై జోనల్‌ కమిషనర్‌కి విన్నవించుకుంటే ఆయనకి టెక్నికల్‌ నాలెడ్జి లేక టౌన్‌ ప్లానింగ్‌ వారిపైనే ఆధారపడి వారినే పురమా యించడంతో.. తప్పుడు నివేదికలు ఇచ్చి ఆయనను మభ్యపెడుతున్న పరిస్థితి నెలకొంది.. టీ.ఎస్‌. బిపాస్‌ మున్సిపల్‌ యాక్ట్‌ ప్రకారం స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ టీం ఏర్పాటు చేసి, వారి ద్వారా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే ప్రధాన అధికారం జోనల్‌ కమిషనర్‌కి ఉంటుంది. ఆయన పట్టనట్లు వ్యవహరించడం చూస్తుంటే అవినీతి ఎక్కడి నుండి ఎక్కడికి పాకింది అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది..

ఈ అవినీతి తతంగంపై ఉన్నతాధికారుల వివరణతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని వస్తుంది ‘‘ఆదాబ్‌ హైదరాబాద్‌’’ .. ‘‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’’ ..

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS